Raging harassment
-
PG Student Preethi: అతడి వల్లే ప్రీతి ఆత్మహత్యాయత్నం!
సాక్షి, హైదరాబాద్: వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. కాగా, ప్రీతి ఆరోగ్యం మరింత విషమించినట్టు తెలుస్తోంది. మరోవైపు.. మత్తు ఇంజక్షన్ వల్లే ప్రీతి అపస్మారక స్థితిలోకి వెళ్లినట్టు వైద్యులు చెబుతున్నారు. అయితే, ఈ ఘటనపై ప్రీతి తండ్రి నరేందర్ స్పందించారు. నరేందర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రీతి నవంబర్‌లో పీజీ కాలేజీలో జాయిన్ అయ్యింది. డిసెంబర్ నుంచి సైఫ్ అనే సీనియర్ విద్యార్థి ర్యాగింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. ప్రీతి ఈ విషయం మాకు చెబితే ధైర్యం చెప్పాము. స్థానికంగా అధికారులు, పోలీసులకు సమాచారం కూడా ఇచ్చాము. ఈ విషయం యూనివర్సిటీ అధికారులకు తెలియడంతో పోలీసు కంప్లెంట్ ఎందుకు ఇచ్చారని వారు మందలించారు. అయితే, ఈ రోజు ఉదయం ప్రీతి ఫోన్ నుంచి తన ఫ్రెండ్ కాల్ చేసి.. ప్రీతి కళ్లు తిరిగి పడిపోయిందని చెప్పారు. వెంటనే మేమంతా ఆసుపత్రికి వెళ్లాము. అప్పటికే కాలేజీ ప్రిన్సిపాల్, అధికారులందరూ అక్కడికి వచ్చారు. ప్రీతి కరోనా సమయంలో కూడా ప్రాణాలు లెక్కచేయకుండా ధైర్యంగా సేవ చేసింది. చదువుల్లో మెరిట్ స్టూడెంట్. ఇలా ఆత్మహత్యాయత్నం చేసిందంటే మాకు చెప్పని విధంగా ఇంకా ఎన్ని రకాలుగా హింసించాడో తెలియడం లేదు. వెంటనే సైఫ్‌ను కఠినంగా శిక్షించాలి’ అని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగానే ప్రతీ తమ్ముడు పృధ్వీ కూడా ఈ ఘటనపై కీలక విషయాలు వెల్లడించారు. పృధ్వీ మీడియాతో మాట్లాడుతూ.. ‘సీనియర్ల వేధింపుల వల్లే ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. సీనియర్ల వేధింపులపై ఫిర్యాదు చేసినా మేనేజ్మెంట్ పట్టించుకోలేదు. ఇంజక్షన్‌తో ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ప్రస్తుతం ప్రీతి కోమాలో ఉంది. సైఫ్.. పేషంట్స్ ముందే డ్యూటీలో నోటికి వచ్చినట్టు మాట్లాడటం, తిట్టడం చేసేవాడు. ఎక్స్ట్రా డ్యూటీలు చేసి కావాలనే టార్చర్ చేసేవాడు. నిన్న రాత్రి నాతో మాట్లాడినప్పుడు అంతా నార్మల్‌గా ఉంది అన్నట్టుగానే మాట్లాడింది. కానీ, ఇలా చేస్తుందనుకోలేదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు.. ఈ ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు.. ఇప్పటికే వేధింపులకు గురిచేసిన వైద్య విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. సీనియర్ వైద్య విద్యార్థిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు వేధింపుల కేసు నమోదైంది. సీనియర్ విద్యార్థి సైఫ్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. -
తోటి విద్యార్థులే ర్యాగింగ్ చేయడంతో..
సాక్షి, హైదరాబాద్: ర్యాగింగ్ వేధింపులు తాళలేక పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన సరూర్‌నగర్‌లో కలకలం రెపింది. తోటి విద్యార్థులే ర్యాగింగ్ చేయడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. బాధితురాలు కర్మాన్‌ఘాట్‌లోని నియోరాయల్ స్కూల్లో పదో తరగతి చదువుకుంటోంది. తోటి విద్యార్థులే రూ. 10వేలు తీసుకురావాలంటూ రోజు వేధించేవారని, స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని బాలిక ఆరోపించింది. దీంతో వేధింపులు కూడా ఎక్కువ కావడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు ప్రయత్నించానని బాలిక పేర్కొంది. దీంతో బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
చదువుల తల్లికి ఉరి
యశవంతపుర: ఐటీ సిటీలో విషాదం చోటుచేసుకుంది. ఒక కాలేజిలో తరగతి ప్రతినిధి ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో ర్యాగింగ్‌ను తట్టుకోలేక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ దుర్ఘటన రాజరాజేశ్వరి నగర పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు.. చన్నసంద్ర ద్వారకనగర శబరి అపార్టమెంట్లో మేఘన (18) తల్లిదండ్రులు చంద్రశేఖర్, లతాలతో కలిసి ఉంటుంది. ఆమె కుమారస్వామి లేఔట్‌లోని దయానందసాగర కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ ద్వితీయ ఏడాది చదువుతోంది. ఆమె చిన్నప్పటి నుంచి చదువుల్లో టాపర్. ఇంటర్‌లోనూ మంచిర్యాంక్‌తో పాసైంది. సీఈటీలోనూ ఉత్తమ ర్యాంక్‌తో ఫ్రీ సీట్ తెచ్చుకుంది. క్లాస్ ఎన్నికలతో వివాదం ఇటీవల కాలేజి యాజమాన్యం ప్రతి తరగతికి క్లాస్ రెప్రజెంటేటివ్ (తరగతి ప్రతినిధి) ఎన్నికలను నిర్వహించగా, అందులో మేఘన, సౌదామిని అనే విద్యార్థినితో పోటీ పడిఓడిపోయింది. అప్పటినుంచి సౌదామిని, ఆమె మిత్రులు మేఘనను నాయి (కుక్క) అని పిలుస్తూ అవమానించేవారు. ప్రతి రోజు క్లాస్‌రూంకు వెళ్తే చాలు కుక్కవచ్చిది చూడండీ అంటు అవహేళనగా మాట్లాడేవారు. తనకు రోజు జరుగుతున్న అవమానం గురించి తల్లిదండ్రులు చంద్రశేఖర్, లత దృష్టికి కూడ తెచ్చింది. క్లాస్‌లోని 70 మంది విద్యార్థులు మేఘన ప్రవర్తన సరిలేదంటూ ఇతర విద్యార్థులకు వాట్సప్ మెసేజ్‌లు పంపించారు. ఇలా ఎవరూ కూడా మేఘనాతో మాట్లాడకూడదు, ఆమె వైపు కూడ చూడకూడదనే విధంగా వాట్సప్‌లో హల్చల్ చేశారు. శాఖాధిపతి నిర్లక్ష్యం తమ కూతురిపై విద్యార్థుల వేధింపులు ఆపాలని మేఘన తండ్రి కాలేజీ డిపార్టుమెంట్ హెడ్‌కు ఫిర్యాదు చేశారు. సౌదామిని, సందీప్, నిఖిల్, నిఖితా, పూజా, సంధ్యాలపై ఫిర్యాదు చేశారు. తన కుతూరు ర్యాంక్ విద్యార్థిని, అంతమంది వేధిస్తున్నా ఎందుకు ప్రశ్నించటంలేదని హెచ్ఓడి రాజ్‌కుమార్, మరిస్వామిలని ఆన నిలదీశారు. వారు ఎంతమాత్రం పట్టించుకోకుండా ఫ్రీ సీటు వచ్చింది, గొడవ చేయకుండా చదువుకోండి అని చులకనగా మాట్లాడారు. ఈ నేపథ్యంలో వేధింపులు తట్టుకోలేని మేఘన మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని తనువు చాలించింది. దివ్యాంగుడైన చంద్రశేఖర్ బ్యాంక్ డ్యూటీకు వెళ్లగా, లతా సహకార సొసైటీ విధులకు వెళ్లారు. మేఘన అక్క కూడా ఇంజనీరింగ్ చదివి ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. ముగ్గురూ విధులు ముగించుకుని సాయంత్రం వచ్చేసరికి మేఘన మృతదేహం ఉరికి వేలాడుతోంది. అందరూ బోరుమన్నారు. కాలేజికి పోతానని చెప్పి ఆత్మహత్య చేసుకుని అన్యాయం చేశావంటూ విలపించారు. ఎమ్మెల్యే ఓదార్పు ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ చేరుకుని బాధితకుటుంబాన్ని ఓదార్చారు. ఘటనపై న్యాయ జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. తప్పు చేసిన విద్యార్థులపై చర్యలు తీసుకోనేలా అధికారులతో మాట్లాతానని చెప్పారు. తమ కుతూరికి జరిగిన అన్యాయంపై ఎన్నిసార్లు మౌఖికంగా ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని తల్లి లతా తండ్రి చంద్రశేఖర్‌లు ఆరోపించారు. ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మా కుతూరి మరణానికి కాలేజి యాజమాన్యం బాధ్యత వహించాలని స్పష్టంచేశారు. అంత విషాదంలోనూ వారు మేఘన నేత్రాలను దానం చేయడం గమనార్హం. వారి ఫిర్యాదు మేరకు సౌదామని, మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. రాజరాజేశ్వరినగర సీఐ శివారెడ్డి కేసును దర్యాప్తు చేస్తున్నారు. -
వర్సిటీల్లో ర్యాగింగ్‌పై నిఘా!
సాక్షి, హైదరాబాద్: గుంటూరు ఆచార్య నాగార్జునవర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్యకు ర్యాగింగ్ వేధింపులే కారణాలుగా తేలిన నేపథ్యంలో ర్యాగింగ్ నిరోధానికి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థుల క్రమశిక్షణా రాహిత్యం, ర్యాగింగ్, తరగతులకు గైర్హాజరు, వర్సిటీ కాలేజీల్లోకి అసాంఘిక శక్తుల ప్రవేశం తదితర చర్యల కట్టడికి ఉపక్రమిస్తున్నట్లుగా ప్రకటించింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ శుక్రవారం జీఓ నెంబర్ 398 విడుదల చేసింది. దీని ప్రకారం అన్ని యూనివర్సిటీ కాలేజీల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి. విద్యార్థుల హాజరుకు బయోమెట్రిక్ యంత్రాలు తప్పనిసరిచేయాలి. ఈ మేరకు నిర్ణీత శాతం హాజరు ఉన్న విద్యార్థులకు మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంటు, స్కాలర్‌షిప్పులను మంజూరు చేయాలి. బయటి వ్యక్తులు వర్సిటీల్లో ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ ఆగస్టు 31వ తేదీనాటికి పూర్తి కావాలని అన్ని యూనివర్సిటీల ఉపకులపతులను ప్రభుత్వం ఆదేశించింది.