నాణ్యత వల్లే భారతి సిమెంట్‌కు ఆదరణ
కమలాపురం: భారతి సిమెంట్ అగ్రగామిగా నిలిచిందంటే నాణ్యతే కారణమని భారతి సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (బీసీసీపీఎల్) సీఈఓ మార్కస్ ఓబెర్లె అన్నారు. వైఎస్ఆర్ జిల్లా నల్లింగాయపల్లె వద్ద ఉన్న ఫ్యాక్టరీలో ఆరవ వార్షికోత్సవాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మార్కస్ ఓబెర్లే మాట్లాడుతూ తమ పరిశ్రమ నెలకొల్పిన అనతి కాలంలోనే అందనంత ఎత్తుకు ఎదిగిందన్నారు. ఇదంతా పరిశ్రమ కార్మికులు, ఉద్యోగులు కలసి మెలసి పని చేయడం వల్లే సాధ్యమైందన్నారు.
సీఓఓ అనూప్ కుమార్ సక్సేనా మాట్లాడుతూ మార్కెట్లో తీవ్ర పోటీని తట్టుకుంటూ భారతి సిమెంట్ ముందు వరుసలో నిలిచిందంటే నాణ్యత ప్రమాణాలే కారణం అన్నారు. వర్క్స్ డెరైక్టర్ బీఎల్ఎన్ మూర్తి మాట్లాడుతూ సీఎస్ఆర్ కార్యకలాపాల్లో భాగంగా సమీప గ్రామాల్లో రోడ్లు, పారిశుద్ధ్యం, వైద్య శిబిరాలు, విద్యాభివృద్ధికి చేయూత నిస్తూ భారతి సిమెంట్ మిగిలిన పరిశ్రమలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. హెచ్ఆర్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులు, కార్మికులు కుటుంబ సభ్యుల్లా కలిసి మెలిసి పని చేయడం వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు. కార్యక్రమంలో ఫ్యాక్టరీ ప్రతినిధులు బాలాజి, భద్రన్, జీజీకే మూర్తి, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.