సమాజ్‌వాదికి ఝలక్.. బీజేపీలోకి కీలక నేత
న్యూఢిల్లీ: సమాజ్‌వాది పార్టీకి తాజాగా ఓ సీనియర్ నేత ఝలక్ ఇచ్చారు. ఆ పార్టీ అనుసరిస్తున్న విధానాలు తనకు నచ్చడం లేదంటూ ఎస్పీలో కీలక అధికార ప్రతినిధిగా పనిచేసిన గౌరవ్ భాటియా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. గత ఫిబ్రవరిలోనే సమాజ్‌వాది పార్టీకి చెందిన అన్ని పదవులకు రాజీనామా చేసిన ఆయన తాజాగా బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు. సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ న్యాయవాదిగా ఉన్న గౌరవ్ భాటియా బీజేపీలో చేరకముందు సమాజ్‌వాది పార్టీ తరుపున జాతీయ చానెళ్లలో రాజకీయ చర్చల్లో పాల్గొనేవారు. ప్రత్యర్థులకు చుక్కలు చూపించేవారు.
విషయ పరిజ్ఞానంతోపాటు మంచి చతురత కలిగిన నాయకుడు అని కూడా గౌరవ్‌కు పేరుంది. అయితే, సమాజ్‌వాది పార్టీలో సామాజిక స్పృహ తగ్గిపోతుందని, సామ్యవాద భావాలు కొరవడుతున్నాయని, పరిపాలన కుటుంబానికి పరిమితమై పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ అన్ని పదవులకు తాను ఫిబ్రవరిలోనే రాజీనామాలు చేసినట్లు వెల్లడించారు. ‘నూతన భారత నిర్మాణం కోసం భారత ప్రధాని నరేంద్రమోదీ కొత్త ఆలోచనను ఇస్తున్నారు. ఆయన ఆలోచన విధానమే నన్ను బీజేపీలో చేరేందుకు స్ఫూర్తినిచ్చింది’ అని భాటియా తెలిపారు. అంకిత భావానికి, కలుపుగోలుతనానికి బీజేపీ పెట్టిందని కొనియాడారు.
సమాజ్‌వాది పార్టీలో మాత్రం రాజకీయ కుమ్ములాటలు ఎక్కువయ్యాయని, పార్టీపై పట్టుకోసం సాక్షాత్తు అఖిలేశ్ యాదవ్, ఆయన బాబాయి శివపాల్ యాదవ్ పోటీ పడ్డారని గుర్తు చేశారు. ఇక నుంచి తాను కూడా భారతదేశ అభివృద్ధిలో పాలు పంచుకుంటానని అన్నారు. గౌరవ్ భాటియా తండ్రి వీరేంద్ర భాటియా ములాయంసింగ్‌కు చాలా సన్నిహితుడు. ఆయన 2010లో చనిపోయారు. ములాయం సీఎంగా ఉన్నప్పుడు ఉత్తరప్రదేశ్ అడ్వకేట్ జనరల్‌గా పనిచేశారు. రాజ్యసభ సభ్యుడు కూడా అయ్యారు.