అటు వెళ్లొద్దు
-రేపటి నుంచి నిడదవోలు రైల్వేగేటు మూసివేత
- ట్రాక్ మరమ్మతుల కోసం 22 వరకు ఇంతే..
- కానూరు, పెరవలి మీదుగా వాహనాల మళ్లింపు
నిడదవోలు : ఉభయ గోదావరి జిల్లాల నడుమ రాకపోకల కోసం ఏర్పాటు చేసిన నిడదవోలు ప్రధాన రైల్వే గేటు శుక్రవారం నుంచి వారం రోజులపాటు మూతపడనుంది. ట్రాక్ మరమ్మతుల నిమిత్తం ఈనెల 16నుంచి 22వ తేదీ వరకు గేటును మూసివేస్తున్నట్టు నిడదవోలు రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజినీర్ వి.సోమేశ్వరరావు బుధవారం తెలిపారు. రెండు నెలలకు ఒకసారి గేటు వద్ద ట్రాక్ మరమ్మతులు చేపట్టాల్సి ఉండగా, రైల్వే ఓవర్ బ్రిడ్జి మంజూరవుతుందనే ఉద్దేశంతో గడచిన ఏడాది కాలంగా మరమ్మతులను వాయిదా వేస్తూ వస్తున్నారు. ఓవర్ బ్రిడ్జి మంజూరు కాకపోవడంతో ఇప్పుడు ట్రాక్ మరమ్మతులు చేపడుతున్నట్టు రైల్వే వర్గాలు తెలిపాయి.
కానూరు, పెరవలి మీదుగా వాహనాల మళ్లింపు
రైల్వే గేటు మూసివేస్తుండటంతో నిడదవోలు మార్గంలో రాజమహేంద్రవరం వైపు వెళ్లే వాహనాలు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోక తప్పని పరిస్థితి తలెత్తింది. తాడేపల్లిగూడెం–రాజమహేంద్రవరం మధ్య ప్రయాణానికి నిడదవోలు మార్గం తక్కువ దూరం కావడంతోపాటు సౌకర్యవంతంగా ఉంటుంది. గేటును మూసివేస్తుండటంతో నిడదవోలు మీదుగా తాడేపల్లిగూడెం వైపు వెళ్లే వాహనాలను సమిశ్రగూడెం, కానూరు, పెరవలి, తణుకు మీదుగా మళ్లిస్తున్నట్టు టౌన్ ఎస్సై డి.భగవాన్ ప్రసాద్ చెప్పారు. తాడేపల్లిగూడెం నుంచి రాజమహేంద్రవరం, కొవ్వూరు వెళ్లే వాహనాలు తణుకు, పెరవలి, కానూరు మీదుగా ప్రయాణించాల్సి ఉందన్నారు. కొన్ని వాహనాలను రావులపాలెం మీదుగా మళ్లిస్తున్నారు.
ఆర్టీసీ పికప్ సర్వీసులు
రైల్వే గేటు మూసివేస్తుండటంతో ఆర్టీసీ అధికారులు పికప్ సర్వీసుల పేరిట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. తాడేపల్లిగూడెం నుంచి రాజమహేంద్రవరం వెళ్లే ప్రయాణికులను నిడదవోలు గేటు దగ్గర దించుతారు. ప్రయాణికులు కాలినడకన గేటు దాటి అవతలి వైపునకు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులో నేరుగా రాజమహేంద్రవరం వెళ్లవచ్చు. రాజమహేంద్రవరం వైపు నుంచి తాడేపల్లిగూడెం వచ్చే ప్రయాణికులు సైతం ఇదేవిధంగా ప్రయాణించాల్సి ఉంటుంది. ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే గేటు ఇవతలి నుంచి తాడేపల్లిగూడెం వరకు 10, రైల్వే గేటు అవతలి వైపునుంచి రాజమహేంద్రవరం వరకు 10 చొప్పున పికప్ సర్వీసులు నడుపుతున్నట్టు ఆర్టీసీ డిపో మేనేజర్ జీఎల్పీవీ సుబ్బారావు తెలిపారు. ప్రతి 20 నిమిషాలకు ఒక బస్సు నడిపేలా చర్యలు చేపట్టామన్నారు. రాజమహేంద్రవరం–తాడేపల్లిగూడెం సర్వీసుల్లో కొన్నిం టిని తణుకు మీదుగా నడిపే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నిడదవోలు నుంచి ఏలూరు వెళ్లే బస్సులను పంగిడి మీదుగా పంపిస్తామన్నారు.
బైక్పై ఇలా వెళ్లొచ్చు..
ద్విచక్ర వాహన చోదకులు, ఆటోలు తాళ్లపాలెం మీదుగా శింగవరం నుంచి నిడదవోలు వచ్చేందుకు రహదారి సదుపాయం ఉంది. ఇది సింగిల్ రోడ్డు మాత్రమే. నిడదవోలు పట్టణం నుంచి కంసాలిపాలెం మీదుగా నందమూరు వెళ్లే రహదారి సింగిల్ రోడ్డు కావడంతో అటువైపు భారీ వాహనాలను నిషేధించినట్టు ఎస్సై భగవాన్ ప్రసాద్ తెలిపారు. ఈ రోడ్డుపై ప్రయాణం బాగా ఇబ్బందికరంగా ఉంటుంది.