railway line works
-
భారత్, బంగ్లా సంయుక్తంగా.. పలు ప్రాజెక్టులకు శ్రీకారం
ఢాకా/అగర్తలా: భారత్, బంగ్లాదేశ్ ప్రధానులు నరేంద్ర మోదీ, షేక్ హసీనాలు బుధవారం సంయుక్తంగా పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. త్రిపురలోని నిశి్చంతపూర్, గంగాసాగర్‌ను బంగ్లాదేశ్‌తో కలుపుతూ 65 కిలోమీటర్ల ఖుల్నా–మోంగ్లా పోర్ట్ రైల్వే లైన్, బంగ్లాలోని రామ్‌పూర్‌లో ఉన్న మైత్రీ సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టులను నేతలు వర్చువల్ విధానంలో ప్రారంభించారు. అగర్తలా నుంచి బంగ్లాలోని అఖౌరా వరకు నిర్మించిన రైలు మార్గం ఇరుదేశాల వాణిజ్యాన్ని పెంచుతుందని ఆశిస్తున్నారు. రైలులో అగర్తలా నుంచి ఢాకా మీదుగా కోల్‌కతా వెళ్లే వారికి ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది. ‘ఈశాన్య భారతం, బంగ్లాల మధ్య తొలి రైలు మార్గం అగర్తలా–అఖౌరా క్రాస్‌బోర్డర్ రైల్వేలింక్ను ప్రారంభించడం చరిత్రాత్మకం’ అని ప్రారం¿ోత్సవం సందర్భంగా మోదీ వ్యాఖ్యానించారు. 12.24 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గంలో రైలు 5.46 కి.మీ.లు త్రిపురలో మిగతా 6.78 కిలోమీటర్లు బంగ్లాదేశ్‌లో ప్రయాణిస్తుంది. ‘రెండు దేశాల పరస్పర సహకార విజయాన్ని సంబరంగా జరుపుకునేందుకు మళ్లీ కలిశాం. గత దశాబ్దాల్లో రెండు దేశాల్లో జరగని అభివృద్ధిని ఈ 9 ఏళ్లలో సాధించాం. మన దేశాల పటిష్ట మైత్రీ బంధానికి ఈ ప్రాజెక్టులే సంకేతం’ అని హసీనాతో వీడియో కాన్ఫెరెన్స్ సందర్భంగా మోదీ వ్యాఖ్యానించారు. అగర్తలా–అఖౌరా రైలు మార్గం నిర్మాణం కోసం బంగ్లాకు భారత్ రూ.392.52 కోట్ల ఆర్థికసాయం అందజేసింది. కొత్త రైల్వే లైన్ అందుబాటులోకి రావడంతో ఈశాన్య రాష్ట్రాల్లో వాణిజ్యం, పర్యాటకం, అనుసంధానత ఊపందుకోనుంది. ఢాకా మీదుగా ఈ రైలు మార్గంలో అగర్తలా నుంచి కోల్‌కతాకు చాలా త్వరగా చేరుకోవచ్చు. ఈ మార్గం అందుబాటులోకి రావడంతో గతంలో ఉన్న 1,600 కిలోమీటర్ల దూరం ఏకంగా 500 కి.మీ.లకు తగ్గతోందని కార్యక్రమంలో పాల్గొన్న త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా చెప్పారు. -
మేడారం మీదుగా రైల్వే లైన్ కు మొదలైన సర్వే
-
ప్రయాణికులకు తీపికబురు.. ఉందానగర్– షాద్‌నగర్ రైల్వేలైన్ రెడీ
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్– మహబూబ్‌నగర్ మార్గంలో చేపట్టిన రైల్వేలైన్ల డబ్లింగ్, విద్యుదీకరణ ప్రాజెక్టులో భాగంగా ఉందానగర్ నుంచి షాద్‌నగర్ వరకు కీలకమైన 29.7 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. దీంతో హైదరాబాద్ నుంచి మహబూబ్‌నగర్, కర్నూలు, అనంతపురం, బెంగళూరు, కడప, తిరుపతి తదితర నగరాలకు రైళ్ల రాకపోకలు మరింత పెరిగే అవకాశం ఏర్పడింది. ప్రస్తుతం ఉందానగర్ నుంచి షాద్‌నగర్ వరకు పనులు పూర్తయ్యాయి. మిగిలిన సెక్షన్లో డబ్లింగ్, విద్యుదీకరణ పనులు వేగంగా జరుగుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్.రాకేష్ తెలిపారు. సికింద్రాబాద్–డోన్ సెక్షన్లో ప్రస్తుత సింగిల్ లైన్లో రద్దీ నివారణకు, సికింద్రాబాద్ నుంచి గొల్లపల్లి వరకు సరుకు రవాణా, ప్రయాణికుల రైళ్ల రవాణాకు ఈ లైన్ ఎంతో దోహదంచేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. గొల్లపల్లి–మహబూబ్‌నగర్ ప్రాజెక్టులో మిగిలిన పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. -
పరిమళించిన మానవత్వం
పలాస: జీవనోపాధి కోసం చెన్నైకు వలస వెళ్తూ ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడిన ఆ యువకుడిని రైల్వే కీ మెన్, తోటి స్నేహితులు కాపాడి మానవత్వాన్ని చాటుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. త్రిపురలోని అగర్తలాకు చెందిన వలస కూలీ టి.ఎన్.రియాన్స్ వివేకా ఎక్స్‌ప్రెస్‌లో చెన్నైకు బట్టల మిల్లులో పనిచేయడానికి తోటి స్నేహితులతో కలిసి వెళ్తున్నాడు. సోమవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో సుమ్మాదేవి – పలాస రైల్వే స్టేషన్ల మధ్య ప్రమాదవశాత్తు జారిపడిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న అతని నలుగురు స్నేహితులు పలాస రైల్వే స్టేషన్లో దిగి అర్ధ రాత్రి సమయంలో రైలు పట్టాలపై నడుచుకుంటూ అతన్ని వెతకడానికి బయలుదేరారు. పలాస నుంచి కొర్లాం (బారువా) రైల్వే స్టేషన్ వరకు నడుచుకుంటూ వెళ్లారు. అయినా అతని ఆచూకీ లభించకపోవడంతో అదే రైలు పట్టాలపై తిరిగి పలాస వైపు వచ్చారు. అప్పటికి తెల్లవారింది. ఈ సమయంలో పలాస నుంచి సుమ్మాదేవి స్టేషన్ల మధ్య కీ మెన్‌గా పనిచేస్తున్న వంకల కృష్ణారావు తన విధుల్లో భాగంగా రైలు పట్టాలపై నడుచుకుంటూ వస్తున్నారు. పలాస మండలం ఎంకాయ చెరువు సమీపంలో పట్టాల పక్కన ఉన్న తుప్పల్లో తీవ్ర గాయాలతో రియాన్స్ పడి ఉండటాన్ని చూశారు. ఈ విషయాన్ని పలాస రైల్వే స్టేసన్ మేనేజర్‌కు సమాచారం అందించారు. రియాన్స్ ఇచ్చిన సమాచారం మేరకు అతని స్నేహితులకు ఫోన్ చేశారు. అప్పటికి అతని స్నేహితులు వెతుక్కుంటూ నీలావతి రైల్వే గేటు సమీపంలో ఉన్నారు. దీంతో కృష్ణారావు తన తోటి ఉద్యోగులు రవి, జగన్‌లకు బైకులిచ్చి పంపించారు. వారిని అక్కడకు తీసుకొని రావడంతోపాటు 108కు కూడా సమాచారం ఇచ్చారు. సుమారు కిలో మీటరు దూరం రియాన్స్ స్నేహితులు అతన్ని వీపుమీద మోసుకుంటూ 108 వద్దకు తీసుకువెళ్లారు. పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. ప్రస్తుతం రియాన్స్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పలాస రైల్వే హెడ్ కానిస్టేబుల్ కోదండరావు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ప్రమాదంలో ఇరుక్కున్న వలస కూలీతోపాటు అతన్ని స్నేహితులు పడిన శ్రమ, స్నేహబంధాన్ని చూసిన వారి హృదయాలు ద్రవించాయి. -
మంత్రాలయం–కర్నూలు రైల్వే లైనెప్పుడో?
సాక్షి, ఎమ్మిగనూరు(కర్నూలు) : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయాన్ని జిల్లా కేంద్రమైన కర్నూలుతో అనుసంధానం చేస్తూ ప్రతిపాదించిన మంత్రాలయం–కర్నూలు రైల్వే లైన్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు, కర్నూలు నియోజకవర్గాల ప్రజల వ్యాపార–వాణిజ్య రంగాల్లో వృద్ధి చెందేందుకు ఉద్దేశించిన ఈ రైల్వే ప్రాజెక్టు 49 ఏళ్లుగా జిల్లా ప్రజలను ఊరిస్తునే ఉంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు మంత్రాలయంలో జరిగిన ఆర్ఎస్ఎస్ శిక్షణా తరగతుల సందర్భంగా బీజేపీ అగ్రనేత అమిత్ షా మంత్రాలయం రైల్వేలైన్‌ను పూర్తిచేస్తామని శ్రీ మఠం అధికారులకు చెప్పినా ఇంతవరకూ కార్యరూపం దాల్చలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రాజెక్ట్ ప్రస్థావన: శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనార్థం దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం, జిల్లా అంతర్గత వాణిజ్య– వ్యాపార రంగాల అభివృద్ధి కోసం మంత్రాలయం–కర్నూలు రైల్వే లైన్ ప్రస్తావన 49ఏళ్ల క్రితమే పార్లమెంట్లో ప్రస్తావనకు వచ్చింది. 1970లో కర్నూలు పార్లమెంట్ సభ్యుడు, ఎమ్మిగనూరు ప్రాంత నేత వై.గాదెలింగన్న గౌడ్ పార్లమెంట్లో మంత్రాలయం వయా కర్నూలు మీదుగా శ్రీశైలం వరకు రైలు మార్గం ఏర్పాటు చేయాలని ప్రస్తావించినట్లు పార్లమెంట్ మినిట్స్ బుక్‌లో నమోదైంది. దీనిని స్ఫూర్తిగా తీసుకున్న నేతలు 2002 నుంచి మంత్రాలయం– కర్నూలు రైల్వే లైన్ ఏర్పాటుకు ప్రయత్నాలు మెుదలుపెట్టారు. 2003లో రాష్ట్రానికి చెందిన 14 మంది ఎంపీలు, అప్పటి రైల్వే బోర్డు సభ్యులు ఎర్రంనాయుడుతో కలసి అప్పటి రైల్వే మంత్రి నితీష్కువూర్తో మంత్రాలయం– కర్నూలు రైల్వేను ఏర్పాటు చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన ఆయన 2004 ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రూ.165 కోట్లతో రైల్వే లైన్‌ను ప్రస్తావిస్తూ సర్వే కోసం నిధులు కేటాయించారు. సర్వే పనులు పూర్తి చేసిన రైల్వే ఉన్నతాధికారులు అప్పట్లో రూట్‌మ్యాప్‌ను కూడా రూపొందించారు. మంత్రాలయం క్రాస్ (తుంగభద్ర) నుంచి మాధవరం, ఇబ్రహీపురం, నందవరం, ఎమ్మిగనూరు, ఎర్రకోట, గోనెగండ్ల, హెచ్‌కైరవాడి, వేముగోడు, కోడుమూరు, గూడూరు, నాగలాపురం, పెద్దకొట్టాల, దూపాడు మీదుగా కర్నూలు రైల్వేలైన్‌కు అనుసంధానం చేస్తూ సర్వే ద్వారా రూట్‌మ్యాప్ రూపొందింది. మెుత్తం 110.700 కి.మీ. మధ్య దూరం గల ఈ రైలు మార్గంలో 14 స్టేషన్లు, 22 మలుపులతో రూట్‌మ్యాప్ తయారైంది. సర్వేలతో సరి మంత్రాలయం–కర్నూలు రైల్వేలైన్ ఏర్పాటుకు 2010 ఫిబ్రవరి 24న అప్పటి రైల్వే మంత్రి మమత బెనర్జీ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బడ్జెట్లో రూ.10కోట్లు కేటాయించారు. అయితే వివిధ శాఖల అధికారుల మ«ధ్య సమన్వయ లోపం, పెరిగిన నిర్మాణ వ్యయం దృష్ట్యా పునఃసర్వే చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. అందులో భాగంగా 2011 ఫిబ్రవరి 23న రూ.6 కోట్లతో టెండర్లను పిలిచారు. హైదరాబాద్‌కు చెందిన ప్రసాద్‌రెడ్డి అనే కాంట్రాక్టర్ టెండర్లను దక్కించుకున్నారు. సర్వే పనులు పూర్తి చేసి 2013లో నివేదిక పంపారు. కి.మీ. రూ.6 కోట్లు చొప్పున 110 కి.మీ.లకు రూ.660 కోట్లు ఖర్చు అవుతుందని నివేదికలో పేర్కొన్నారు. ఎన్నికల ముందు పాదయాత్ర చేపట్టిన చంద్రబాబునాయుడు మంత్రాలయం–కర్నూలు రైల్వేలైన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఐదేళ్లు గడచిపోయాయిగానీ రైల్వే ప్రాజెక్టుపై శాసనసభలో తీర్మానం కూడా చేయలేదు. ఎన్నికలకు ముందు బీజేపీ ప్రభుత్వం కూడా రైల్వే బడ్జెట్లో మొండిచేయి చూపడంతో అప్పటి ఎంపీ బుట్టారేణుక కోరడంతో కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ మంత్రాలయం–కర్నూలు రైల్వేలైన్ రీసర్వేకు నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. మళ్లీ బీజేపీయే అధికారంలోకి వచ్చినా అది కార్యరూపం దాల్చలేదు. -
కొత్తపల్లి–మనోహరాబాద్‌కు లైన్‌క్లియర్
సాక్షి, కరీంనగర్ : కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వేలైన్ నిర్మాణానికి కేంద్రప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించింది. కరీంనగర్ నుంచి నేరుగా హైదరాబాద్‌కు వెళ్లేందుకు వీలుగా కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వేలైన్‌ను 2006–07 సంవత్సరంలో రూ.1160 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టారు. అయితే అప్పటి కేంద్ర ప్రభుత్వం రైల్వేబడ్జెట్‌లో సరిపడా నిధులు కేటాయించకపోవడంతో పనులు నత్తనడకన సాగాయి. అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 2014 సంవత్సరం నుంచి రైల్వేపనుల్లో వేగం పెరిగింది. మొత్తం 150 కిలోమీటర్ల దూరం ఉన్న కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వేలైన్‌లో ప్రస్తుతం మనోహరాబాద్ నుంచి గజ్వేల్ వరకు 32 కిలోమీటర్లు మాత్రమే పనులు పూర్తయ్యాయి. 2020 సంవత్సరంనాటికి కరీంనగర్‌కు రైలు తీసుకొస్తామన్న ప్రజాప్రతినిధుల మాటలు ఆచరణలో మాత్రం సాధ్యమయ్యే పరిస్థితి కన్పించడంలేదు. ఈ రైల్వే నిర్మాణ పనులు కరీంనగర్ జిల్లాలో ఇంకా ప్రారంభం కాలేదు. ప్రస్తుత బీజేపీ ఎంపీ బండి సంజయ్‌కుమార్ హయాంలోనైనా కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వేలైన్ నిర్మాణం పూర్తవుతుందనే ఆశాభావంతో జిల్లాప్రజలున్నారు. బడ్జెట్లో నిధుల కేటాయింపులు ఇలా ► 2015–16–రూ.20కోట్లు ► 2016–17–రూ.30కోట్లు ► 2017–18–రూ.350కోట్లు ► 2018–19–రూ.125కోట్లు ► 2019–20–రూ.200కోట్లు -
మెట్టకు ‘రైలు’ వచ్చేనా!
సాక్షి, కావలి: జిల్లాలోని మెట్టప్రాంత ప్రజల దశాబ్దాల స్వప్నం శ్రీకాళహస్తి–నడికుడి రైలు మార్గం. 2020 నాటికి ఈ రైలు మార్గం పూర్తి చేయాల్సి ఉన్నా చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా భూసేకరణే పూర్తి కాని పరిస్థితి నెలకొంది. కేంద్ర ప్రభుత్వం అన్నింటికీ సిద్ధంగా ఉన్నప్పటికీ రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. జిల్లాలోని వందలాది పడమటి పల్లెల ప్రజలు శ్రీకాళహస్తి–నడికుడి మార్గంలో రైలు కూత వినాలనే ఆకాంక్షతో ఉన్నా చంద్రబాబు ప్రభుత్వ అటకెక్కించింది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నుంచి గుంటూరు జిల్లా దాచేపల్లి మండలంలోని నడికుడి వరకు పడమట పల్లెల్లో నూతన రైలు మార్గం నిర్మించాలని, ఆ రైలు మార్గం జిల్లాలో కూడా మెట్టప్రాంతంలోని పల్లెల మీదుగా నిర్మించాలని 50 ఏళ్ల నుంచి ప్రజలు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం మూడేళ్ల క్రితం ఈ రైలు మార్గాన్ని నిర్మించేందుకు అంగీకరించింది. అయితే గుంటూరు జిల్లాలోని నడికుడి జంక్షన్ రైల్వేస్టేషన్ నుంచి కాకుండా, అక్కడికి 25 కిలోమీటర్లు దూరంలో ఉన్న రాజుపాళెం మండలం అనుపాలెం అనే గ్రామం నుంచి ఈ రైలు మార్గాన్ని నిర్మిస్తున్నారు. చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి నుంచి కాకుండా నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి వరకే ఈ రైలు మార్గాన్ని నిర్మించడానికి చర్యలు తీసుకున్నారు. అటకెక్కిన భూసేకరణ ఒప్పందం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా వ్యయాన్ని భరించి భూసేకరణ చేసి రైల్వేశాఖకు అప్పగించాల్సి ఉంది. జిల్లాలోని వరికుంటపాడు, కొండాపురం, కలిగిరి, వింజమూరు, ఏఎస్‌పేట, ఆత్మకూరు, చేజర్ల, పొదలకూరు, రాపూరు, డక్కిలి, వెంకటగిరి మండలాల్లోని 2,267.77 ఎకరాల భూమిని సేకరించాల్సిఉంది. ఇందులో ప్రభుత్వ భూమి 777.09 ఎకరాలు కాగా, మిగిలిన పట్టా భూములు 1,054.54 ఎకరాలు, అసైన్డ్ భూములు 436.14 ఎకరాలు గుర్తించారు. అంటే 1,590.68 ఎకరాల భూమికి సంబంధించిన యజమానులకు నష్టపరిహారం చెల్లించాల్సిఉంది. ఎకరాకు కనీసం రూ.4.25 లక్షల నుంచి గరిష్టం రూ.15 లక్షల వరకు ఆయా ప్రాంతాల్లో ఉన్న మార్కెట్ ధరను బట్టి నిర్ణయించాల్సిఉంది. రూ.100 కోట్ల వరకు నష్టపరిహారం చెల్లించాల్సివస్తుంది. చంద్రబాబు ప్రభుత్వం నిధుల విడుదలకు ఆసక్తి చూపకపోవడంతో అధికారులు కూడా భూములకు ప్రాంతాల వారీగా నష్టపరిహారం చెల్లించడానికి ధరలు కూడా ఖరారు చేయకుండా పక్కన పెట్టేశారు. నిర్మాణానికి నిధుల మాటేమిటో.. కొణిజేటి రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వంతో జరిగిన ఒప్పందం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తన నిధులతోనే భూసేకరణ జరిపి రైల్వేశాఖకు భూములు అప్పగించాల్సిఉంది. అలాగే రైలు మార్గం నిర్మాణంలో అయ్యే ఖర్చులో సగం రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. రైలు మార్గం ఖర్చు రూ.2,454 కోట్లు అవుతుంది. జిల్లాలో భూసేకరణకు నిధులు మంజూరు చేయకుండా రెండేళ్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇక నిర్మాణానికి నిధులు ఎప్పటికి మంజూరు చేస్తుందోనని అధికారవర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. కాగా చంద్రబాబు ప్రభుత్వ వైఖరి వల్ల 2020 నాటికి ఈ మార్గం పూర్తి కావాలనే లక్ష్యం నేరవేరే పరిస్థితి లేకుండాపోయింది. అసమగ్రంగా స్టేషన్ల ఏర్పాటు శ్రీకాళహస్తి–నడికుడి రైలు మార్గం పొడవు 308.7 కిలోమీటర్లు కాగా అందులో నెల్లూరు జిల్లాలోనే 146.11 కిలోమీటర్లు ఉంటుంది. మొత్తం రైల్వేస్టేషన్లు 33 కాగా, జిల్లాలో 15 ఉన్నాయి. గుంటూరు, ప్రకాశం జిల్లాల మీదుగా నెల్లూరు జిల్లాలో నిర్మిస్తున్న ఈ రైలు మార్గంలో జిల్లాలోనే ఎక్కువ స్టేషన్లు నిర్మించనున్నారు. అయితే కొండాపురం, కలిగిరి, పొదలకూరు మండలాల్లోని భూములు కూడా రైలు మార్గం నిర్మాణానికి తీసుకుంటున్నప్పటికీ ఆ మండలాల్లో ఒక్క రైల్వేస్టేషన్ కూడా నిర్మించడం లేదు. వరికుంటపాడు మండలంలోని కొల్లువారిపల్లె, వింజమూరు మండలంలో గోళ్లవారిపల్లె, రావిపాడు, వింజమూరు గ్రామాల్లో రైల్వేస్టేషన్లు ఏర్పాటు కావాల్సిఉంది. ఏఎస్‌పేట మండలంలో దూబగుంట, ఆత్మకూరు మండలంలో పమిడిపాడు, ఆత్మకూరు, చేజర్ల మండలంలో ఓబులాయపల్లె, కొత్తూరు, రాపూరు మండలంలో వెంకటాపురం, ఆదూరుపల్లి, రాపూరు, డక్కిలి మండలం వెల్లంపల్లి, ఆల్తూరుపాడు, వెంకటగిరి మండలంలో బాలసముద్రం గ్రామాల్లో రైల్వేస్టేషన్లు నిర్మించాల్సిఉంది. ఈ రైలు మార్గం నిర్మిస్తున్న జిల్లాలోని 11 మండలాల్లో పెద్ద మండలాలు పొదలకూరు, కలిగిరి. ఈ మండలాల్లో కనీసం ఒక్క రైల్వేస్టేషన్ కూడా నిర్మించడం లేదు. పొదలకూరు మండలంలో, పక్కనే ఉన్న సైదాపురం మండలంలో నిమ్మతోటలు భారీగా ఉన్నాయి. ఈ మండలాల్లోని నిమ్మకాయలు దక్షిణ, ఉత్తర భారతదేశంలోని చెన్నై, కోయంబత్తూరు, బెంగళూరు, కొచ్చిన్, త్రివేండ్రం, కలకత్తా, న్యూఢిల్లీ, హైదరాబాద్ వంటి ప్రాంతాల మార్కెట్‌కు రవాణా అవుతున్నాయి. పొదలకూరు మండలం మీదుగా రైలు మార్గం ఉన్నప్పటికీ కనీసం రైల్వేస్టేషన్‌ను లేకపోవడంతో గమనార్హం. భూసేకరణకే నిధులు మంజూరు చేయని చంద్రబాబు ప్రభుత్వం మెట్టప్రాంత ప్రజల దశబ్దాల నాటి రైలుమార్గం స్వప్నాన్ని నీరుగారుస్తోంది. రవాణాకు అనువు ప్రస్తుతం ఉన్న విజయవాడ–చెన్నై రైలు మార్గానికి శ్రీకాళహస్తి–నడికుడి రైలు మార్గం బలమైన ప్రత్యామ్నాయ రైలు మార్గంగా ఉపయోగపడుతుందని రైల్వే వర్గాలు భావిస్తున్నాయి. తుపాన్లు, వరదలతో కోస్తా తీరానికి సమీపంలో ఉన్న విజయవాడ–చెన్నై రైలు మార్గంలో అంతరాయం ఏర్పడినప్పడు, రద్దీ ఏర్పడినప్పడు శ్రీకాళహస్తి–నడికుడి రైలుమార్గం అందుబాటులో ఉండడం వల్ల దక్షిణ–ఉత్తర భారతదేశాలకు అనుసంధానమైన వాణిజ్య రవాణాకు అనువుగా ఉంటుందని రైల్వే వర్గాలు విశ్లేషిస్తున్నాయి. -
రైల్వే లైన్ వేగవంతం..
సింగరేణి(కొత్తగూడెం): సత్తుపల్లి–భద్రాచలం రోడ్ (కొత్తగూడెం రుద్రంపూర్) రైల్వే పనులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పనులను అధికారులు వేగవంతం చేయనున్నారు. రైల్వే అధికారులు దాదాపు సర్వే పను లు పూర్తి చేశారు. 53 కిలోమీటర్ల పొడవుతో నిర్మించే ఈ లైన్‌కు 50 శాతం భూసేకరణ పనులు పూర్తయినట్లు సింగరేణి అధికారులు తెలిపారు. ఇంకా మిగిలిన పనులను రైల్వేశాఖ త్వరలో పూర్తి చేయనున్నట్లు తెలిసింది. అయితే సత్తుపల్లి ఏరియాలో బొగ్గు రవాణా రోజు రోజుకు పెరుగుతు న్న నేపథ్యంలో పనులు వేగవంతం చేయాలని సింగరేణి అధికారులు భావించి రూ.618.55 ఖర్చు చేయటానికి సంసిద్ధపడి దానిలో రూ.156. 38 కోట్లను చెల్లించింది. ఈ రైల్వే లైను పొడవు సుమారు 53.50 కిలోమీటర్లకు రూ.704.31 కోట్లు అవుతుందని అంచనా. వీటిలో 16 జూలై 2018 వరకు సింగరేణి సంస్థ రూ.156.38 కోట్లు చెల్లించింది. ఈ పనులు పూర్తయితే 2020 సంవ త్సరం నాటికి సుమారు 15 మిలియన్ టన్నుల బొగ్గును రవాణా చేయనున్నట్లు రైల్వే, సింగరేణి అధికారులు పేర్కొంటున్నారు. దీంతో సింగరేణికి బొగ్గు రవాణా ఖర్చు లక్షల్లో ఉంటుందని కార్మికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రోజుకు 30 వేల టన్నుల బొగ్గు రవాణా ప్రస్తుతం కొత్తగూడెం ఏరియాలోని జేవీఆర్‌ఓసీ–1, 2లలో రోజుకు సుమారు 30 వేల టన్నుల బొగ్గు 800 (చిన్న, పెద్ద) లారీలలో రుద్రంపూర్‌లోని ఆర్‌సీహెచ్‌పీకి వస్తుంది. ఈ రవాణా పక్రియలో ప్రమాదాల సంఖ్య ఇటీవల కాలంలో భారీగా పెరిగాయని కార్మికులు చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా బొగ్గు లారీల రాకపోకల వలన దుమ్ము, ధూళి వచ్చి పర్యావరణం దెబ్బతినటమే కాకుండా రోడ్డు వెంట నివసించే ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. అదేవిధంగా శబ్దకాలుష్యంతో రాత్రింబవళ్లు కష్టపడి వచ్చిన ప్రజలకు నిద్ర ఉండటంలేదని వాపోతున్నారు. ఈ పనులు పూరయ్తితే వీటన్నిటికి ఉపశమనం జరుగుతుందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సత్తుపల్లిలో మరో నాలుగు ఓసీలకు రంగం సిద్ధం సత్తుపల్లిలో జలగం వెంగళరావు ఓసీ–1ను 2006లో సింగరేణి సంస్థ ప్రారంభించి ఏడాదికి సుమారు 50 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తుంది. ఇదేక్రమంలో 2017లో జేవీఆర్ ఓసీ–2లో ఉత్పత్తిని ప్రారభించింది. దీని జీవితకాలం సుమారు 29 సంవత్సరాలు. సంవత్సరానికి సుమారు ఒక మిలియన్ టన్ను బొగ్గు ఉత్పత్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అదేవిధంగా సత్తుపల్లి ఓపెన్‌కాస్ట్ –3 కొమ్మేపల్లి ప్రాంతంలో మరో మూడేళ్లలో ఇక్కడ కూడా ఓసీ ప్రారంభం కానుంది. అదేవిధంగా కిష్టారం ఓపెన్‌కాస్ట్, ఇవన్నీ కలుపుకొని ఏరియాలో రానున్న మరో నాలుగేళ్లలో 10 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి రవాణాకు సన్నాహాలు చేస్తున్నారు. సింగరేణి సంస్థ ఉత్పత్తిచేసే బొగ్గును లారీల ద్వారా కాకుండా రైల్వే వ్యాగన్ల ద్వారా రవాణా చేస్తే సంస్థకు లక్షలాది రూపాయల లాభంతో పాటు అక్రమ రవాణాకు చెక్ పడుతుందని కార్మికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి చెందనున్న పలు గ్రామాలు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జిల్లాలోని గ్రామాలను కలిపే ఈ రైల్వే మార్గం వల్ల కొత్తగూడెం, చండ్రుగొండ, మద్దుకూరు, అన్నపురెడ్డిపల్లి, లంకపల్లి, మండలాల గ్రామాలు అభివృద్ధి చెందనున్నాయి. దీనివలన పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కలుగనుంది. -
యువర్ అటెన్షన్ ప్లీజ్.. మీ రైలు ఇప్పట్లో రాదు!
ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లోని మెట్ట ప్రాంత వాసుల దశాబ్దాలకల ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు. నడికుడి– శ్రీకాళహస్తి రైల్వే నిర్మాణ పనులు ముందుకుసాగడంలేదు. 308 కి.మీ. నిడివితో నూతనంగా నిర్మించే ఈ రైల్వే లైను ఇప్పటి వరకు కేవలం 30 కి.మీ మాత్రమే పూర్తికావడం గమనార్హం. భూసేకరణలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ పరిస్థితి నెలకొంది. 2019 మార్చి నాటికి పనులు పూర్తికావాల్సి ఉంది. నిర్ణీత గడువులో రైలు పట్టాలెక్కే ఆశలు కనిపించడం లేదు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే పనులు పూర్తికి మరో మూడు నాలుగేళ్లు జాప్యం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఉదయగిరి: గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికుడి నుంచి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి వరకు నూతన రైల్వే మార్గం నిర్మాణం కోసం నెల్లూరు, ప్రకాశం, గుంటూ రు జిల్లాల్లోని మెట్ట ప్రాంత ప్రజలు, ప్రజాప్రతినిధులు యాభై ఏళ్ల నుంచి పోరాటం సాగిస్తున్నారు. 2012లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కె.రోశయ్య ఈ రైల్వేలైను నిర్మాణానికి అవసరమైన భూసేకరణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే విధంగా కేంద్రంతో ఒప్పందం కుదిర్చారు. ఆ తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎం అయ్యాక ఈ నూతన రైల్వేలైను నిర్మాణానికి పావులు కదిపారు. భూసేకరణ ప్రక్రియ చేపట్టారు. తర్వాత 2014 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ, కేంద్రంలో ఎన్డీఏ కొలువు తీరాయి. ప్రధాని మోదీ ఈ రైల్వే మార్గాన్ని 2019 మార్చి నాటికి పూర్తిచేయాలని సంకల్పించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేసి ఇవ్వటంలో తీవ్రజాప్యం చేసింది. దీంతో ఈ ప్రాజెక్ట్‌కు అవసరమైన నిధులను కేంద్రం సైతం మొక్కుబడిగా విడుదల చేసింది. దీంతో ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిడి పెరగడంతో 2017లో కేంద్రం ఈ పనులను వేగవంతం చేసేందుకు భూసేకరణ పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచింది. అయినా టీడీపీ ప్రభుత్వం భూసేకరణకు అవసరమైన నిధులు విడుదల చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తూ..అరకొర నిధులు విడుదల చేసి చేతులు దులుపుకుంది. దీంతో పనులు ముందుకు జరగక తీవ్ర జాప్యం జరుగుతోంది. భూసేకరణలో రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు ఈ నూతన రైల్వేలైను నిర్మాణ మార్గానికి రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భూసేకరణ చేసి రైల్వే శాఖకు అప్పగించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో తీవ్ర జాప్యంచేస్తోంది. గుంటూరు జిల్లాలో రైల్వేలైన్‌కు అవసరమైన భూసేకరణ పూర్తి చేశారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మాత్రం వేగం మందగించింది. జిల్లాలో ఈ రైల్వేలైను వరికుంటపాడు మండలం నుంచి వెంకటగిరి వరకు 146 కి.మీ ఉంది. దీనికి 2,268 ఎకరాల భూమి అవసరం కాగా ఇందులో 1,590 ఎకరాలకు సంబంధించి రూ.100 కోట్లు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ.1,317 కోట్లు భూసేకరణ కోసం విడుదల చేయాల్సి ఉంది. కానీ ఇంతవరకు కేవలం రూ.300 కోట్లు మాత్రమే విడుదల చేసింది. మూడేళ్లుగా నిధులు విడుదల చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. గుంటూరు జిల్లాలో మాత్రమేసాగుతున్న పనులు గుంటూరు జిల్లాలో ఈ రైల్వేలైను పనులు గతేడాది నుంచి సాగుతున్నాయి. మొదటి దశలో 32 కి.మీ రైల్వేమార్గం నిర్మించాలని సంకల్పించి రెండు ప్యాకేజీలుగా విభజించి కాంట్రాక్టర్లకు అప్పగించారు. ఈ ఏడాది చివరి నాటికి మొదటి దశ పనులు పూర్తిచేయాలని భావించినప్పటికీ రొంపిచర్ల ప్రాంతంలో భూసేకరణలో న్యాయ సమస్యలు తలెత్తాయి. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 33 రైల్వేస్టేషన్లు 57 మెట్ట ప్రాంత మండలాల ద్వారా ఈ రైల్వేలైను మార్గం నిర్మితమవుతుంది. 308 కి.మీ నిడివితో నూతనంగా నిర్మించే ఈ రైల్వే లైను ఇప్పటి వరకు కేవలం 30 కి.మీ మాత్రమే పూర్తికావడం విశేషం. అయితే నిర్ణీత గడువు 2019 మార్చి నాటికి ఈ పనులు పూర్తయ్యే సూచనలు కనిపించడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో అవసరమైన మేరకు నిధులు విడుదల చేసి భూసేకరణ పనులు పూర్తి చేస్తే కానీ 2022 నాటికి ఈ పనులు పూర్తి చేసే అవకాశం ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు. జిల్లాలో పరిస్థితి ఇదీ! ప్రస్తుతం జిల్లాలో ఈ నూతన రైల్వేలైన్ నిర్మాణానికి అవసరమైన భూమిని అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి రైతులకు అందజేయాల్సిన నష్టపరిహార నిధులు ప్రభుత్వం విడుదల చేయలేదు. జిల్లాలో వరికుంటపాడు, కొండాపురం, కలిగిరి, వింజమూరు, ఏఎస్‌పేట, ఆత్మకూరు, చేజర్ల, పొదలకూరు, రాపూరు, డక్కిలి, వెంకటగిరి మండలాల్లో ఈ రైల్వేలైను నూతనంగా నిర్మితం కానుంది. ఇప్పటికే ఆయా మండలాల్లో రైల్వేమార్గం వెళ్లే గ్రామాల్లో రెవెన్యూ, రైల్వే అధికారులు గ్రామసభలు కూడా నిర్వహించారు. దశాబ్దాల కల నెరవేరేదెప్పుడు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని మెట్ట ప్రాంతవాసుల దశాబ్దాల కలగా ఉన్న ఈ నూతన రైల్వే నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణకు అవసరమైన నిధులు విడుదల చేయడంలో ఆలస్యం చేస్తుండడంతో ఈ పరిస్థితి తలెత్తింది. 2019లో ఈ ప్రాజెక్ట్ పూర్తికావాల్సి ఉన్నా ప్రస్తుత పనులు పరిశీలిస్తే 2022కు కూడా పూర్తయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ రైల్వేలైను నిర్మాణం కోసం మేకపాటి రాజమోహన్‌రెడ్డి నర్సరావుపేట, ఒంగోలు, నెల్లూరు ఎంపీగా కేంద్రంతో పోరాటం చేశారు. ఈ ప్రాజెక్ట్ పూర్తిచేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగా నత్తను తలపిస్తోంది. – మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి,మాజీ ఎమ్మెల్యే, ఉదయగిరి నిధులు విడుదలైన వెంటనేభూసేకరణ పూర్తిచేస్తాం ఈ రైల్వేలైను మార్గానికి అవసరమైన భూసేకరణ కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే భూములు కోల్పోయే రైతులకు నష్టపరిహారం అందజేసి భూమిని సేకరిస్తాం. త్వరలో నిధులు విడుదలయ్యే అవకాశముంది. వీలైనంత త్వరగా భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. – భక్తవత్సలరెడ్డి, ఆర్డీఓ కావలి -
గంటన్నరలో హైదరాబాద్‌కు..
రాజాపూర్ (జడ్చర్ల): హైదరాబాద్ నుంచి మహబూబ్‌నగర్ వరకు జరుగుతున్న డబుల్ రైల్వే లైన్ పనులు పూర్తయితే గంటన్నరలో హైదరాబాద్ చేరుకోవచ్చని.. దీంతో వ్యాపారస్తులు, ఉద్యోగులకు సమయం కలిసొస్తుందని మహబూబ్‌నగర్ పార్లమెంట్ సభ్యులు జితేందర్‌రెడ్డి తెలిపారు. జిల్లాలోని దివిటిపల్లి గ్రామం నుండి రాజాపూర్ వరకు జరుగుతున్న రైల్వే లైన్ పనులను ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, ప్రాజెక్ట్ డైరెక్టర్ కృష్ణారెడ్డితో కలిసి శుక్రవారం ఆయన ట్రాలీపై వెళ్తూ పరిశీలించారు. పనుల్లో వేగం పెంచాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. రాజాపూర్ మండల కేంద్రంలో అండర్ బ్రిడ్జి పనులు కొందరు రైతులు అడ్డుకున్నారని రైల్వే సిబ్బంది ఎంపీ దృష్టికి తీసుకురాగా.. స్థానికులతో చర్చించాలని జెడ్పీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డికి సూచించారు. ఈ విషయమై కలెక్టర్‌తో కూడా చర్చిస్తామని ఆయన అధికారులకు తెలిపారు. నిధుల కొరత లేదు.. డబుల్ లైన్ పనులు పరిశీలించిన తర్వాత అధికారులకు పలు సూచనలు చేసిన ఎంపీ జితేందర్‌రెడ్డి ఆ తర్వాత రాజాపూర్‌లోని ఓ హోటల్లో విలేకరులతో మాట్లాడారు. మహబూబ్‌నగర్ జిల్లా ప్రజల చిరకాల కోరిక వచ్చే డిసెంబర్ నాటికి కలసాకారం కానుందని ఎంపీ చెప్పారు. రూ.1,207 కోట్ల నిధులు రైల్వే డబ్లింగ్ పనులు, విద్యుద్ధీకరణకు మంజూరయ్యాయన్నారు. మొత్తం 100 కిలోమీటర్ల రైల్వే లైన్లో 25 కిలోమీటర్ల లైన్ ఈ సంవత్సరం చివరి నాటికి పూర్తి చేసి డెమో రైలు ప్రారంభిస్తామన్నారు. ఈ ప్రాజెక్టుకు నిధుల కొరత లేదని.. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ లైన్లో 154 చిన్న బ్రిడ్జిలు, 9 పెద్ద బ్రిడ్జిల పనులు చురుకుగా సాగుతున్నాయని తెలిపారు. ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. జిల్లా ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న డబుల్ లైన్ పనులు ఎంపీ జితేందర్‌రెడ్డి ఫ్లోర్‌లీడర్‌గా ఉండడంతో వేగంగా జరుగుతున్నాయన్నారు. దివిటిపల్లి రైల్వే స్టేషన్ పక్కనే ఐటీ కారిడార్, మల్టిపుల్ పరిశ్రమలు వస్తున్నందున ఈ స్టేషన్‌ను జంక్షన్‌గా ఏర్పాటు చేస్తూ మోడ్రన్ రైల్వేస్టేషన్‌గా అభివృద్ధి చేయాలని కోరారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్‌తోపాటు ప్రాజెక్ట్ మేనేజర్ కృష్ణారెడ్డి తెలిపారు. -
మనోహరాబాద్- కొత్తపల్లి రైల్వేపనులు ప్రారంభం
మెదక్: మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వేలైన్ పనులను గజ్వేల్ మండలం గిరిపల్లి దగ్గర మంత్రి హరీశ్‌రావు మంగళవారం ఉదయం భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ... కేంద్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేపడుతన్న ఈ ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. మేడ్చల్, మెదక్, సిద్దిపేట, సిరిసిల్లా, జగిత్యాల ప్రజలకు త్వరలోనే రైలు అందుబాటులోకి రాబోతుందని, ఈ మార్గం ద్వారా ప్రయాణ సౌకర్యాలు ఇంకా మెరుగవుతాయని తెలిపారు. ఇప్పటికే నిజామాబాద్- జగిత్యాల రైల్వే మార్గం దాదాపు పూర్తి అయిందని, త్వరలోనే ఈ మార్గంలో రైలు ప్రయాణం ప్రారంభమవుతుందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్‌రెడ్డి, శాసనమండలి సభ్యులు పాతూరి సుధాకర్‌రెడ్డి, రైల్వే అధికారులు పాల్గొన్నారు.