హిందూపురం రూరల్ : ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో సాగు చేసిన వేరుశనగ, మొక్కజొన్న పంట పూర్తిగా ఎండిపోయాయి. రెవెన్యూ, వ్యవసాయాధికారులు పంటసాగు వివరాల (ఈ క్రాప్ బుకింగ్) నమోదును వెంటనే చేపట్టి రైతులకు నష్టపరిహారాన్ని అందించాలని ఏపీ రైతు సంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం హిందూపురంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏపీ రైతుసంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ వర్షం లేక వేరుశనగ, మొక్కజొన్న పంటలు వందశాతం దెబ్బ తిన్నాయన్నారు. కంటి తుడుపు చర్యలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు రక్షక తడులు అంటూ రైతులను మభ్యపెడుతున్నారని విమర్శించారు.
వెంటనే ఈ క్రాప్ బుకింగ్ నమోదు చేసి పంటనష్టాన్ని అంచనా వేసి రైతులకు రబీలో సాగు చేసుకునే తెల్లజొన్న, పప్పుశనగ, తెల్లకుసుమ, ధనియాలు, ఉలవలు వంటి ఆరుతడి పంట విత్తనాలను ప్రభుత్వం ఉచితంగా అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం స్థానిక తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి డిప్యూటీ తహశీల్దార్ మైనుద్దీన్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రైతుసంఘం డివిజన్ కార్యదర్శి సిద్ధారెడ్డి, ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, ఆదినారాయణప్ప, శ్రీధర్, నరసింహప్ప, కిష్టప్ప, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎండిన పంటకు నష్టపరిహారం చెల్లించాలి
Published Thu, Sep 8 2016 11:18 PM | Last Updated on Mon, Sep 4 2017 12:41 PM
Advertisement