సాక్షి, హైదరాబాద్: వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. కాగా, ప్రీతి ఆరోగ్యం మరింత విషమించినట్టు తెలుస్తోంది. మరోవైపు.. మత్తు ఇంజక్షన్ వల్లే ప్రీతి అపస్మారక స్థితిలోకి వెళ్లినట్టు వైద్యులు చెబుతున్నారు.
అయితే, ఈ ఘటనపై ప్రీతి తండ్రి నరేందర్ స్పందించారు. నరేందర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రీతి నవంబర్‌లో పీజీ కాలేజీలో జాయిన్ అయ్యింది. డిసెంబర్ నుంచి సైఫ్ అనే సీనియర్ విద్యార్థి ర్యాగింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. ప్రీతి ఈ విషయం మాకు చెబితే ధైర్యం చెప్పాము. స్థానికంగా అధికారులు, పోలీసులకు సమాచారం కూడా ఇచ్చాము. ఈ విషయం యూనివర్సిటీ అధికారులకు తెలియడంతో పోలీసు కంప్లెంట్ ఎందుకు ఇచ్చారని వారు మందలించారు.
అయితే, ఈ రోజు ఉదయం ప్రీతి ఫోన్ నుంచి తన ఫ్రెండ్ కాల్ చేసి.. ప్రీతి కళ్లు తిరిగి పడిపోయిందని చెప్పారు. వెంటనే మేమంతా ఆసుపత్రికి వెళ్లాము. అప్పటికే కాలేజీ ప్రిన్సిపాల్, అధికారులందరూ అక్కడికి వచ్చారు. ప్రీతి కరోనా సమయంలో కూడా ప్రాణాలు లెక్కచేయకుండా ధైర్యంగా సేవ చేసింది. చదువుల్లో మెరిట్ స్టూడెంట్. ఇలా ఆత్మహత్యాయత్నం చేసిందంటే మాకు చెప్పని విధంగా ఇంకా ఎన్ని రకాలుగా హింసించాడో తెలియడం లేదు. వెంటనే సైఫ్‌ను కఠినంగా శిక్షించాలి’ అని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగానే ప్రతీ తమ్ముడు పృధ్వీ కూడా ఈ ఘటనపై కీలక విషయాలు వెల్లడించారు. పృధ్వీ మీడియాతో మాట్లాడుతూ.. ‘సీనియర్ల వేధింపుల వల్లే ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. సీనియర్ల వేధింపులపై ఫిర్యాదు చేసినా మేనేజ్‌మెంట్ పట్టించుకోలేదు. ఇంజక్షన్‌తో ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ప్రస్తుతం ప్రీతి కోమాలో ఉంది. సైఫ్.. పేషంట్స్ ముందే డ్యూటీలో నోటికి వచ్చినట్టు మాట్లాడటం, తిట్టడం చేసేవాడు. ఎక్స్‌ట్రా డ్యూటీలు చేసి కావాలనే టార్చర్ చేసేవాడు. నిన్న రాత్రి నాతో మాట్లాడినప్పుడు అంతా నార్మల్‌గా ఉంది అన్నట్టుగానే మాట్లాడింది. కానీ, ఇలా చేస్తుందనుకోలేదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు.. ఈ ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు.. ఇప్పటికే వేధింపులకు గురిచేసిన వైద్య విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. సీనియర్ వైద్య విద్యార్థిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు వేధింపుల కేసు నమోదైంది. సీనియర్ విద్యార్థి సైఫ్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment