సీమ, తెలంగాణలకు వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలోనూ, దక్షిణ మధ్యప్రదేశ్పై ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. వీటి ప్రభావంతో మంగళవారం నుంచి మూడు రోజుల పాటు రాయలసీమలో, మంగళ, బుధవారాల్లో తెలంగాణలోనూ అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం సోమవారం తెలిపింది. కోస్తాలో మాత్రం బుధవారం నుంచి రెండ్రోజులు ఒకట్రెండు చోట్ల తేలికపాటి వర్షం కురవొచ్చని పేర్కొంది. ఆవర్తనాల వల్ల ఆకాశంలో మేఘాలు ఏర్పడుతున్నాయి. మరోవైపు తెలుగు రాష్ట్రాలపై దక్షిణ, ఆగ్నేయ గాలులు వీస్తున్నాయి.
వీటి ఫలితంగా కనిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతూ చలి ప్రభావం తగ్గుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. కొద్దిరోజులు ఇదే పరిస్థితి ఉండొ చ్చంటున్నారు. గత 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణమే నెలకొంది.