మన్మోహన్ సింగ్‌ను విచారించాలి: దాసరి
న్యూఢిల్లీ : జిందాల్ గ్రూప్‌నకు బొగ్గు గనులను అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగే కేటాయించారని కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు ...కోల్ గేట్ స్కాంకు సంబంధించి సీబీఐ కోర్టులో లిఖితపూర్వకంగా సోమవారం అఫిడవిట్ దాఖలు చేశారు. బొగ్గు కుంభకోణంలో మన్మోహన్ సింగ్‌ను నిందితుడిగా చేర్చాలంటూ మధుకోడా చేసిన వాదనను దాసరి నారాయణరావు కూడా సమర్థించారు. బొగ్గు కుంభకోణంలో తనకు ఎలాంటి సంబంధం లేదని, జిందాల్ గ్రూపునకు బొగ్గు క్షేత్రాల కేటాయింపులు మన్మోహన్ సింగ్ చేశారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. మన్మోహన్‌ను విచారిస్తే వాస్తవాలు బయటకు వస్తాయని దాసరి పేర్కొన్నారు.
కాంగ్రెస్ రాజ్యసభ మాజీ ఎంపీ అయిన దాసరి నారాయణరావు 2006-09 మధ్యకాలంలో మన్మోహన్సింగ్ మంత్రివర్గంలో బొగ్గు శాఖ సహాయమంత్రిగా పనిచేశారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడే జిందాల్ తప్పుడు సమాచారం ఇచ్చి గనులు దక్కించుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. 2008లో జార్ఖండ్‌లోని బీర్భూమ్లో అమరకొండ ముర్గదంగల్ బొగ్గు బ్లాకును జేఎస్పీఎల్, గగన్ స్పాంజ్ అండ్ ఐరన్ కంపెనీలకు కేటాయించారు.
కాగా కోల్ గేట్ స్కాంలో దాసరి నారాయణరావుతో పాటు మొత్తం 14 మందిపై సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. జార్ఖండ్ మాజీ సీఎం మధుకోడా, పారిశ్రామిక వేత్త నవీన్ జిందాల్, బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి ఎస్సీ గుప్తాల్‌పై సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. దాసరితో పాటు 14 మందికి కూడా బెయిల్ మంజూరు అయింది.