గెలుపోటములపై ‘స్వతంత్రుల’ ప్రభావం
గాజులరామారం, న్యూస్‌లైన్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బరిలో ఉన్న అభ్యర్థులే ఇతర అభ్యర్థుల గెలుపోటముల్లో ప్రభావం చూపబోతున్నారు. నియోజకవర్గంలోని ఓటర్లతో పాటు పోటీలో ఉన్న అభ్యర్థులు కూడా పరోక్షంగా విజయావకాశాలను నిర్ణయించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల బరిలో అధిక సంఖ్యలో అభ్యర్థులు పోటీలో ఉండడమే ఇందుకు కారణం. ఇప్పుడు అభ్యర్థులు తమకు ఎన్ని ఓట్లు వస్తాయన్న విషయాన్ని పక్కన బెట్టి తమ ప్రత్యర్థులకు పోల్ అయ్యే ఓట్లపై లెక్కలు వేసుకుంటున్నారు.
బరిలో 23 మంది అభ్యర్థులు
తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కుత్బుల్లాపూర్ అసెంబ్లీ స్థానానికి 23 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ప్రధాన, ప్రతిపక్షాలతో పాటు ఇతర పార్టీల నుంచి పోటీ చేసిన రెబల్స్, స్వతంత్రులు 9 మంది కూడా బరిలో ఉన్నారు. ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన ఇద్దరు ఇతర పార్టీల నుంచి పోటీ చేశారు. నియోజకవర్గంలోని 6లక్షలకు పైగా ఉన్న ఓటర్లలో 2.94 లక్షల మందే ఓట్లు వేశారు. వీరే బరిలో నిలిచిన 23 మంది అభ్యర్థుల భవితవ్యం నిర్ణయించనున్నారు.
పోలింగ్ శాతం తగ్గుదల... అభ్యర్థుల అయోమయం
2009 అసెంబ్లీ ఎన్నికలలో 3,13,160 ఓటర్లు ఉండగా, 2014 ఎన్నికల నాటికి అది 6,01,204కి పెరిగిన సంగతి తెలిసిందే. అంటే గత ఎన్నికలకన్నా ఈసారి అదనంగా 50 శాతానికిపైగా ఓటర్లు పెరిగారు. అభ్యర్థులు కూడా ఎన్నికల ముందు వరకు పెరిగిన ఓటర్ల శాతం చూసి తమ గెలుపుపై అంచనాలు వేసుకున్నా రు. కానీ పోలింగ్ శాతం గత ఎన్నికల కంటే తక్కువగా నమోదు కావడంతో వారి అంచనాలు తలకిందులయ్యాయి. అసలే రెబల్స్... దీనికి తోడు పార్టీలు మారిన ద్వితీయ శ్రేణి నాయకులు... దీంతో ఓట్లు చీలిపోయాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఎంఐఎం అభ్యర్థి బరిలో ఉండడంతో మైనార్టీల ఓట్లపై ప్రధాన పార్టీల అభ్యర్థులు పూర్తిగా ఆశలు వదులుకున్నారు. వీటన్నిటికితోడు బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్థులకు పోలయ్యే ఓట్లు తమ విజయంపై ఎక్కడ ప్రభావం చూపిస్తాయో అని ఆందోళనకు గురవుతున్నారు ప్రధాన పార్టీల అభ్యర్థులు. పోలింగ్ శాతం తగ్గుదల, పోలైన ఓట్లలో చీలిక, ఎక్కువగా స్వతంత్రులు, ఇతరులు పోటీలో ఉండడం తదితర విషయాలు అభ్యర్థుల ఆందోళనకు ప్రధాన కారణం. ఓటర్లతో పాటుగా బరిలో ఉన్న అభ్యర్థులు ఈసారి గెలుపోటములను నిర్ణయించనున్నారు.