విద్య విషయంలో ప్రభుత్వం క్షమించరాని తప్పు చేస్తోంది: రాచమల్లు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కూటమి ప్రభుత్వంలో విద్యావ్యవస్థ చీకటిని కమ్ముకుందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మబడి ఇస్తానని చెప్పిన టీడీపీ ప్రభుత్వం.. ఈ సంవత్సరం అమ్మఒడి ఇవ్వకుండా ఎత్తేశారని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు ఆరు నెలలు పూర్తి కావస్తోన్నా ఎలాంటి హామీలు అమలు చేయడం లేదని విమర్శించారు. ఈ ఆరు నెలల కాలంలో ప్రభుత్వం చేసిన తప్పులు చాలా ఉన్నాయన్నారు.ఈ మేరకు బుధవారం వైఎస్సార్ జిల్లాలో మాట్లాడుతూ.. ‘సమాజానికి అత్యంత అవసరమైన విద్య విషయంలో ప్రభుత్వం క్షమించడానికి వీలులేనంత తప్పు చేస్తోంది. అక్షరాభ్యాసం పెంచాలని గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంత ప్రయత్నం చేశాడో.. ఈ ఆరు నెలలకాలంలోనే కూటమి ప్రభుత్వం అంత నిర్లక్ష్యం చేసింది. జగన్ ప్రభుత్వంలో విద్యా విధానానికి స్వర్ణ యుగమని చెప్పవచ్చు. అయిదు సంవత్సరాలు కుంటు లేకుండా అమ్మబడి ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మబడి ఇస్తానని చెప్పారు. ఈ సంవత్సరం అమ్మఒడి ఇవ్వకుండా ఎత్తేశారు. వైఎస్ జగన్ హయాంలోని ‘నాడు-నేడు’ చాలా గొప్ప పథకం. రాష్ట్ర ఎల్లలు దాటి భారతదేశ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ విద్యా విధానాన్ని ప్రశంసించారు. ఇప్పుడు నాడు నేడు అనే స్కీమే ఎత్తేశారు. 8వ తరగతి వారికి ఇచ్చే ట్యాబ్ల పథకం అటకెక్కింది. వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేయడం విద్యార్థులకు శాపం లా మారింది.’ అని మండిపడ్డారు.