మరో సంచలనం
మూడో సీడ్ రద్వాన్‌స్కా అవుట్
ప్రిక్వార్టర్స్‌లో ఫెడరర్, జొకోవిచ్
ఫ్రెంచ్ ఓపెన్
పారిస్: ఒకరోజు విరామం తర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌లో మళ్లీ సంచలనాల పర్వం మొదలైంది. ఇప్పటికే మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో నిరుటి రన్నరప్, రెండో సీడ్ నా లీ (చైనా)... రెండో రౌండ్లో టాప్ సీడ్, డిఫెండింగ్ చాంపియన్ సెరెనా విలియమ్స్ (అమెరికా) ఇంటిముఖం పట్టగా... మూడో రౌండ్లో మూడో సీడ్ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలండ్), తొమ్మిదో సీడ్ సిబుల్కోవా (స్లొవేకియా) ఓటమి పాలయ్యారు.
శుక్రవారం జరిగిన మూడో రౌండ్లో అన్‌సీడెడ్ ఐలా తోమ్లీఅనోవిచ్ (క్రొయేషియా) 6-4, 6-4తో రద్వాన్‌స్కాను బోల్తా కొట్టించగా... 19వ సీడ్ సమంతా స్టోసుర్ (ఆస్ట్రేలియా) 6-4, 6-4తో సిబుల్కోవాపై గెలిచింది. రెండో రౌండ్లో సెరెనాను ఓడించిన గార్బిన్ ముగురుజా (స్పెయిన్) 6-2, 6-4తో ష్కిమిద్లోవా (స్లొవేకియా)పై తోమ్లీఅనోవిచ్, స్టోసుర్లతో కలిసి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. మరో మూడో రౌండ్ మ్యాచ్‌లో ఏడో సీడ్ షరపోవా (రష్యా) ఒక్క గేమ్ కూడా కోల్పోకుండా 6-0, 6-0తో పౌలా ఒర్మాయెచా (అర్జెంటీనా)ను చిత్తు చేసింది.
పురుషుల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), నాలుగో సీడ్ రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) తమ ప్రత్యర్థులకు ఒక్కో సెట్ సమర్పించుకొని విజయం సాధించారు. మూడో రౌండ్లో జొకోవిచ్ 6-3, 6-2, 6-7 (2/7), 6-4తో 25వ సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా)పై, ఫెడరర్ 7-5, 6-7 (7/9), 6-2, 6-4తో 31వ సీడ్ దిమిత్రి తుర్సునోవ్ (రష్యా)పై గెలిచారు. మరో మ్యాచ్‌లో 18వ సీడ్ ఎర్నెస్ట్ గుల్బిస్ (లాత్వియా) 6-3, 6-2, 7-5తో రాడెక్ స్టెపానెక్ (చెక్ రిపబ్లిక్)ను ఓడించి ప్రిక్వార్టర్స్‌లో ఫెడరర్‌తో పోరుకు సిద్ధమయ్యాడు.
ప్రిక్వార్టర్స్‌లో బోపన్న జోడి
మిక్స్డ్ డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న (భారత్)-కాటరీనా స్రెబోత్నిక్ (స్లొవేకియా) జోడి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. తొలి రౌండ్లో ఈ జంట 7-6 (7/5), 7-5తో మార్క్ లోపెజ్ (స్పెయిన్)-హలవకోవా (చెక్ రిపబ్లిక్) ద్వయంపై గెలిచింది.