ఒకే తాటిపై ఉద్యమిద్దాం
తిరుపతి(మంగళం), న్యూస్‌లైన్: టీటీడీ ఉద్యోగ సంఘాలన్నీ వర్గాలను ప క్కనపెట్టి ఒకే తాటిపైకి వచ్చి సమైక్యాంధ్ర కోసం ఉద్యమించాలని టీటీడీ రిటైర్డ్ టెంపుల్ డెప్యూటీ ఈవో ఆర్.ప్రభాకరరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం తిరుపతిలోని టీటీడీ మాధవం సముదాయంలో టీటీడీ ఉద్యోగ సంఘాల నాయకులు సమావేశం జరిగింది. ప్రభాకరరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్రలోని ఆరుకోట్ల మంది పరిస్థితి అధోగతిపాలవుతుందని తెలిపారు.
టెంపుల్ డెప్యూటీ ఈవో చిన్నంగారి రమణ మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లోనే టీటీడీకి ప్రత్యేక గుర్తింపు ఉందని, సమైక్యాంధ్ర కోసం టీటీడీ ఉద్యోగ సంఘాలన్నీ కలసికట్టుగా పోరాడితే రాష్ట్ర విభజనే ఉండదని అన్నారు. విభజన జరిగితే సీమాంధ్ర ప్రజలకు తాగు, సాగునీరు ఉండదని, ఉన్నత విద్యను అభ్యసించిన యువతకు ఉద్యోగావకాశాలు లేక కూలి పనులు చేసుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని టీటీడీ ఉద్యోగులు సమైక్యాంధ్ర కోసం ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ఉద్యమాలు చేసేటప్పుడు శ్రీవారి భక్తులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. టీటీడీలోని సమస్యలపైనా ఇలాగే కలసికట్టుగా పోరాడాలని టీటీడీ ఉద్యోగ సంఘాల నాయకులు కోరారు. రాష్ట్ర సమైక్యత కోసం టీటీడీ ఉద్యోగ సమైక్యాంధ్ర జేఏసీ కన్వీనర్‌గా ఆర్.ప్రభాకరరెడ్డిని ఉద్యోగ సంఘాల నాయకులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో అడిషనల్ సీవీఎస్వో శివకుమార్‌రెడ్డి, టీటీడీ పీఆర్వో రవి, శ్రీనివాసం ఏఈవో లక్ష్మీనారాయణయాదవ్, ఈఈ వెంకటేశ్వర్లు, టీటీడీ ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.