రైల్వే డబ్లింగ్ లైన్ పనులను పరిశీలించిన జీఎం
దొనకొండ: నల్లపాడు నుంచి డోన్ వరకు జరుగుతున్న రైల్వే డబ్లింగ్ లైన్ పనులను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజరు గజానన్ మాల్యా శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా దొనకొండలో సుమారు గంటసేపు పలు అంశాలను పరిశీలించి రైల్వే అధికారులతో మాట్లాడారు. ముందుగా ఆయనకు రైల్వే పింఛనర్స్ అసోసియేషన్ కార్యదర్శి కోలా కృపారావు పూలమాల, పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. స్టేషనులోని సిగ్నల్స్, బుకింగ్ కౌంటర్‌ను పరిశీలించి సమస్యలడిగి తెలుసుకున్నారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి ఎక్కి పరిసరాలను గమనించారు. నీటి సౌకర్యాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన రైల్వే వైద్యశాలను పరిశీలించారు. అనంతరం విలేకరులతో జీఎం గజానన్ మాల్యా మాట్లాడుతూ నల్లపాడు నుంచి డోన్ వరకు డబ్లింగ్ లైను పనులు వేగవంతంగా సాగుతున్నాయని తెలిపారు. గుంటూరు–గుంతకల్ లైన్లో విద్యుత్ లైన్ పనులు జరుగుతున్నాయన్నారు. స్టేషన్లో ప్రయాణికులకు అన్ని సౌకర్యాలను అధికారులు ఏర్పాటు చేస్తున్నారన్నారు. అవసరమైన చోట ప్లాట్‌ఫాంలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. దొనకొండలో రైల్వే వైద్యశాల ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమన్నారు. స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఆయన వెంట గుంటూరు డివిజన్ రైల్వే మేనేజరు వి.జి.భూమా, సీనియర్ డీఈఎన్ ప్రసాదరావు, సీఎంఎస్ ఎన్.సి.రావు, సీఏఓ విజయ్ అగర్వాల్, చీఫ్ ఇంజినీర్లు శ్రీనివాసులు, ప్రకాష్ యాదవ్, అసిస్టెంట్ ఇంజినీర్లు రమణారావు, కె.సుబ్బారావు, స్టేషను సిబ్బంది, జీఆర్పీలు ఉన్నారు.