R K Mathur
-
పేజీ జిరాక్స్కు రూ.750!
న్యూఢిల్లీ: సమాచార హక్కు(ఆర్టీఐ) చట్టం కింద రైల్వేను వివరాలు కోరే వారి వద్ద నుంచి ఒక్క పేజీ జిరాక్స్ కోసం ఏకంగా రూ.750లను వసూలు చేయడాన్ని ఆపేయాలని కేంద్ర సమాచార కమిషన్ ఆదేశించింది. ఆర్టీఐ నిబంధనలకు లోబడి పేజీకి రూ.2 మాత్రమే తీసుకోవాలంది. రాయ్పూర్వాసి ప్రశాంత్ కాటెల ఫిర్యాదును విచారిస్తూ ముఖ్య సమాచార కమిషనర్ రాధాకృష్ణ మాథుర్ ఈ ఆదేశాలిచ్చారు. టిక్కెట్టుతో ప్రయాణించిన వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికుల ట్రావల్ సర్టిఫికెట్ ఇవ్వాలని ఆర్టీఐ ద్వారా రైల్వేను ప్రశాంత్ కోరాడు. అయితే పేజీకి రూ. 750 చెల్లించాలని కోరడంతో అప్పీలెట్ అథారిటీని ఆశ్రయించాడు. దీంతో కేంద్ర సమాచార కమిషన్ కు వెళ్లాడు. -
‘షరతుల విరాళాలను అనుమతించలేం’
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి సహాయ నిధికి వచ్చే విరాళాల్లో షరతులను అనుమతించలేమని ప్రధానమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది. ఓ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తూ ప్రధాన సమాచార కమిషనర్ ఆర్.కె.మాథూర్కు ఇచ్చిన జవాబులో పీఎంవో ఈ విషయాన్ని తెలిపింది. ఢిల్లీకి చెందిన సమాచార హక్కు చట్టం కార్యకర్త దీప్చంద్ర శర్మ గతేడాదిలో పీఎంవోకి రూ.లక్ష చెక్కుని విరాళంగా ఇచ్చారు. తాను పంపిన రూ.లక్ష చెక్కుని దేశంలోనే అత్యంత పేదవాడికి ఇవ్వాలని లేని పక్షంలో తనకే ఆ చెక్కుని తిరిగి ఇవ్వాలని కోరాడు. తన చెక్కుని ఎవరికి ఉపయోగించారో తెలపాలని కోరుతూ ఆయన గత జూన్లో సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశాడు. దీనిపై స్పందించిన పీఎంవో ప్రధానమంత్రి సహాయనిధికి వచ్చే విరాళాల్లో షరతులను అనుమతించరంది.