దళితుల కోసం ఆరు ప్రత్యేక కోర్టులు ఆర్.ఆర్.పాటిల్
సాక్షి, ముంబై: దళితుల కోసం ఆరు ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేస్తామని హోంశాఖ మంత్రి ఆర్.ఆర్.పాటిల్ ప్రకటించారు. అహ్మద్‌నగర్ జిల్లా జామ్ఖేడ్ తాలూకా ఖర్డా గ్రామంలో ఇటీవలే హత్యకు గురైన దళిత యువకుడు నితిన్ కుటుంబసభ్యులను పాటిల్ పరామర్శించారు. సుమారు 15 నిమిషాల పాటు చర్చలు జరిపి వారి కుటుంబ సమస్యలను తెలుసుకునేందుకు ప్రయత్నించారు.
అనంతరం పాటిల్ మీడియాతో మాట్లాడుతూ నితిన్‌ను హత్య చేసిన నిందితులకు కఠిన శిక్ష విధించేలా చూస్తామని చెప్పారు. ఈ కేసును వాదించేందుకు ప్రభుత్వం తరఫున న్యాయవాది ఉజ్వల్ నికమ్‌ను నియమిస్తామన్నారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో ఈ కేసు తీర్పు త్వరగా వచ్చేలా కృషి చేస్తామన్నారు.
పెండింగ్‌లో ఉన్న దళితుల కేసులను త్వరగా పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ఆరు కోర్టులను ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. దళితులపై జరుగుతున్న అత్యాచారాలకు అడ్డుకట్ట వేసేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని జిల్లా సూపరింటెండెంట్ పోలీసు రావ్‌సాహెబ్ శిందేకు ఆదేశాలు జారీ చేశామన్నారు.