ప్రతి రైతుకూ రూ. 10వేల పింఛన్
– రైతు సంఘం జిల్లా కార్యదర్శి డిమాండ్
– రైతు సంఘం జెండావిష్కరణ
కర్నూలు సిటీ: ఏటేటా నష్టాలతో జూదాన్ని తలపిస్తున్న వ్యవసాయంలో కొనసాగుతూ 60 ఏళ్ల వయసు నిండిన ప్రతి రైతుకూ రూ. 10వేల పింఛన్ మంజూరు చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. జగన్నాథం డిమాండ్ చేశారు. అలాగే పంటలకు గిట్టుబాటు ధరలు ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. ప్రస్తుతం ధరలు పడిపోయిన కారణంగా ఉల్లి, టమాట రైతులు తీవ్ర ఇబ్బందులో ఉన్నారని, వాటికి గిట్టుబాటు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు. రైతు కోరికల వారోత్సవాల్లో భాగంగా స్థానిక చండ్ర రాజేశ్వరరావు భవన్‌లో గురువారం ఆయన రైతు సంఘం జెండాను ఆవిష్కరించారు. 60 ఏళ్ల వయసు నిండిన ప్రతి రైతుకూ పింఛన్, డా.స్వామినాథన్ కమిటీ సిఫారసులు చేయాలన్నారు. పెట్టుబడి ఖర్చుల కోసం రైతులకు అవసరమైన మేరకు రుణాలు ఇవ్వాలన్నారు. పంటలు నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం చెల్లించాలన్నారు. ఈ–పాస్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి తోళ్ల మద్దిలేటి, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి మహేష్, రైతు సంఘం సీనియర్ నాయకులు పుల్లన్న, ఏఐఎస్‌ఎఫ్ నగర అద్యక్ష, కార్యదర్శులు డి.ప్రతాప్, ఎ.నాగరాజు, నారాయణ తదితరులు పాల్గొన్నారు.