‘రేడియో రఘు’ ఇకలేరు
- ‘ఏఐఆర్’లో పాతికేళ్ల సేవలు
- ఘంటసాల, జీ ఆనంద్ సంగీత బృందంలో సేవలు
చెన్నై, సాక్షి ప్రతినిధి: ఆలిండియా రేడియో (చెన్నై) తబలా వాయిద్య కళాకారులు (రిటైర్డ్) మామిడేల రఘురామ్ (65) గురువా రం కన్నుమూశారు. ‘రేడియో రఘు’గా చిరపరిచితులైన ఆయన గత ఏడాదిగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన శిష్యులు, అభిమానుల నడుమ బీసెంట్‌నగర్ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరిగాయి. ఆయనకు భార్య దేవసేన, కుమార్తె ప్రీతి ఉన్నారు.పదేళ్లవయస్సులోనే తబలా వాయిద్యంపై మక్కువ పెంచుకున్న రఘురామ్ ఎటువంటి శిక్షణ పొందకుండానేభజనలు తదితర చిన్నపాటి కార్యక్రమాలకు సేవలందించారు.
ఆ తరువాత గానగంధర్వులు ఘంటసాల వెంకటేశ్వరరావు ఆశీస్సులతో జట్సన్ మాస్టారు వద్ద శిష్యరికం చేసి మెళకువలను నేర్చుకున్నారు. ఘంటసాల సంగీత దర్శకత్వంలో అనేక సినిమా పాటలకు వాద్యసహకారం అందించారు. అదే సమయంలో ప్రముఖ సంగీత దర్శకులు, సినీ నేపధ్యగాయకులు జీ ఆనంద్ నేతృత్వంలోని స్వరమాధురీ ట్రూప్‌లో ఉంటూ వేలాది సంగీత కచ్చేరీలు చేశారు.
సినిమా రంగంలో స్థిరమైన సం పాదన కష్టం, ఆలిండియా రేడియోలో ప్రయత్నాలు చేసుకొమ్మని ఘంటసాల ఇచ్చిన సూచనతో ప్రయత్నాలు ప్రారంభించారు. శాఖాపరమైన బీహై వంటి పరీక్షల్లో ఉత్తీర్ణులై కొన్నాళ్లు చెన్నై ఆలిం డియా రేడియోలో కాంట్రాక్టు కళాకారునిగా పనిచేశారు. ఆ తరువాత తిరుచ్చిరాపల్లి ఆలిండియా రేడియో కేంద్రంలో స్టాఫ్ ఆర్టిస్టుగా జాయినయ్యారు. అక్కడి నుంచి బదిలీపై చెన్నై వచ్చిన రఘురామ్ 2009లో ఉద్యోగ విరమణ పొందారు. ఉద్యోగంలో ఉండగానే స్వల్ప అనారోగ్యానికి గురైన ఆయన ఆ తరువాత కోలుకోలేకపోయారు.
నేటికీ మరువలేను : జీ ఆనంద్
తబలా ఆర్టిస్ట్‌గా వేలాది కచ్చేరీలలో తనతోపాటు వేదికను పంచుకున్న రఘురామ్ వాద్యనైపుణ్యాన్ని నేటకీ మరువలేనని అంత్యక్రియలకు హాజరైన స్వరమాధురీ అధినేత, సినీ సంగీత దర్శకులు, నేపధ్యగాయకులు జీ ఆనంద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐఆర్‌లో చేరిన తరువాత స్వరమాధురి కార్యక్రమాలకు దూరమై పాతికేళ్లు అవుతున్నా తమ మధ్య ఆత్మీయ అనుబంధం చెక్కుచెదరలేదన్నారు. కేవలం తబలా కళాకారునిగాగాక, కార్యక్రమ నిర్వహణలో ఒక మేనేజర్ వలే అన్నీ తానై చూసుకునేవారని గుర్తుచేసుకుంటూ భౌతికకాయం వద్ద నిలబడి కన్నీటిపర్యంతమయ్యూరు. రఘురామ్ అత్మకు శాంతి చేకూరాలని పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు.