Quito
-
ఈక్వెడార్ ఎన్నికల నేపధ్యంలో వరుస హత్యలు
క్విటో: త్వరలో జరగనున్న ఈక్వెడార్ రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నాయకుల వరుస హత్యలు అక్కడ సంచలనం సృష్టిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితమే సిటిజన్ రివొల్యూషన్ పార్టీ రాష్ట్రపతి అభ్యర్థి ఫెర్నాండో విల్లావిసెన్షియా ప్రచార కార్యక్రమం నిర్వహిస్తుండగా కాల్చి చంపబడ్డారు. ఆ సంఘటన మరువక ముందే అదే పార్టీకి చెందిన మరో నాయకుడు పెడ్రో బ్రయోన్స్ ను ఆయన ఇంటి ముందే కాల్చి చంపారు దుండగులు. పెడ్రో బ్రయోన్స్ ఎస్మెరాల్డాస్ ప్రావిన్సులోని కొలంబియా సరిహద్దు ఉద్యమంలో కీలక నాయకుడు. ఈ హత్య అనంతరం సిటిజన్ రివొల్యూషన్ పార్టీ మరో రాష్ట్రపతి అభ్యర్థి లూయిసా గొంజాలెజ్ బ్రయోన్స్ కు నివాళులు అర్పిస్తూ.. పెడ్రో బ్రయోన్స్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రస్తుతం ఈక్వెడార్‌లో రక్తం ఏరులై పారుతోందని చెబుతూ హత్యా రాజకీయాలకు పాల్పడుతున్న ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇప్పుడున్న ప్రభుత్వం నేర సామ్రాజ్యాన్ని విస్తరించిందని చెబుతూనే ఇదొక పనికిమాలిన ప్రభుత్వంగా ఆమె వర్ణించారు. ఆగస్టు 9న సిటిజన్ రివొల్యూషన్ పార్టీ అధ్యక్షుడి రేసులో ఉన్న ఫెర్నాండో విల్లావిసెన్షియాను అత్యంత కిరాతకంగా చంపబడ్డారు. క్విటో నగరంలో ఒకచోట ప్రచార కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని తన వాహనంలోకి వెళ్తుండగా దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు. చుట్టూ సెక్యూరిటీ వలయం ఉండగానే హత్య జరగడం విశేషం. అవినీతికి వ్యతిరేకంగా విల్లావిసెన్షియా తన స్వరాన్ని చట్టసభల్లో చాలా బలంగా వినిపించేవారు. ఇదే క్రమంలో ఈసారి జరగబోయే ఎన్నికల్లో విల్లావిసెన్షియా అధ్యక్షుడి రేసులో ముందువరసలో ఉన్నారు. కానీ ఎన్నికలు జరిగే లోపే ప్రత్యర్థి తుపాకీ గుళ్లకు బలయ్యారు. ఎన్నికల తంతు ముగిసేలోపు ఇంకెన్ని హత్యలు చూడాల్సి వస్తుందోనని ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటూ రోజులు వెళ్లదీస్తూ ఉన్నారు. ఇది కూడా చదవండి: Viral Video: కూతురి గదిలోకి దూరిన బాయ్‌ఫ్రెండ్.. ఏం చేశారంటే? -
ఒకరి వెంట ఒకరు...
న్యూయార్క్: ఈ ఏడాది వరుసగా నాలుగో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ లో మహిళల సింగిల్స్ విభాగంలో కొత్త చాంపియన్ రావడం ఖాయమైంది. యూఎస్ ఓపెన్‌లో ఆదివారం ఒక్కరోజే మహిళల సింగిల్స్ టాప్–10లోని నలుగురు సీడెడ్ క్రీడాకారిణులు ఓడిపోయారు. నాలుగో సీడ్, ఈ ఏడాది వింబుల్డన్ టైటిల్ నెగ్గిన కెర్బర్ (జర్మనీ), ఐదో సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్), ఆరో సీడ్ గార్సియా (ఫ్రాన్స్), పదో సీడ్ ఒస్టాపెంకో (లాత్వియా) మూడో రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. ఈ సంవత్సరం ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత, రెండో సీడ్ వొజ్నియాకి (డెన్మార్క్) రెండో రౌండ్లో... ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్, టాప్ సీడ్ హలెప్ (రొమేనియా) తొలి రౌండ్లోనే ఓటమి చవిచూశారు. మూడో రౌండ్లో 29వ సీడ్ సిబుల్కోవా (స్లొవేకియా) 3–6, 6–3, 6–3తో కెర్బర్‌పై, 22వ సీడ్ షరపోవా (రష్యా) 6–3, 6–2తో ఒస్టాపెంకోపై, 30వ సీడ్ కార్లా నవారో (స్పెయిన్) 5–7, 6–4, 7–6 (7/4)తో గార్సియాపై, 26వ సీడ్ సబలెంకా (బెలారస్) 7–5, 6–1తో క్విటోవాపై విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. పురుషుల సింగిల్స్‌లో నాలుగో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) మూడో రౌండ్లో నిష్క్రమించగా... రెండో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), ఆరో సీడ్ జొకోవిచ్ (సెర్బియా) ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకున్నారు. జర్మనీ ప్లేయర్ కోల్‌ష్రైబర్ 6–7 (1/7), 6–4, 6–1, 6–3తో జ్వెరెవ్‌పై గెలిచాడు. ఫెడరర్ 6–4, 6–1, 7–5తో కిరియోస్ (ఆస్ట్రేలియా)పై, జొకోవిచ్ 6–2, 6–3, 6–3తో గాస్కే (ఫ్రాన్స్)పై గెలిచారు. -
ఈక్వెడార్‌లో మరోసారి భూకంపం
క్వీటో: ఈక్వెడార్‌లో మరోసారి భూకంపం వచ్చింది. శుక్రవారం ఈక్వెడార్‌లో వచ్చిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.0గా నమోదు అయింది. ఇదిలా ఉంటే.. గతవారం ఈక్వెడార్‌లో సంభవించిన భూకంపం ధాటికి శుక్రవారం మృతుల సంఖ్య 587కు చేరుకుంది. వారిలో 539 మంది మృతదేహాలను వారి కుటుంబసభ్యులు గుర్తించారని ప్రభుత్వ ఉన్నతాధికారులు వెల్లడించారు. మరో 48 మృతదేహాలను గుర్తించవలసి ఉందన్నారు. అయితే మృతుల్లో 27 మంది విదేశీయులు ఉన్నారని తెలిపారు. వారిలో 10 మంది కొలంబియన్... ఆరుగురు క్యూబా... ఇద్దరు కెనడా... ఇద్దరు డొమినిక్ రిపబ్లిక్.... ఇద్దరు బ్రిటన్ దేశాలకు చెందినవారు కాగా.. ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, ఐర్లాండ్ దేశాలకు చెందిన వారు ఒక్కొక్కరు ఉన్నారని... మరోక మృతదేహాన్ని గుర్తించవలసి ఉందని వివరించారు. ఈ భూకంపంలో 5733 మంది గాయపడ్డారు. వారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారన్నారు. 163 మంది ఆచూకీ ఇంతవరకు లభ్యం కాలేదని తెలిపారు. -
నిజమండి! ఆ తాటిచెట్లు నడుస్తాయ్!!
హాలీవుడ్ ఎపిక్ 'ద లార్డ్ ఆఫ్ ద రింగ్' సినిమా చూస్తే.. అందులో చిత్రవిచిత్రమైన ప్రాణులతోపాటు నడిచే చెట్లు కూడా కనిపిస్తాయి. వేర్లతో సహా అవి చిత్రంగా నడుచుకుంటూ పోతాయి. ఆ వృక్షాలంతా వేగంగా కాకపోయినా కొంచెం నెమ్మదిగా నడిచే చెట్లు నిజంగానే ఉన్నాయి. వాటిని చూడాలంటే ఈక్వెడార్‌కు వెళ్లాల్సిందే. ఈక్వెడార్ రాజధాని క్విటోకు వాయవ్యంగా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుమాకో బయోస్ఫెర్ రిజర్వు ఉంది. యూనెస్కో గుర్తించిన ఈ అడవి అంచుకు వెళితే ఆహ్లాదకరమైన అందాలు, సహజ సుందరమైన దృశ్యాలే కాదు.. మనల్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తే నడిచే తాటిచెట్లు (పామ్ ట్రీస్) కనిపిస్తాయి. ఈ తాటిచెట్లు అడవంతా సంచరిస్తూ ఉంటాయి. ఈ చెట్లకు పెరిగే కొత్త వేర్లు క్రమంగా కొత్త ప్రాంతాలకు పాకుతూ పోవడం వల్ల వాటితోపాటు చెట్లు కూడా వెళ్తూ ఉటాయి. కొన్నిసార్లు రోజుకు రెండు, మూడు సెంటీమీటర్లు కూడా ఈ చెట్లు ప్రయాణిస్తుంటాయి. దాదాపు 20 మీటర్ల వరకు ఇవి నడువగలవు. 'భూసారం క్షీణిస్తుండటంతో దృఢమైన మూలాల కోసం ఈ చెట్లు పొడవైన కొత్త వేర్లను పెంచుతాయి. కొన్నిసార్లు ఈ వేర్లు 20 మీటర్ల దూరం వరకు పెరుగుతాయి' అని పురాతన వృక్ష పరిశోధకుడు పీటర్ వృసంకీ తెలిపారు. 'ఇలా కొత్త నేలలోకి తన వేర్లు స్థిరపడిన తర్వాత ఈ తాటిచెట్టు సహనంతో అటువైపు వంగుతాయి. పాత వేర్లు క్రమంగా గాలిలోకి లేస్తాయి. కొత్త వేర్లు పాతుకుంటాయి. ఇలా కొన్ని సంవత్సరాలపాటు ఈ ప్రక్రియ కొనసాగిన అనంతరం మంచి సూర్యరశ్మి, బలమైన భూసారమున్న ప్రదేశానికి ఈ చెట్టు చేరుతుంది' అని స్లోవాక్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ బ్రాటిస్లావాలో పనిచేస్తున్న పీటర్ వివరించారు. అయితే ఎన్నో జీవవైవిధ్య వింతలకు నెలవైన ఈ అటవీ ప్రాంతం ప్రస్తుతం పలు రకాల ముప్పులను ఎదుర్కొంటున్నది. పీటర్, స్థానిక గైడ్, పర్యావరణవేత్త థీయిరీ గ్రాషియా కలిసి కొన్ని నెలలపాటు ఈ అడవిలో గడిపి, ఎన్నో ఆటంకాలు, కష్టనష్టాలు ఎదుర్కొని.. ఇక్కడి విషయాలను వెలుగులోకి తెచ్చారు. ఈ మహారణ్యంలో 30 మీటర్లకుపైగా జలపాతాలు, బల్లి, కప్ప జాతులకు చెందిన నూతన జీవులను కనుగొన్నట్టు వారు వివరించారు.