హోల్‌సేల్ బట్టల దుకాణం ‘టెక్స్‌ఫై’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: శ్రీనివాస్‌కు వరంగల్‌లో ఒక బట్టల దుకాణం ఉంది. చీరలు, డ్రెస్‌ల కోసం సూరత్, అహ్మదాబాద్, కోల్‌కతా వంటి ప్రాంతాలకు వెళ్లి హోల్‌సేల్‌గా కొంటుంటాడు. వెళ్లడం నుంచి ఉత్పత్తుల ఎంపిక, లాజిస్టిక్, లావాదేవీలు.. ప్రతిదీ ఇబ్బందే! కానీ, ఇప్పుడు శ్రీనివాస్.. జస్ట్ తన షాపులో కూర్చొని వేరే రాష్ట్రాల్లోని ఉత్పత్తులను కొంటున్నాడు. అదే... టెక్స్‌ఫై.కామ్ ప్రత్యేకత. టెక్స్‌ఫైలో వివిధ రాష్ట్రాలకు చెందిన 300కు పైగా గార్మెంట్స్ తయారీ సంస్థలు.. 15 వేలకు పైగా ఉత్పత్తులు ఉన్నాయి. విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తున్న టెక్స్‌ఫై గురించి మరిన్ని వివరాలు ఫౌండర్ రఘునాథ్ పెనుమూర్తి ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు.
‘‘మాది పశ్చిమ గోదావరి జిల్లా అల్లంపురం. డిగ్రీ పూర్తయ్యాక.. హైదరాబాద్‌లో ఓ స్టార్టప్ కంపెనీలో చేరా. నా రూమ్మేట్కు భీమవరంలో ఓ బట్టల షాపుంది. వాళ్ల నాన్న నెలకోసారి హైదరాబాద్‌కు వచ్చి హోల్‌సేల్‌గా చీరలు, పిల్లల బట్టలు వంటివి కొనుక్కెళ్లేవాడు. ప్రతిసారి లాజిస్టిక్ ఇబ్బందిగా ఉండేది. ఇదే విషయాన్ని ఓరోజు నాతో చర్చించాడు. అప్పుడే అనిపించింది గార్మెంట్స్ తయారీ సంస్థలను, రిటైలర్లను కలిపే కంపెనీ పెడితే బాగుంటుందని!! అదే టెక్స్‌ఫై.కామ్‌కు పునాది. రూ.30 లక్షల పెట్టుబడితో గతేడాది ఆగస్టులో విశాఖపట్నంలో దీన్ని ఆరంభించాం.
400 తయారీ సంస్థలు, 3 వేల రిటైలర్లు..
ప్రస్తుతం టెక్స్‌ఫైలో 300 తయారీ సంస్థలు నమోదయ్యాయి. సూరత్, అహ్మదాబాద్, జైపూర్, లుథియానా, ముంబై, తిర్పూర్, కోల్‌కతా, చెన్నై వంటి ప్రాంతాల నుంచి ఉన్నారు. ఏపీ, తెలంగాణ నుంచి ఉప్పాడ, పోచంపల్లి, కలంకారి వంటి చేనేత వస్త్ర తయారీ సంస్థలున్నాయి. ప్రతి నెలా కొత్తగా 40 సంస్థలు రిజిస్టరవుతున్నాయి. ఏపీ, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల నుంచి సుమారు 3 వేల మంది రిటైలర్లు నమోదయ్యారు. ప్రస్తుతం టెక్స్‌ఫైలో 15 వేల పైగా ఉత్పత్తులు లిస్టయ్యాయి.
నెలకు రూ.10 లక్షల ఆర్డర్లు..
టెక్స్‌ఫై యాప్, వెబ్సైట్... ఎక్కడి నుంచైనా ఆర్డర్ ఇవ్వొచ్చు. ప్రస్తుతం నెలకు రూ.10 లక్షల విలువ చేసే 130 ఆర్డర్లు వస్తున్నాయి. కనీస ఆర్డర్ విలువ రూ.1,600. ఉత్పత్తుల డెలివరీ కోసం డెలివర్హీ, ఫెడెక్స్, అరామెక్స్, బ్లూడార్ట్ వంటి ఆరు కొరియర్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. ఆర్డర్ వచ్చిన వారం రోజుల్లోగా డెలివరీ పూర్తవుతుంది. గత నెలలో టెక్స్‌ఫై ఈ–డిస్ట్రిబ్యూషన్‌ను ప్రారంభించాం. గోడౌన్, లాజిస్టిక్, ఉత్పత్తుల నిర్వహణ అన్నీ కంపెనీయే చూసుకుంటుంది.
జస్ట్.. స్థానికంగా ఉన్న రిటైలర్ల నుంచి ఆర్డర్లు తీసుకొస్తే చాలు.. టర్నోవర్‌లో 3 శాతం కమీషన్ ఉంటుంది. ఇప్పటివరకు విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, కర్నాటకలో 6 ఈ–డిస్ట్రిబ్యూషన్లు ఇచ్చాం. ఏడాదిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 300 మందికి ఈ–డిస్ట్రిబ్యూషన్ ఇవ్వాలన్నది లక్ష్యం. త్వరలోనే బజాజ్ ఫైనాన్స్ వంటి పలు ఎన్బీఎఫ్సీ సంస్థలతో ఒప్పందం చేసుకోనున్నాం. దీంతో రిటైలర్లకు 45 రోజుల క్రెడిట్ మీద ఉత్పత్తులను కొనుగోలు చేసే వీలుంటుంది.
2 నెలల్లో రూ.50 లక్షల సమీకరణ..
ఏడాది కాలంలో అన్ని దక్షిణాది రాష్ట్రాలకు విస్తరణతో పాటూ రూ.25 కోట్ల టర్నోవర్‌కు చేరుకోవాలని లకి‡్ష్యంచాం. వచ్చే ఏడాది ముగింపు నాటికి టెక్స్‌ఫైలో రిటైలర్ల సంఖ్యను 10 వేలకు, తయారీ సంస్థలను వెయ్యికి చేర్చాలన్నది మా లక్ష్యం. ప్రస్తుతం మా సంస్థలో 16 మంది ఉద్యోగులున్నారు. 2 నెలల్లో రూ.50 లక్షల నిధులను సమీకరించనున్నాం. త్వరలోనే డీల్‌ను క్లోజ్ చేస్తాం’’ అని రఘునాథ్ వివరించారు.