రేపు జిల్లాకు సీఎం?
కలెక్టరేట్/నిడమనూరు, న్యూస్‌లైన్: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా జిల్లాలో జరిగిన అపార నష్టాన్ని పరిశీలించేందుకు సీఎం కిరణ్ బుధవారం జిల్లాకు వస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కలెక్టర్ టి.చిరంజీవులు సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం పర్యటన అధికారికంగా ఖరారు కావాల్సి ఉందన్నారు. అయితే సీఎం పర్యటన విజయవంతం చేసేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. తొలుత అధికారులతో సమావేశమై పంటనష్టంతో పాటు ఇతర నష్టాలను సమీక్షిస్తారని చెప్పారు. దీని కోసం అధికారులు సమగ్ర సమాచారంతో హాజరుకావాలన్నారు.
సీఎం పర్యటన నేపథ్యంలో రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, పశుసంవర్ధక, వ్యవసాయ, ఇరిగేషన్ శాఖలు వరద నష్టంపై ఫొటో ప్రదర్శన ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. బాధితులతో ముఖ్యమంత్రి సమావేశమై వరదల వల్ల జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకుంటారని, దానిలో భాగంగా కొన్ని గ్రామాలలో ఏరియల్ సర్వే కూడా నిర్వహించే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనకు హెలి ప్యాడ్, సభావేదిక సిద్ధం చేయాలని ఆర్అండ్బీ ఎస్ఈని ఆదేశించారు. విద్యుత్ సౌకర్యం, పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. జెడ్పీ సీఈఓ వెంకట్రావ్ మాట్లాడుతూ వరదల వలన జరిగిన నష్టాన్ని తాత్కాలికంగా పునరుద్ధరించేందుకు *3.30కోట్లు వివిధ మండలాలకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ నిధులలో పాఠశాల భవనాలు, పంచాయతీ భవనాల పునరుద్ధరణకు వినియోగించాలని కోరారు.ఈ సమావేశంలో డీఆర్ఓ అంజయ్య, ఐసీడీఎస్ పీడీ ఉమాదేవి, డీఎంఅండ్‌హెచ్‌ఓ ఆమోస్, వ్యవసాయశాఖ జేడీ నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.
నిడమనూరుకు వచ్చే అవకాశం ఎక్కువ
ముఖ్యమంత్రి కిరణ్‌కమార్‌రెడ్డి బుధవారం నిడమనూరు మండలానికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉండడంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తుపాను నష్టాన్ని పరిశీలించేందుకు వస్తున్న సీఎం నిడమనూరు మండల కేంద్రంలో తెగిన చెరువును, దెబ్బతిన్న నివాస గృహాలు, నష్టపోయిన పంట పొలాలను పరిశీలించనున్నారు. అనంతరం రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. మిర్యాలగూడ- దేవరకొండ ప్రధాన రహదారి పక్కన ఉన్న ఓ ప్రైవేటు బీఈడీ కాలేజీ వద్ద హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేసేందుకు మిర్యాలగూడ ఆర్డీఓ శ్రీనివాసరెడ్డి సోమవారం స్థలాన్ని పరిశీలించారు. సీఎం రైతులతో మాట్లాడనుండడంతో అందుకోసం బాలాజీ ఫంక్షన్‌హాల్‌ను పరిశీ లించారు. అదేవిధంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో సోమవారం అధికారులు మూడు ప్రాంతాల్లో పర్యటించారు. యాదగిరిగుట్ట మండలం మోట కొండూరులో రెవెన్యూ అధికారులు హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. పెద్దవూరలో కూడా మిర్యాలగూడ ఆర్డీఓ శ్రీనివాసరెడ్డి ఏర్పాట్లను పరిశీ లించారు.