కోటి రూపాయల ఆఫర్! : మాయావతి సంచలన ఆరోపణలు
లక్నో: మరోసారి రాజ్యసభకు పంపిస్తే 100 కోట్ల రూపాయలు ఇస్తానని సొంత పార్టీ ఎంపీనే తనకు ఆఫర్ ఇచ్చారని బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ)అధినేత్రి మాయావతి బుధవారం సంచలన ఆరోపణలు చేశారు. కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు అఖిలేశ్ దాస్ చేసిన ఈ ప్రతిపాదనను తాను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చినట్లు ఆమె చెప్పారు. వంద కాదు రెండు వందల కోట్ల రూపాయలు ఇచ్చినా టికెట్ ఇచ్చేది లేదని అతనికి తేల్చిచెప్పినట్లు తెలిపారు. లక్నో మాజీ మేయర్గా కూడా చేసిన అఖిలేశ్ దాస్ 2008లో కాంగ్రెస్ పార్టీని వీడి బీఎస్పీలో చేరారు. రెండు రోజుల క్రితమే అతనిని బీఎస్పీ నుంచి తొలగించారు.
ఇదిలా ఉండగా, ఈ నెల 20న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో బీఎస్పీ తరపు అభ్యర్థులుగా వీర్సింగ్, రాజారాంలను మాయావతి ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో బీఎస్పీకి ఉన్న సభ్యుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే వారిద్దరూ రాజ్యసభకు ఎన్నికయ్యే అవకాశం ఉంది.
**