raithu sangham
-
సోలార్ బాధితులకు పునరావాసం కల్పించాలి
సాక్షి, కల్లూరు : గని, శకునాల గ్రామాలకు చెందిన సోలార్ బాధిత కుటుంబాలకు పునరావాసం కల్పించాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి. రామక్రిష్ణ డిమాండ్ చేశారు. సోమవారం శకునాలలో సోలార్ బాధిత కుటుంబాలతో ఏపీ రైతు సంఘం నాయకులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రామక్రిష్ణ మాట్లాడుతూ సోలార్ పరిశ్రమ స్థాపనకు సేకరించిన భూములపై ఆధారపడి జీవిస్తున్న రైతు కూలీలకు పునరావాసం కల్పించాలని కోర్టు ఆదేశించిందన్నారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం కూడా బాధితులకు అవార్డు పాస్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు. అయితే, అధికారుల ఒత్తిడితో గని, శకునాల గ్రామాల్లో ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో నిద్రిస్తున్న వారి నుంచి సంతకాల సేకరణ చేయించడం ఎంతవరకు సమంజసమన్నారు. బాధితులకు అందించే పునరావాసం ఎగ్గొంటేందుకే ఉన్నతాధికారులు పనిచేయడం సిగ్గుచేటన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో బాధితులు చాంద్‌బాషా, శ్రీధర్, శేఖర్, రాముడు తదితరులు పాల్గొన్నారు. -
నేడు కలెక్టరేట్ ఎదుట రైతు సంఘం ధర్నా
అనంతపురం అర్బన్ : వేరుశనగ పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20 వేలు నష్ట పరిహారం ఇవ్వాలనే డిమాండ్‌తో సోమవారం కలెక్టరేట్ ఎదుట ఏపీ రైతు సంఘం (సీపీఐ) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నట్లు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సి.మల్లికార్జున, ఎ.కాటమయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ధర్నాని విజయవంతం చేయాలని తెలిపారు. -
రైతు జీవితాలతో చెలగాటం
– నష్ట పరిహారం జాబితాలో జిల్లా లేకపోవడం దుర్మార్గం – రైతు సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి ధ్వజం అనంతపురం అర్బన్ : జిల్లా రైతాంగంతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఆర్.చంద్రశేఖర్‌రెడ్డి ధ్వజమెత్తారు. 2015కు సంబంధించి ప్రకటించిన నష్ట పరిహారం జాబితాలో జిల్లా లేకపోవడం దుర్మార్గమంటూ దుమ్మెత్తిపోశారు. త„ýక్షణం పరిహారం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక గణేనాయక్ భవన్లో జిల్లా అధ్యక్షుడు తరిమెల నాగరాజుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. తీవ్ర వర్షాభావం కారణంగా వేరుశనగ పంట ఎండిపోవడంతో 63 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు పరిహారం మంజూరులో మొండిచేయి చూపడం దారుణమన్నారు. రైతాంగంపై జిల్లా మంత్రులకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి 2015–16, 2016–17కు సంబంధించి నష్టపరిహారం ప్రకటించేలా చూడాలన్నారు. లేనిపక్షంలో రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
రైతు స్థితిగతులపై 5న కదిరిలో సదస్సు
అనంతపురం అర్బన్ : రైతుల స్థితి గతులపై ఈ నెల 5న కదిరిలో రైతు సంఘం (సీపీఎం) ఆధ్వర్యంలో సదస్సు నిర్వహిస్తున్నట్లు సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు షాలిమార్ ఫంక్షన్ హాల్లో జరిగే సదస్సుకు శాసన మండలి మాజీ సభ్యులు ప్రొఫెసర్ కె.నాగేశ్వరరావు హాజరవుతారన్నారు. సదస్సుకు రైతులు, రచయితలు, మేథావులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. -
ఎండిన పంటకు నష్టపరిహారం చెల్లించాలి
హిందూపురం రూరల్ : ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన వేరుశనగ, మొక్కజొన్న పంట పూర్తిగా ఎండిపోయాయి. రెవెన్యూ, వ్యవసాయాధికారులు పంటసాగు వివరాల (ఈ క్రాప్ బుకింగ్) నమోదును వెంటనే చేపట్టి రైతులకు నష్టపరిహారాన్ని అందించాలని ఏపీ రైతు సంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం హిందూపురంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏపీ రైతుసంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ వర్షం లేక వేరుశనగ, మొక్కజొన్న పంటలు వందశాతం దెబ్బ తిన్నాయన్నారు. కంటి తుడుపు చర్యలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు రక్షక తడులు అంటూ రైతులను మభ్యపెడుతున్నారని విమర్శించారు. వెంటనే ఈ క్రాప్ బుకింగ్ నమోదు చేసి పంటనష్టాన్ని అంచనా వేసి రైతులకు రబీలో సాగు చేసుకునే తెల్లజొన్న, పప్పుశనగ, తెల్లకుసుమ, ధనియాలు, ఉలవలు వంటి ఆరుతడి పంట విత్తనాలను ప్రభుత్వం ఉచితంగా అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం స్థానిక తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి డిప్యూటీ తహశీల్దార్ మైనుద్దీన్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రైతుసంఘం డివిజన్ కార్యదర్శి సిద్ధారెడ్డి, ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, ఆదినారాయణప్ప, శ్రీధర్, నరసింహప్ప, కిష్టప్ప, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి రైతుకూ రూ. 10వేల పింఛన్
– రైతు సంఘం జిల్లా కార్యదర్శి డిమాండ్ – రైతు సంఘం జెండావిష్కరణ కర్నూలు సిటీ: ఏటేటా నష్టాలతో జూదాన్ని తలపిస్తున్న వ్యవసాయంలో కొనసాగుతూ 60 ఏళ్ల వయసు నిండిన ప్రతి రైతుకూ రూ. 10వేల పింఛన్ మంజూరు చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. జగన్నాథం డిమాండ్ చేశారు. అలాగే పంటలకు గిట్టుబాటు ధరలు ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. ప్రస్తుతం ధరలు పడిపోయిన కారణంగా ఉల్లి, టమాట రైతులు తీవ్ర ఇబ్బందులో ఉన్నారని, వాటికి గిట్టుబాటు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు. రైతు కోరికల వారోత్సవాల్లో భాగంగా స్థానిక చండ్ర రాజేశ్వరరావు భవన్లో గురువారం ఆయన రైతు సంఘం జెండాను ఆవిష్కరించారు. 60 ఏళ్ల వయసు నిండిన ప్రతి రైతుకూ పింఛన్, డా.స్వామినాథన్ కమిటీ సిఫారసులు చేయాలన్నారు. పెట్టుబడి ఖర్చుల కోసం రైతులకు అవసరమైన మేరకు రుణాలు ఇవ్వాలన్నారు. పంటలు నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం చెల్లించాలన్నారు. ఈ–పాస్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి తోళ్ల మద్దిలేటి, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి మహేష్, రైతు సంఘం సీనియర్ నాయకులు పుల్లన్న, ఏఐఎస్ఎఫ్ నగర అద్యక్ష, కార్యదర్శులు డి.ప్రతాప్, ఎ.నాగరాజు, నారాయణ తదితరులు పాల్గొన్నారు.