‘రాజవంశా’నికి ప్రాణప్రతిష్ఠ!
కుతుబ్షాహీల సమాధులకు కళాత్మక నగిషీలు
- అంతర్జాతీయ ప్రమాణాలతో పునరుద్ధరణ పనులు చేపట్టిన విదేశీ సంస్థ
- అద్భుత ఫలితాలు సాధిస్తున్న ‘ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్’
- రూ.100 కోట్ల వ్యయంతో భారీ ప్రాజెక్టు
- అణువణువూ శోధించి.. లేజర్ స్కానింగ్, 3డీ స్కానింగ్ ద్వారా డాక్యుమెంటేషన్
- శిథిలమైన చోట పూర్వపు ఆకృతిలో నిర్మాణం.. వాటికి కళాత్మక నగిషీలు అద్ది పాత రూపం తీసుకొచ్చేందుకు కృషి
- ఇరాన్ సహా వివిధ దేశాల నుంచి నిపుణుల రాక
- ఇప్పటి వరకు 15 కట్టడాల పునరుద్ధరణ
400 ఏళ్లు పైబడిన భాగ్యనగర చరిత్రలో అడుగడుగునా అపూర్వ కట్టడాలెన్నో..! చార్మినార్, గోల్కొండ.. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ ఓ కళాఖండమే. భాగ్యనగరాన్ని సుసంపన్నం చేసిన కుతుబ్షాహీ పాలకుల టూంబ్స్ అందులో ప్రధానమైనవి. మొన్నటి వరకు ఆలనాపాలన లేక శిథిలావస్థకు చేరిన ఆ రాజవంశ సమాధులకు ఓ విదేశీ సంస్థ ప్రాణ ప్రతిష్ఠ చేస్తోంది. వాడిపోయిన ఉద్యానవనం శతాబ్దాల తర్వాత విరబూసేలా చేస్తోంది. మన చరిత్రకు సాక్షిగా నిలిచిన దక్కన్ పార్కు ఇప్పుడిక శిథిల చిరునామా కాబోదు. కళాత్మక నగిషీలతో ముస్తాబైన సుందర వనం..
సాక్షి, హైదరాబాద్: అసలే ఎండాకాలం.. భాగ్యనగరం భగభగమంటోంది. 42 డిగ్రీల ఉష్ణోగ్రత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ‘బాబోయ్ ఇంతటి ఎండల్లో రోజులు గడపడమెలా..?’అని జెనీవా నుంచి వచ్చిన 15 మంది ఆర్కిటెక్టులు గాబరాపడిపోయారు. తిరిగి తమ దేశానికి వెళ్లిపోవటమే మంచిదని అనుకున్నారు. కానీ ఒక్కసారి ఆ నిర్మాణాలను చూసిన తర్వాత అభిప్రాయాన్ని మార్చుకున్నారు. ఓ సామ్రాజ్యాన్ని ఏలిన పాలకుల సమాధులన్నీ ఒకేచోట కొలువుదీరిన చారిత్రక ప్రాంతాన్ని కళ్లారా చూసిన తర్వాత అన్నీ మరిచిపోయారు. రోజులు గడిచాయి.. ఆ అద్భుత నిర్మాణాలకు సంబంధించి 2 వేల 3డీ చిత్రాలతో డాక్యుమెంట్లు రూపొందాయి. వందల ఏళ్లనాటి కట్టడాలు.. ఇప్పుడే నిర్మించారా అన్నంత గొప్పగా రూపొందించే గొప్ప ప్రాజెక్టుకు అవి మూలమయ్యాయి.
తొలుత హుమాయున్ సమాధి పునరుద్ధరణ
తొలుత ఢిల్లీలోని మొఘల్ చక్రవరి హుమయూన్ సమాధి ఉన్న 300 ఎకరాల ప్రాంతాన్ని దాదాపు రూ.300 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ స్థాయిలో ‘ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్’తీర్చిదిద్దింది. ఇండో ఇరానీ శైలి నిర్మాణం కనిపిస్తే చాలు దాన్ని భావితరాలకు అందించే ఉద్దేశంతో పునరుద్ధరించాలన్న తపనతో ముందుకుపోతోంది. రెండో పునరుద్ధరణ ప్రాజెక్టు కోసం హైదరాబాద్ వచ్చింది. భాగ్యనగరాన్ని నిర్మించి ఏలిన కుతుబ్షాహీ రాజులు శాశ్వత విరామం తీసుకుంటున్న దక్కన్ పార్కును ప్రపంచంలోనే అద్భుత పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాలని సంకల్పించింది. 106 ఎకరాల విస్తీర్ణం.. 75 చారిత్రక కట్టడాలున్న ప్రాంతాన్ని దాదాపు రూ.100 కోట్లతో అంతర్జాతీయ స్థాయిలో పునరుద్ధరిస్తోంది.
అణువణువూ శోధించి, పూర్వపు నిర్మాణం ఎలా ఉందో హై రిసల్యూషన్ ఫొటోగ్రఫీ ద్వారా గుర్తించి, లేజర్ స్కానింగ్, 3డీ స్కానింగ్ ద్వారా డాక్యుమెంటేషన్ చేసి, ఆ తర్వాత డంగు సున్నం, కరక్కాయ, బెల్లం, కోడిగుడ్డు సొన, రాతి పొడిలాంటి సంప్రదాయ మిశ్రమాలను వినియోగించి.. శిథిలమైన చోట పూర్వపు ఆకృతి వచ్చేలా నిర్మించి, దానికి వెంట్రుక మందం మొదలు భారీ ఆకృతుల వరకు కళాత్మక నగిషీలు అద్ది పూర్వపు రూపం వచ్చేలా చేస్తోంది. ఇందుకోసం ఇరాన్ సహా వివిధ దేశాల నుంచి నిపుణులు వచ్చి స్థానిక సంప్రదాయ పని తెలిసిన మేస్త్రీల సాయంతో పనులు కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు 15 కట్టడాలను పునరుద్ధరించారు.
యునెస్కో గుర్తింపునకు అవకాశం
చార్మినార్, గోల్కొండ, కుతుబ్షాహీ సమాధులకు యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా కోసం గతంలో ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ వాటికి అతి చేరువగా ఆక్రమణలుండటంతో యునెస్కో తిరస్కరించింది. ఇప్పుడు కుతుబ్షాహీ సమాధులున్న ప్రాంతాన్ని సమూలంగా అభివృద్ధి చేస్తున్నందున ఆ ప్రాంతం యునెస్కో గుర్తింపు పొందటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే ప్రపంచ పర్యాటక పటంలో ఈ ప్రాంతం సగర్వంగా గుర్తింపు పొందుతుంది. విదేశీ పర్యాటకులు రెక్కలు కట్టుకుని వాలేలా చేస్తుంది.
ఇది దాదాపు 60 అడుగుల లోతున్న భారీ దిగుడుబావి. కుతుబ్షాహీ పాలకులు దీన్ని నిర్మించారు. గోల్కొండ పరిసరాల్లో వ్యవసాయానికి సాగు నీరందించేందుకు ఏర్పాటు చేసిన ఆరు నీటి వనరుల్లో ఇదీ ఒకటి. పేరుకు అది మామూలు బావి. కానీ చుట్టూ కళాత్మక ఒరలు.. దానికి నగిషీలు.. లోపలికి దిగేందుకు అందమైన మెట్లు.. వెరసి అదో అద్భుత కట్టడం. కానీ దాని ఆలనాపాలన సరిగా లేకపోవటంతో 2013లో భారీ వర్షాలకు ఓ వైపు గోడ కూలి బావిని కప్పేసింది. మళ్లీ నాలుగేళ్ల తర్వాత 2017లో అది పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. బావిని కూరుకుపోయేలా చేసిన శిథిలాలను వందలారీల మేర తొలగించటమే కాకుండా నగిషీలు పూర్వపు సొగసులద్ది ఇలా రూపొందించారు. ఇప్పుడు 30 లక్షల లీటర్ల నీటి సామర్థ్యంతో ఆ బావి
కనువిందు చేస్తోంది.
మహ్మద్ కులీ కుతుబ్షా సమాధి... పునరుద్ధరణకు ముందు, తర్వాత...