అవినీతిని ప్రశ్నిస్తే అంతేసంగతులు
తుని : ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించిన ఓ వ్యక్తిపై నాన్‌బెయిల్‌బుల్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. గతంలో పలువురు వైఎస్సార్సీపీకి నాయకులపైనా కేసులు బనాయించిన విషయం తెలిసిందే. తాజాగా తుని మండలం టి.తిమ్మాపురం గ్రామానికి చెందిన పోల్నాటి ప్రసాదరావును కేసులో ఇరికించారు. ప్రసాదరావు కథనం ప్రకారం.. ఉపాధి హామీ పథకంలో గతేడాది చేసిన పనులు, పని చే సిన కూలీల వివరాలను ఇవ్వాలని బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో ప్రసాదరావు లిఖితపూర్వకంగా ఎంపీడీఓ కె.భీమేశ్వర్‌కు ఫిర్యాదు చేశారు.
దీనిపై వివరాలను అందిస్తామని అధికారులు చెప్పడంతో తన గ్రామానికి వెళ్లిపోయాడు. గురువారం ఉదయం పట్టణ పోలీస్‌స్టేషన్ కానిస్టేబుళ్లు తిమ్మాపురం వెళ్లి ప్రసాదరావును తీసుకువచ్చారు. ‘తనను ఎందుకు తనను తీసుకువచ్చారు’’ అని ప్రసాదరావు పోలీసులను ప్రశ్నించాడు. ‘మీపై ఉపాధి హామీ పథకం టెక్నికల్ సిబ్బంది ఫిర్యాదు చేశారు’’ అని చెప్పిన పోలీసులు సాయంత్రం వరకు అతడిని స్టేషన్లో ఉంచి కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు.
అవినీతిని ప్రశ్నించినందుకే..
గతేడాది గ్రామంలో జరిగిన ఉపాధి పనికి తాను వెళ్లకపోయినా పని చేసినట్టు నమోదు చేశారని, ఇందుకు సంబంధించిన పేసిప్పులు పంపారని, పని చేయకపోయినా ఎందుకు తన పేరును నమోదు చేశారని అధికారులను నిలదీయడంతో తనపై అక్రమ కేసు బనాయించారని ప్రసాదరావు తెలిపారు. తప్పుడు సర్వే నంబర్లతో అధికార పార్టీ వ్యక్తులు కొందరు కొబ్బరి మొక్కలు వేసినట్టు రికార్డుల్లో నమోదు చేసి సొమ్మును స్వాహా చేశారన్నారు.
ఒక్క తిమ్మాపురంలోనే సుమారు రూ. 50 లక్షల మేర ఉపాధి సొమ్మును వారు దిగమింగారన్నారు. ఈ పనుల వివరాలను అడిగినందుకే కేసు పెట్టారని ఆరోపించారు. ఇదిలా ఉంటే.. ప్రసాదరావు ఎంపీడీఓ కార్యాలయంలో ఉన్న ఉపాధి హామీ పథకం సెక్షన్‌కు వెళ్లి విధి నిర్వహణలో ఉన్న టెక్నికల్ అసిస్టెంట్ సాయిని దుర్భాషలాడి, రూ.50 వేలు డిమాండ్ చేసినట్టు అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పట్టణ సీఐ బోను అప్పారావు తెలిపారు. అయితే కేసు పెట్టిన టెక్నికల్ అసిస్టెంట్ సాయి ఎవరో ప్రసాదరావు తెలియక పోవడం ఇక్కడ విశేషం.