అన్నంలో పాషాణం అవుట్!
నీటిని నిల్వగట్టే పద్ధతిలో సాగైన బియ్యం ద్వారా మనిషి దేహంలోకి ప్రవేశించే పాషాణం(ఆర్సెనిక్) అనే భార ఖనిజం.. గుండె, మధుమేహ, నాడీమండల వ్యాధులు, ఊపిరితిత్తుల, మూత్రకోశ క్యాన్సర్ వంటి వ్యాధులకు కారణమవుతోంది. ఇతర ఆహార పంటల కన్నా నీటిని నిల్వగట్టే పద్ధతిలో సాగయ్యే వరి మొక్కలు పది రెట్లు అధికంగా పాషాణాన్ని గ్రహిస్తున్నాయని ఐరోపా ఆహార ప్రమాణ సంస్థ లెక్క తేల్చింది. ప్రపంచంలో సగం మందికి ప్రధానాహారమైన బియ్యంలో నుంచి పాషాణాన్ని తీసెయ్యడం ఎలా? అన్నం వండే ప్రక్రియలో మార్పులు చేయడం ద్వారా పాషాణం పీడ విరగడ చేయొచ్చని శాస్త్రవేత్తలు జరిపిన తాజా పరిశోధనలో వెల్లడైంది.
ఉత్తర ఐర్లాండ్‌లోని క్వీన్స్ యూనివర్సిటీ పరిశోధక బృందం ఈ విషయంలో మంచి ఫలితాలు సాధించింది. అన్నం ఉడుకుతున్నంత సేపూ ఆ పాత్రలో నుంచి నీటిని నిరంతరం ప్రవహింపజేయడం ద్వారా అన్నంలో పాషాణాన్ని మూడొంతులకు పైగా తగ్గించగలిగారు. ఈ పరిశోధనలో భాగంగా ప్రత్యేకమైన కుక్కర్‌ను ఆవిష్కరించారు.
క్వీన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ వృక్ష, భూ సాంకేతిక ఆచార్యుడు ఆండీ మొహ్రాగ్, ఆహారంలో ముఖ్యంగా బియ్యంలోకి చేరిన పాషాణాన్ని తొలగించేందుకు జరుగుతున్న పరిశోధనల్లో ఇది మైలురాయిగా నిలుస్తుందన్నారు. ఆరుతడి పద్ధతిలో రసాయనిక పురుగు మందులు వాడకుండా సాగు చేసిన బియ్యంలో ఆర్సెనిక్ బెడద అసలుండదా? తక్కువగా ఉంటుందా? అన్న ప్రశ్నలకు పరిశోధకులు సమాధానాలు వెతకాల్సి ఉంది.