ramagundam railway station
-
అందరూ చూస్తుండగానే..
రామగుండం: అది పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫాం.. ప్రయాణికులు ప్లాట్‌ఫాంపై ఉన్నారు. ఇంతలో ఓ వ్యక్తి ప్లాట్‌ఫాంపై నుంచి రైలుపట్టాలపైకి దూకాడు. ప్రయాణికులందరూ వద్దని వారి స్తున్నారు.. అంతలోనే బెంగళూరు వైపు వెళ్తున్న రాజధాని సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు రావడం.. అతడిని ఢీకొనడం.. క్షణాల్లో జరిగిపోయాయి. జీఆర్పీ ఔట్‌పోస్టు ఇన్చార్జి సురేశ్‌గౌడ్ కథనం ప్రకారం.. ఒడిశా రాష్ట్రం బాలేశ్వర్ జిల్లా కైరా గ్రామానికి చెందిన సంజయ్‌కుమార్ బెహ్రా (27) హైదరాబాద్‌లోని తన చిన్నాన్న ఇంట్లో ఉంటూ ఓ హార్డ్‌వేర్ షాపులో గుమాస్తాగా పనిచేసేవాడు. మూడేళ్ల క్రితం మతిస్థిమితం కోల్పోగా.. కుటుంబసభ్యులు సొంత గ్రామానికి తీసుకెళ్లారు. చికిత్స ఇప్పించి తిరిగి హైదరాబాద్ పంపించారు. నాలుగురోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న అతడు.. ఆదివారం ఉదయం ఆరుగంటలకు ఇంట్లో నుంచి రైలులో బయల్దేరాడు. రామగుండం రైల్వేస్టేషన్లో రైలుపట్టాలపైకి చేరాడు. అదే సమయంలో న్యూఢిల్లీ నుంచి వస్తున్న రాజధాని సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎదురుగా నిలబడి ఆత్మహత్య చేసుకున్నాడు. -
అయ్యో పాపం ఏ కష్టం వచ్చిందో.. రైలుకు ఎదురెళ్లి..
సాక్షి, పెద్దపల్లి: రామగుండం రైల్వేస్టేషన్లో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్టేషన్లో అందరూ చూస్తుండగానే రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు ఎదురుగా నిలబడి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో రైల్వేస్టేషన్‌లోని ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మృతుడు ఒడిశా రాష్ట్రానికి చెందిన సంజయ్‌కుమార్‌గా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. కాగా సంజయ్ సికింద్రాబాద్‌లోని ఓ హార్డ్‌వేర్ షాపులో పనిచేస్తున్నట్లు తెలిసింది. సంజయ్ మానసిక పరిస్థితి సరిగా లేనట్టు బంధువులు పేర్కొన్నారు. -
తాగుబోతు భర్తతో వేగలేక భార్య దారుణం.. పిల్లలతో సహా..
రామగుండం: అన్యోన్యంగా సాగిపోతున్న కుటుంబంలో కలహాలు చెలరేగాయి. రోజూ తాగొచ్చి వేధిస్తున్న భర్తతో వేగలేక ఆమె మరణమే శరణ్యమని భావించింది. తాను లేకుంటే పిల్లలెలా బతుకుతారనుకుందో ఏమో.. వారినీ తన వెంటే తీసుకెళ్లాలని కఠిన నిర్ణయం తీసుకుంది. అంతే ఇద్దరు పిల్లలను ఎదురుగా వస్తున్న రైలుకింద తోసి.. తాను దూకింది. ఈ సంఘటనలో తల్లి అక్కడికక్కడే మృత్యువాత పడగా.. గాయపడిన పిల్లలిద్దరినీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ అక్కడ ఓ చిన్నారి కన్నుమూసింది. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలంలో ఆదివారం మధ్యాహ్నం ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. రామగుండం జీఆర్పీ ఔట్‌పోస్టు ఇన్చార్జి గంగారపు తిరుపతి కథనం ప్రకారం.. స్థానిక యైటింక్లయిన్‌కు చెందిన జంగేటి ప్రవీణ్‌కు ఎన్టీపీసీలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్న ఓరుగంటి వెంకటరమణ కూతురు అరుణతో ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు సాత్విక్ (5), కూతురు సాత్విక (2) ఉన్నారు. భర్త మద్యానికి బానిస కావడంతో.. కాగా, ప్రవీణ్ కొంత కాలంగా పనికి వెళ్లకుండా మద్యానికి బానిసయ్యాడు. పుట్టింటి నుంచి డబ్బులు తీసుకురావాలని అరుణను వేధించసాగాడు. ఆ వేధింపులు భరించలేక అరుణ జీవితంపై విరక్తి చెంది.. తాను చనిపోతే పిల్లలు ఒంటరి వారవుతారని భావించి పిల్లలతో సహా రామగుండం రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. మధ్యాహ్నం రెండుగంటలకు సికింద్రాబాద్ నుంచి దాణాపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు వస్తున్న క్రమంలో ముందుగా పిల్లలను తోసింది. అనంతరం తానూ రైలు కింద పడింది. అయితే రైలు కొద్దిదూరంలో ఉండడంతో గమనించిన లోకోపైలట్ హారన్ మోగించాడు. సడన్ బ్రేక్ వేసినా ఫలితం లేకపోయింది. రైలు తల్లితోపాటు ఇద్దరు చిన్నారులపైకి కొద్దిదూరం దూసుకెళ్లింది. రైలు ఆగాక లోకోపైలట్ జీఆర్పీ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ముగ్గురినీ రైలు కింద నుంచి బయటకు తీశారు. అరుణ తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే చనిపోయింది. పిల్లలు తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతుండగా.. వారిని 108లో గోదావరిఖని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాత్విక మృతిచెందింది. బాబు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. అరుణ తండ్రి వెంకటరమణ ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సూపర్ ఫాస్ట్ క్షణాల్లో పైకి దూసుకురావడంతో..
రామగుండం: ఔను, ఈ కీమెన్ మృత్యు కోరల్లోకెళ్లి ప్రాణగండం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటన సోమవారం పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వేస్టేషన్ సమీపంలోని కుందనపల్లి రైల్వేగేటు వద్ద చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. కుందనపల్లి రైల్వేగేటు వద్ద కీమెన్ కత్తుల దుర్గయ్యతోపాటు మరికొంత మంది కార్మికులు రైల్వే ట్రాక్ నిర్వహణ పనుల్లో నిమగ్నమయ్యారు. మూడు రైల్వే ట్రాకుల్లో ఒక ట్రాక్‌పై పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎదురుగా గూడ్సు రైలు వస్తుండటంతో మరో ట్రాక్ మీదకు కార్మికులు చేరుకున్నారు. అప్పటికే అతి దగ్గరలో ఉన్న రాజధాని సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ క్షణాల్లో కీమెన్ దుర్గయ్యపై దూసుకొచ్చింది. అప్రమత్తమైన ఆయన ఇంజిన్ కిందకు దూరిపోయాడు. రెండు బోగీలు అతని పైనుంచి వెళ్లాయి. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన వారు భయాందోళన చెందారు. రైలు కో పైలెట్ చాకచక్యంగా వ్యవహరించాడు. సడెన్ బ్రేక్ వేసి రైలును కొద్ది దూరంలో నిలిపివేశాడు. అప్పటికే కీమెన్ పైనుంచి రెండు బోగీలు వెళ్లడంతో బాధితుడు నుజ్జునుజ్జు అయి ఉంటాడని అందరూ భావించారు. కానీ దుర్గయ్య పట్టాల మధ్యలో ప్రాణాలు బిగపట్టుకొని పడుకుని ఉన్నాడు. ఎడమ కాలి ఎముక విరిగి ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అతడిని రైలు కింద నుంచి బయటకు లాగి హుటాహుటిన స్థానిక రైల్వే ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం కరీంనగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం దుర్గయ్యకు ఎలాంటి ప్రాణపాయం లేదని వైద్యులు తెలిపారు. -
అండమాన్ ఎక్స్‌ప్రెస్ ఐదు గంటలు ఆలస్యం
రామగుండం (కరీంనగర్ జిల్లా): జమ్ముకాశ్మీర్‌లో కుండపోత వర్షాలు, పోటెత్తిన వరదల కారణంగా పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. సోమవారం జమ్ముతావి నుంచి చెన్నై వెళ్లే అండమాన్ ఎక్స్‌ప్రెస్ రైలు ఐదు గంటలు ఆలస్యంగా నడుస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు కరీంనగర్ జిల్లా రామగుండం రైల్వేస్టేషన్‌కు సాయంత్రం 4.30 గంటలకు రావాల్సి ఉండగా, ఐదు గంటల ఆలస్యంగా రాత్రి 10 గంటలకు వచ్చింది. రైళ్లు ఆలస్యంగా నడుస్తుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు.