'నరేంద్ర మోడీ సర్కార్ విఫలం'
విజయవాడ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై సీపీఎం జాతీయ కార్యదర్శి ప్రకాశ్ కారత్ విరుచుకుపడ్డారు. దేశంలో ధరలను నియంత్రించడంలో మోడీ సర్కార్ విఫలమైందని ఆయన ధ్వజమెత్తారు. ప్రకాశ్ కారత్ శుక్రవారం విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇంధన ధరలపై నియంత్రణ ఎత్తివేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే పెరిగిన రైల్వే ఛార్జీలపై ప్రజలపై భారం వేశారని, త్వరలోనే ఎల్పీజీ గ్యాస్, డీజిల్ ధరలు పెంచేందుకు మోడీ సర్కార్ సన్నాహాలు చేస్తుందన్నారు.
మోడీ చెబుతున్న కఠిన నిర్ణయాలు ప్రజలపై భారం మోపేందుకేనని... గ్రామీణ ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడిచేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు తర్వాత లెప్ట్ పార్టీలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని ప్రకాశ్ కారత్ వ్యాఖ్యానించారు. తృణమూల్ ఎంపీ తపస్ పాల్ వ్యాఖ్యలు క్షమాపణలతో పూర్తి కాలేదని పార్లమెంటులో దీనిపై పోరాడతామని ఆయన అన్నారు.