Queens University Research team
-
భారత్‌లోని పరీక్షతో బ్రిటన్‌లో చదవొచ్చు
న్యూఢిల్లీ: భారత్‌లో ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈతో పాటు ఇతర పోటీ పరీక్షల ద్వారా కూడా విద్యార్ధులను ఎంపిక చేసుకొనేందుకు సిద్ధంగా ఉన్నామని బ్రిటన్‌లోని క్వీన్ యూనివర్సిటీ తెలిపింది. సైన్స్, టెక్నాలజీ విభాగాల్లో వారికి అవకాశం కల్పిస్తామని వైస్ చాన్స్‌లర్ ఇయాన్ గ్రీర్ స్పష్టంచేశారు. సాధారణంగా యూకే యూనివర్సిటీలు లెవెల్–ఏ పరీక్షలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాయి. అయితే ప్రవేశ పరీక్షలకు వివిధ దేశాల్లో విభిన్న ప్రామాణికతలు ఉంటాయని, భారత్‌లోని పరీక్షలు తాము నిర్దేశించుకున్న స్థాయిలోనే ఉన్నాయని ఇయాన్ అన్నారు. చాలా మంది విద్యార్థులు ప్రతిభ ఉన్నా సీట్ల కొరతతో ఐఐటీల్లో చేరలేకపోతున్నారన్నారు. మరో అవకాశం లేక తక్కువ స్థాయి ఉన్న కాలేజీల్లో చేరతారన్నారు. ఇటువంటి ప్రతిభావంతులైన విద్యార్థులకు తమ కాలేజీల్లో చదివే అవకాశం కల్పిస్తామన్నారు. జేఈఈలాగే ఇతర జాతీయ స్థాయి పరీక్షలను కూడా పరిగణనలోకి తీసుకునే ఆలోచన చేస్తున్నామన్నారు. ఇప్పటికే పలు కార్యక్రమాల ద్వారా 200 మందికి పైగా భారత విద్యార్థులను చేర్చుకున్నామని, రానున్న అయిదేళ్లలో మరింత మందిని చేర్చుకోవడమే తమ లక్ష్యమని తెలిపారు. -
ఈ ట్యాబ్‌ను చుట్టేయొచ్చు!
టొరంటో: పురాతన కాలంలో రాజులు సమాచారాన్ని చేరవేసేందుకు ఉపయోగించే వస్త్రపు రోల్స్ తరహాలో చుట్టేయడానికి వీలుగా ఉండే ఓ టచ్ స్క్రీన్ ట్యాబ్లెట్‌ను కెనడాలోని క్వీన్స్ యూనివర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ‘మ్యాజిక్ స్క్రోల్’పేరిట దీనిని రూపొందించారు. సాధారణ ట్యాబ్లెట్లతో పోలిస్తే ఇది పరిమాణంలో చాలా చిన్నగా ఉండటంతో పాటు, తక్కువ బరువును కలిగి ఉంటుంది. ఈ తరహా ట్యాబ్లెట్‌ను తయారుచేయడం ప్రపంచంలో ఇదే తొలిసారి. దీనిలో త్రీడీ ప్రింటెడ్ సిలిండ్రికల్ బాడీతోపాటు రోల్ చేయడానికి వీలుగా ఉండే డిస్ప్లేను అమర్చారు. ఇక స్క్రీన్‌ను చుట్టేందుకు వీలుగా ఇరువైపులా రెండు రోటరీ చక్రాలను ఏర్పాటు చేశారు. ఈ చక్రాల్లో రోబోటిక్ యాక్యువేటర్స్ను అమర్చారు. వీటి సాయంతో స్క్రీన్‌ను ఆపరేట్ చేయవచ్చు. వీటితోపాటు ఈ ట్యాబ్‌లో కెమెరాను కూడా అమర్చారు. దీనిని మరింత చిన్నగా పెన్ను మాదిరి అభివృద్ధి చేయాలన్నదే తమ లక్ష్యమని వర్సిటీకి చెందిన ప్రొఫెసర్ రోయల్ వెర్టిగాల్ తెలిపారు. -
అన్నంలో పాషాణం అవుట్!
నీటిని నిల్వగట్టే పద్ధతిలో సాగైన బియ్యం ద్వారా మనిషి దేహంలోకి ప్రవేశించే పాషాణం(ఆర్సెనిక్) అనే భార ఖనిజం.. గుండె, మధుమేహ, నాడీమండల వ్యాధులు, ఊపిరితిత్తుల, మూత్రకోశ క్యాన్సర్ వంటి వ్యాధులకు కారణమవుతోంది. ఇతర ఆహార పంటల కన్నా నీటిని నిల్వగట్టే పద్ధతిలో సాగయ్యే వరి మొక్కలు పది రెట్లు అధికంగా పాషాణాన్ని గ్రహిస్తున్నాయని ఐరోపా ఆహార ప్రమాణ సంస్థ లెక్క తేల్చింది. ప్రపంచంలో సగం మందికి ప్రధానాహారమైన బియ్యంలో నుంచి పాషాణాన్ని తీసెయ్యడం ఎలా? అన్నం వండే ప్రక్రియలో మార్పులు చేయడం ద్వారా పాషాణం పీడ విరగడ చేయొచ్చని శాస్త్రవేత్తలు జరిపిన తాజా పరిశోధనలో వెల్లడైంది. ఉత్తర ఐర్లాండ్‌లోని క్వీన్స్ యూనివర్సిటీ పరిశోధక బృందం ఈ విషయంలో మంచి ఫలితాలు సాధించింది. అన్నం ఉడుకుతున్నంత సేపూ ఆ పాత్రలో నుంచి నీటిని నిరంతరం ప్రవహింపజేయడం ద్వారా అన్నంలో పాషాణాన్ని మూడొంతులకు పైగా తగ్గించగలిగారు. ఈ పరిశోధనలో భాగంగా ప్రత్యేకమైన కుక్కర్‌ను ఆవిష్కరించారు. క్వీన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ వృక్ష, భూ సాంకేతిక ఆచార్యుడు ఆండీ మొహ్రాగ్, ఆహారంలో ముఖ్యంగా బియ్యంలోకి చేరిన పాషాణాన్ని తొలగించేందుకు జరుగుతున్న పరిశోధనల్లో ఇది మైలురాయిగా నిలుస్తుందన్నారు. ఆరుతడి పద్ధతిలో రసాయనిక పురుగు మందులు వాడకుండా సాగు చేసిన బియ్యంలో ఆర్సెనిక్ బెడద అసలుండదా? తక్కువగా ఉంటుందా? అన్న ప్రశ్నలకు పరిశోధకులు సమాధానాలు వెతకాల్సి ఉంది.