నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి
కేంద్ర మంత్రి అనంతకుమార్
సాక్షి,బెంగళూరు: కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2011లో గెజిటెడ్ పోస్టుల నియామకాలను రద్ధు చేస్తూ మంత్రిమండలి ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం పునఃపరిశీలించాలని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి అనంతకుమార్ అభిప్రాయపడ్డారు. బెంగళూరులో అదమ్యచేతన స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆర్వీ కళాశాలలో ఆదివారం నిర్వహించిన రక్షాబంధన్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
పోస్టుల రద్దు విషయంలో ప్రభుత్వ నిర్ణయం సబబుగా లేదన్నారు. తప్పు జరిగినట్లు ఇప్పటికే తేటతెల్లమయ్యిందని, ఇందుకు కారణమైనవారిని కూడా సీఐడీ గుర్తించిందని అన్నారు. వారిని శిక్షిస్తే సరిపోతుందన్నారు. అయితే నియామకాలను రద్దు చేస్తూ ఎంపికైన అభ్యర్థులందరినీ బాధపెట్టడం సరికాదన్నారు.
కర్ణాటకలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు ఎక్కువ అవుతుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. పోలీసు సిబ్బందిని ముఖ్యంగా మహిళలను ఎక్కువగా నియమించుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి సూచించారు. కాగా, అంతకు ముందు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ తారాతో సహా పలువురు బీజేపీ మహిళా విభాగం నాయకులు అనంతకుమార్‌కు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు.