చెత్త తొలగింపు సమస్య పరిష్కారంపైనే దృష్టి
పుణే: నానాటికీ తలనొప్పిగా పరిణమిస్తున్న చెత్త తొలగింపు సమస్య పరిష్కారంపై పుణే మున్సిపల్ కార్పొరేషన్ (పీఎంసీ) దృష్టి సారించింది. ఇందుకోసం అంతర్జాతీయ సంస్థలను రంగంలోకి దింపాలని నిర్ణయించింది. ఇందులోభాగంగా ఆసక్తి వ్యక్తీకరణ (ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్)ను జారీచేసింది. ఈ విషయాన్ని పీఎంసీ అదనపు కమిషనర్ రాజేంద్ర జగ్తాప్ వెల్లడించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ‘చెత్త తొలగింపు కోసం అనేక దేశాలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నాయి. అటువంటి నైపుణ్యాన్ని ఇక్కడ కూడా వినియోగించుకోవాలని నిర్ణయించాం’ అని అన్నారు.
అనేక పత్రికల్లో ఆసక్తి వ్యక్తీకరణ (ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్)కు సంబంధించిన ప్రకటనలను జారీచేశాం. కాంట్రాక్టు దక్కించుకునే సంస్థ 30 ఏళ్లపాటు చెత్త తొలగింపు, నిర్వహణ బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుంది. సదరు సంస్థ ఇక్కడ కొన్ని ప్లాంట్లను నెలకొల్పాల్సి ఉంటుంది. కనీసం 15 ప్లాంట్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క ప్లాంట్‌లో 100 నుంచి 250 టన్నుల చెత్తను ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా 500 టన్నుల చెత్తను ప్రాసెస్ చేసే సామర్థ్యం కలిగిన మరో భారీ ప్రాజెక్టును కూడా నిర్మించాల్సి ఉంటుంది. ఆసక్తి వ్యక్తీకరణపై స్పందన కోసం ఆయా అంతర్జాతీయ సంస్థలకు నెల రోజుల వ్యవధి ఇచ్చాం’ అని అన్నారు. ఇండోనేసియా, థాయ్‌లాండ్, జపాన్ తదితర దేశాలకు సంబంధించిన అధికారులతో పీఎంసీ సంప్రదింపులు జరుపుతోందన్నారు. ఈ మూడు దేశాలు చెత్త తొలగింపు శాస్త్రీయ ప్రక్రియను వినియోగిస్తున్నాయన్నారు. ఈ దేశాలకు ఆసక్తి వ్యక్తీకరణ (ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్) ప్రతులను పంపుతామన్నారు.
స్థలకొరత సమస్య
పుణే మున్సిపల్ కార్పొరేషన్ (పీఎంసీ) అధికారుల సమాచారం ప్రకారం నగరంలో ప్రతిరోజూ 1,600 మెట్రిక్ టన్నుల చెత్త తయారవుతుంది. స్థలాభావ సమస్య కారణంగా ఈ వ్యర్థాలను ఎక్కడ పారబోయాలనే అంశం పీఎంసీకి పెనుసవాలుగా మారింది. ప్రస్తుతం నగర శివారులోని ఫుర్సుంగి, ఉరులి గ్రామాల్లోగల ప్రాసెసింగ్ ప్లాంట్‌కు చెత్తను తరలిస్తున్నారు. పీఎంసీ ఇటీవల రాంటెక్డి ప్రాంతంలో మరో ప్లాంట్‌ను నిర్మించింది. అయితే ఇవి తమ సామర్థ్యం మేర పనిచేయకపోవడం భారీ డంపింగ్‌కు దారితీస్తోంది.
డంపింగ్‌కు వ్యతిరేకంగా ఆందోళన
చెత్త నుంచి వెలువడుతున్న దుర్వాసనను భరించలేక ఫుర్సుంగి, ఉరులి గ్రామాలకు చెందిన ప్రజలు ఇటీవల పీఎంసీ ఎదుట భారీస్థాయిలో ఆందోళన చేశారు. పీఎంసీకి వ్యతిరేకంగా నినదించారు. అంతటితో ఆగకుండా చెత్త లారీలు తమ గ్రామాల్లోకి రాకుండా అడ్డుకున్నారు. ఈ పరిణామాలు నగరంలో చెత్త భారీఎత్తున పేరుకుపోయేందుకు దారితీసింది.
15 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలే
డంపింగ్ కేంద్రాలకు వస్తున్న వ్యర్థాల్లో ప్లాస్టిక్ సామగ్రి అధికంగా ఉంది. ఇది దాదాపు 15 శాతంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపునకు అత్యాధునిక ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు అత్యవసరంగా మారింది. మరోవైపు 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ వస్తువుల వినియోగంపై పీఎంసీ నిషేధం విధించింది. ఉత్పత్తిదారులకు జరిమానా కూడా విధించింది.