కాంగ్రెస్‌లో దుమారం: మహిళా నేత తీవ్ర ఆరోపణలు
న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో దుమారం చెలరేగింది. ఢిల్లీ మహిళ కాంగ్రెస్ విభాగం అధ్యక్షురాలు రచన సచ్‌దేవా పార్టీ సీనియర్ నేతలపై తీవ్ర ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేంద్ర మాజీ మంత్రి, ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ మాకెన్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శోభా ఓజా, నెట్టా డిసౌజాలు తనను మానసికంగా వేధించి, బెదిరించారని రచన బాంబు పేల్చారు. త్వరలో జరిగే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు (ఎంసీడీ) టికెట్ల పంపణీలో అక్రమాలు జరిగాయని, ఈ విషయాన్ని ప్రస్తావించినందుకు కాంగ్రెస్ నేతలను తనను బెదిరిస్తున్నారని వెల్లడించారు. ఢిల్లీలోని తుగ్లక్ రోడ్డు పోలీస్ స్టేషన్లో ఆమె ఈ మేరకు ఫిర్యాదు చేశారు.
ఎంసీడీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ టికెట్ల పంపిణీలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపిస్తూ ఆ పార్టీ సీనియర్ నేత ఏకే వాలియా ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేశారు. టికెట్ల పంపిణీలో పార్టీ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని, అక్రమాలు జరిగాయంటూ అజయ్ మాకెన్‌కు ఆయన లేఖ రాశారు. టికెట్ల పంపిణీలో అక్రమాలకు పాల్పడుతున్నారని మరికొందరు కాంగ్రెస్ నేతలు కూడా ఆరోపించారు. మాజీ డిప్యూటీ స్పీకర్ అమృష్ సింగ్ కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఈ నెల 23న ఎంసీడీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సీనియర్ నేతలు తిరుగుబాటు చేయడం కాంగ్రెస్ పార్టీలో ఆందోళన కలిగిస్తోంది.