కృష్ణారామా మా ఇంట్లో పుట్టిన కథే – దర్శకుడు రాజ్ మదిరాజు
‘‘ప్రస్తుతం చాలా మంది తమ తల్లిదండ్రులకు దూరంగా జీవిస్తున్నారు. దీంతో ఒంటరి తనంగా భావించిన తల్లిదండ్రులు తమ మనసులోని భావాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటున్నారు. మా తల్లి దండ్రులు కూడా ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి ఫేస్ బుక్లోకి వచ్చారు. ఒక విధంగా ‘#కృష్ణారామా’ కథ మా ఇంట్లో పుట్టిందే’’ అని దర్శకుడు రాజ్ మదిరాజు అన్నారు.
రాజేంద్ర ప్రసాద్, గౌతమి ప్రధాన పాత్రల్లో అనన్య శర్మ కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘‘#కృష్ణారామా’. అద్వితీయ మూవీస్పై వెంకట కిరణ్, కుమార్ కళ్లకూరి, హేమ మాధురి నిర్మించిన ఈ సినిమా ఆదివారం నుంచి ఓ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు రాజ్ మదిరాజు మాట్లాడుతూ– ‘‘మన తల్లిదండ్రులు రిటైర్ అయిపోతే వాళ్ల జీవితమే అయిపోయిందనే భావనలోకి వెళ్లిపోతున్నాం.
కానీ, వారి అనుభవం సమాజానికి ఎంతో అవసరం అని మా సినిమా ద్వారా చెబుతున్నాం. ఒక డైరెక్టర్గా నా పనిని నేను ఇష్టపడతాను. నటుడిగా నా పరిధిలోనే ఉంటాను.. డైరెక్టర్స్కి సలహాలు, సూచనలు ఇవ్వను. ప్రస్తుతం డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి సినిమాలో ఓ మంచి పాత్ర చేశాను. డైరెక్టర్గా రెండు మూడు కథలు సిద్ధంగా ఉన్నాయి’’ అన్నారు.