Ramakrishna math
-
లోక కల్యాణమే హితంగా...
రామకృష్ణ మిషన్ అధ్యక్షులు, అత్యంత సీనియర్ సాధువు అయిన స్వామి స్మరణానంద తన 94వ యేట మార్చ్ 26న పరమపదించడం చాలా మందిని విషాదంలోకి నెట్టింది. సంపూర్ణ జీవితం గడిపిన స్మరణానంద... రామకృష్ణ పరమహంస, శారదామాత, స్వామి వివేకానంద ఆలోచనల వ్యాప్తికి తమ జీవితాన్ని అంకితం చేశారు. భారతదేశ ఆధ్యాత్మిక స్పృహను పెంచుతూనే... విద్యాభివృద్ధికీ, గ్రామీణాభివృద్ధికీ రామకృష్ణ మిషన్ చేస్తున్న కృషి మనందరికీ స్ఫూర్తిదాయకం. భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో అనేక దశలలో, మన మాతృభూమిని ఎందరో సాధువులు ఆశీర్వదించారు. ‘ఆత్మనో మోక్షార్థం జగద్ధితాయ చ’ అనే సిద్ధాంతానికి స్వామి స్మరణానంద జీవితం చెరగని ఉదాహరణ. లోక్ సభ ఎన్నికల ఘన పండుగ హడావిడిలో ఓ వార్త మనసులో కొన్ని క్షణాల పాటు అలజడిని సృష్టించింది. భారత దేశ ఆధ్యాత్మిక చింతనలో అగ్ర గణ్యులైన శ్రీమత్ స్వామి స్మరణానంద జీ మహారాజ్ గతించడం (మార్చ్ 26) వ్యక్తిగత నష్టం లాంటిది. కొన్ని సంవత్సరాల క్రితం, స్వామి ఆత్మస్థానంద జీ మరణం, ఇప్పుడు స్వామి స్మరణా నంద శాశ్వతంగా నిష్క్రమించడం చాలా మందిని విషాదంలోకి నెట్టింది. కోట్లాది మంది భక్తులు, సాధువులు, రామకృష్ణ మఠం, మిషన్ అనుచరుల మాదిరిగానే నా హృదయం కూడా బాధగా ఉంది. ఈ నెల ప్రారంభంలో బెంగాల్ పర్యటనకు వెళ్లినప్పుడు స్వామి స్మరణానంద జీ ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు ఆస్పత్రికి వెళ్లాను. స్వామి ఆత్మస్థానంద జీ మాదిరిగానే, స్వామి స్మరణానంద జీ... ఆచార్య రామకృష్ణ పరమహంస, మాతా శారద మరియు స్వామి వివేకానంద ఆలోచనల ప్రపంచవ్యాప్తికి తమ జీవితాన్ని అంకితం చేశారు. ఈ వ్యాసం రాస్తున్నప్పుడు ఆయనతో జరిపిన సమావేశాలు, ఆయనతో నా సంభాషణలు, ఆ జ్ఞాపకాలు నా మదిలో సజీవంగా కదలాడుతున్నాయి. 2020 జనవరిలో బేలూరు మఠంలో ఉన్న సమయంలో స్వామి వివేకానంద గదిలో కూర్చొని ధ్యానం చేశాను. ఆ పర్యటనలో నేను స్వామి స్మరణానందతో స్వామి ఆత్మస్థానంద గురించి చాలాసేపు మాట్లాడాను. రామకృష్ణ మిషన్‌తో, బేలూరు మఠంతో నాకు ఎంత సన్నిహిత సంబంధం ఉందో మీకు తెలుసు! ఒక ఆధ్యాత్మిక సాధకుడిగా, గత ఐదు దశాబ్దాలుగా నేను వివిధ సాధువులను, మహాత్ములను కలిశాను, అనేక ప్రదేశాలకు వెళ్ళాను. రామకృష్ణ మఠంలో కూడా ఆధ్యాత్మికతకు తమ జీవితాలను అంకితం చేసిన సాధువులతో నాకు పరిచయం ఏర్పడింది. వారిలో స్వామి ఆత్మస్థానంద, స్వామి స్మరణానంద వంటి ప్రముఖులు ఉన్నారు. వారి పవిత్రమైన ఆలోచనలు, జ్ఞానం నా మనస్సుకు నిరంతర సంతృప్తినిచ్చాయి. జీవితంలో అత్యంత ముఖ్యమైన కాలంలో, అటువంటి సాధువులు నాకు ‘ప్రజా సేవయే దేవుని సేవ’ అనే నిజమైన సూత్రాన్ని బోధించారు. ‘ఆత్మనో మోక్షార్థం జగద్ధితాయ చ’ (స్వీయ విముక్తి కోసం మరియు లోక కల్యాణం కోసం) అనే రామకృష్ణ మిషన్ సిద్ధాంతానికి స్వామి ఆత్మస్థానంద, స్వామి స్మరణానంద జీవితాలు చెరగని ఉదాహరణ. విద్యాభివృద్ధికీ, గ్రామీణాభివృద్ధికీ రామకృష్ణ మిషన్ చేస్తున్న కృషి మనందరికీ స్ఫూర్తిదాయకం. భారతదేశ ఆధ్యాత్మిక స్పృహ, విద్యా సాధికారత, మానవతా సేవ సంకల్పానికి రామకృష్ణ మిషన్ పని చేస్తోంది. 1978లో బెంగాల్‌ను వరదలు ముంచెత్తినప్పుడు రామకృష్ణ మిషన్ తన నిస్వార్థ సేవతో అందరి çహృదయాలను గెలుచుకుంది. 2001లో కచ్ భూకంపం వచ్చినప్పుడు విపత్తు నిర్వహణకు రామకృష్ణ మిషన్ అన్ని విధాలుగా సహాయం చేయడానికి సిద్ధంగా ఉందని నాకు ఫోన్ చేసి చెప్పిన మొదటి వ్యక్తుల్లో స్వామి ఆత్మస్థానంద ఒకరు. ఆయన సూచనల మేరకు రామకృష్ణ మిషన్ భూకంప విపత్కర సమయంలో ప్రజలకు ఎంతో సాయం చేసింది. కొన్నేళ్లుగా స్వామి ఆత్మస్థానంద, స్వామి స్మరణానంద వివిధ పదవుల్లో ఉంటూ సామాజిక సాధికారతకు పెద్దపీట వేశారు. ఆధునిక విద్య, నైపుణ్యం, మహిళా సాధికారత పట్ల ఇలాంటి మహానుభావులు ఎంత గంభీరంగా ఉండేవారో వీరి జీవితాలు తెలిసిన వారికి తప్పకుండా గుర్తుండే ఉంటుంది. స్వామి ఆత్మస్థానందజీ మహోన్నత వ్యక్తిత్వంలోని ప్రత్యేకత నన్ను బాగా ఆకట్టుకుంది. ప్రతి సంస్కృతి, ప్రతి సంప్రదాయం పట్ల ఆయనకున్న గౌరవం, ప్రేమ దీనికి కారణం. ఆయన భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో చాలాకాలం గడిపారు. నిరంతరం ప్రయాణించే వారు. గుజరాత్లో ఉంటూ గుజరాతీ మాట్లాడటం నేర్చుకున్నారు. నాతో కూడా ఆయన గుజరాతీలోనే మాట్లాడేవారు. ఆయన గుజరాతీ మాట్లాడుతుంటే వినడం నాకు బాగుండేది. భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో అనేక దశలలో, మన మాతృభూమిని స్వామి ఆత్మస్థానంద, స్వామి స్మరణానంద వంటి ఎందరో సాధువులు ఆశీర్వదించారు. వారు సామాజిక మార్పు గురించి మనకు కొత్త చైతన్యాన్ని అందించారు. సమాజ శ్రేయస్సు కోసం కలసికట్టుగా పనిచేయాలని ఈ సాధువులు మనకు దీక్షను అందించారు. ఈ సూత్రాలు ఎప్పటికీ శాశ్వతమైనవి. రాబోయే కాలంలో ఈ ఆలోచనలు అభివృద్ధి చెందిన భారతదేశానికి, అమృత్ కాలానికి సంకల్పశక్తిగా మారతాయి. అలాంటి మహనీయులకు యావత్ దేశం తరఫున మరోసారి నివాళులర్పిస్తున్నాను. రామకృష్ణ మిషన్‌తో సంబంధం ఉన్నవారంతా ఆయన చూపిన మార్గాన్ని మరింత ముందుకు తీసుకెళ్తారనే నమ్మకం ఉంది. ఓం శాంతి. నరేంద్ర మోదీ భారత ప్రధాని -
ఆచరణే వేదాంత పరమలక్ష్యం: స్వామి బోధమయానంద
సాక్షి, హైదరాబాద్: నిత్యజీవితంలో ఆచరణే వేదాంత పరమలక్ష్యమని హైదరాబాద్ రామకృష్ణమఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద చెప్పారు. రామకృష్ణ మిషన్ 125వ వార్షికోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ రామకృష్ణమఠంలో ఆరోగ్య సేవలపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్ రామకృష్ణ మఠంలో వివేకానంద ఆరోగ్య కేంద్రానికి 44 సంవత్సరాలుగా పేదలకు వైద్యసేవలు అందిస్తున్న విషయాన్ని వెల్లడించారు. వైద్యులకు, రోగులకు మధ్య ఆరోగ్యకరమైన అనుబంధం ఉండాలని కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు గుర్తుచేశారు. వైద్య వృత్తిని సేవాభావంతో నిర్వహించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని సూచించారు. కార్యక్రమంలో పద్మశ్రీ డాక్టర్ రవీంద్ర, డాక్టర్ స్మితా కోల్హే, నేషనల్ మెడికల్ కమిషన్ సభ్యుడు, డాక్టర్ సంతోష్ క్రాలేటి, యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మెన్ రవీందర్ రావు, బేలూర్ మఠానికి చెందిన స్వామి సత్యేశానంద, ఈటానగర్ రామకృష్ణ మిషన్‌కు చెందిన స్వామి కృపాకరానంద, ముంబై రామకృష్ణ మిషన్ హాస్పిటల్‌కు చెందిన స్వామి దయాధిపానంద, వైద్యులు, వాలంటీర్లు, భక్తులు పాల్గొన్నారు. చదవండి: విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పిన హైదరాబాద్ మెట్రో -
ఆనందాన్ని అనుభవించాలి..
సాక్షి, సిటీబ్యూరో :నేటి శిశువులే రేపటి బాలలు.. రేపటి బాలలే భావిభారత పౌరులు..సమాజం, దేశం ఆరోగ్యంగా, సుభిక్షంగా ఉండాలంటే అది కేవలం విద్యతోనే సాధ్యం కాదు. కడుపులోని శిశువు జన్మించినప్పటి నుంచి తల్లి ఆలోచనలు, భావోద్వేగాల ప్రతిరూపంగా బిడ్డల స్వరూప, స్వభావాలుంటాయని నేటి సైన్స్, నాటి పురాణాలు చెబుతున్నాయి. తల్లులమానసిక ఆరోగ్యం, ప్రశాంతత, పాజిటివ్ ఆలోచనలు పిల్లలపై ప్రభావం చూపిస్తాయనేది వాస్తవం. ఈ నేపథ్యంలో గర్భిణుల మానసిక ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ.. కడుపులో ఉన్న బిడ్డలు సద్గుణాలతో పుట్టాలనే లక్ష్యంతోసరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది దోమలగూడలోని రామకృష్ణ మఠం. ఆర్యజనని పేరుతో గర్భిణులకు ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది తల్లులు ఇప్పటికే చక్కటి బిడ్డలను ప్రసవించారు. రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో అక్కడి వలంటీర్లు, డివోటీలు చేపట్టిన ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోంది. అక్కడ శిక్షణ ఇస్తున్న డాక్టర్లు, శిక్షణ పొందిన తల్లులు తమ అనుభవాలనుఇలా పంచుకున్నారు. – పాజిటివ్ ఆలోచనల పెంపు.. ప్రతి నెలా 2, 4 శనివారాల్లో ఉదయం 9– 12 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. తల్లుల్లో పాజిటివ్ ఆలోచనలను పెంపొందించేందుకు ఈ వర్క్‌షాప్‌లో ప్రయత్నిస్తుంటాం. సంగీతం, డీప్ రిలాక్షేషన్ టెక్నిక్స్, మెడిటేషన్, యోగాసనాల ద్వారా ఒత్తిడిని దూరం చేసుకునే విధానాలను నేర్పుతాం. గర్భిణులకు మానసిక ప్రశాంతత, ఆలోచన తీరును అలవాటు చేస్తాం. వారు పాటించాల్సిన 10 నియమాలను ఇచ్చి, వాటిని ఫాలో చేసేలా చూస్తున్నాం. గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవానికి ముందు ఎప్పుడైనా ఈ వర్క్‌షాపుల్లో పాల్గొనవచ్చు. తల్లులు ఒక్క వర్క్‌షాప్‌లో పాల్గొన్నా బిడ్డకు చాలా ఉపయోగం. – డాక్టర్ అనుపమ, పీడియాట్రిషన్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్.. ఈ కాన్సెప్ట్ ఏడాదిన్నర క్రితం ప్రారంభించారు. ఇక్కడి వివేకానంద క్లినిక్‌కి చాలా మంది గర్భిణులు వస్తుంటారు. ఆహారం, మందులతో పాటు వారికి మరింత శిక్షణ, ముఖ్యంగా పుట్టబోయే బిడ్డలతో తల్లులకుండే సంబంధాన్ని వివరించటం ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తల్లుల భావోద్వేగాల వల్ల కడుపులో ఉన్న బిడ్డ ఎలా ప్రభావం చెందుతుందో చూపిస్తాం. గర్భిణిగా ఉన్నప్పుడు సాఫ్ట్ మ్యూజిక్‌ని వినటం అలవాటు చేస్తాం. వీటిలో శ్లోకాలు, భజనలుంటాయి. సంగీతం ద్వారా స్వభావంలో, ఆలోచనల్లో మార్పులు సాధ్యమని పరిశోధనలు వివరిస్తున్నాయి.–డాక్టర్ కస్తూరి,సీనియర్ గైనకాలజిస్ట్ వర్క్‌షాప్‌తో కార్యరూపం.. ఎన్నో ఏళ్ల క్రితమే స్వామి వివేకానంద చెప్పిన విషయాలకు వర్క్‌షాప్ ద్వారా కార్యరూపం ఇస్తున్నాం. మఠం డివోటీస్, వలంటర్లు కలిసి ఆర్య జనని కార్యక్రమాన్ని ప్రారంభించారు. మన ప్రభుత్వాలు గర్భిణికి పోషకాహారం అందించే విషయంలో బాగానే కృషిచేస్తున్నాయి. వీటితో పాటు కల్చరల్, స్పిరిచ్యువల్, ఎమోషనల్ అంశాలు కూడా బిడ్డకి అవసరమైనవే. గర్భ సమయంలో తల్లి భావోద్వేగాలు, ఆలోచనలు నెగెటివ్‌గా ఉంటే బిడ్డ కూడా అలాంటి స్వభావంతోనే జన్మిస్తుంది. అందుకే తల్లి చాలా జాగరూకతతో ఉండాల్సిన అవసరం ఉంది. ఆలోచనలను కల్టివేట్ చేసే అవకాశం మనిషికి మాత్రమే ఉంది.– స్వామి స్థితికంఠానంద అనవసర భయాలు వద్దు.. రెండో పాప శాంభవి కడుపులో ఉన్నప్పుడు ఈ శిక్షణకు వచ్చాను. ప్రెగ్నెసీ గురించి అనవసర భయాలు వద్దు. ఎక్కువ చదివి, అనవసర భయాలు పెంచుకుంటున్నాం. అలాంటి భయాలు ఇక్కడికి వచ్చాక పోయాయి. వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. పిల్లలు మన మాట వినట్లేదు అని కంప్లెంట్ చేసే ముందు, అలాంటి ధోరణి మనలో ఉందేమో అని చూసుకుని సరిచేసుకోవాలి. అలా నన్ను సరిచేసుకోవటానికి ప్రయత్నిస్తున్నాను. పిల్లల్లోనూ మార్పు చూస్తున్నాను. – సువిధ, శాంభవి తల్లి ఆనందాన్ని అనుభవించాలి.. బాబు అభిరాం కడుపులో ఉన్నప్పుడు 5వ నెలలో ఇక్కడికి వచ్చాను. యోగాభ్యాసం, ధ్యానం నేర్చుకున్నాను. ముఖ్యంగా మానసికంగా ప్రశాంతంగా ఉండటం ఇక్కడ అలవర్చుకున్నాను. దాంతో పాటు ప్రెగ్నెన్సీలో ఉండే ఆనందాన్ని అనుభవించటం తెలియాలి. అది ఎంత ముఖ్యమో ఇక్కడ తెలుసుకున్నాను. కడుపుతో ఉన్నప్పుడు నేను ఎలా ఉన్నానో, బిడ్డ ఎలా ఉండాలి అనుకున్నానో మాబాబు ఇప్పుడు అలాగే ఉన్నాడు. నేను అప్పుడు ఏ మ్యూజిక్, పుస్తకాలు ఇష్టపడ్డానో బాబు అవి ఇప్పుడు ఇష్టంగా వింటాడు. – భావన, అభిరాం తల్లి తల్లిదండ్రులకు వరం.. మా పాప లిషిత. అన్ని శ్రద్ధగా ఫాలో అయ్యాను. ఈ శిబిరం ద్వారా నన్ను నేను తెలుసుకునే అవకాశం కలిగింది. ఇక్కడ ఇష్టమైన కళను ప్రాక్టిస్ చేయాలని చెప్పారు. అలా నేను వేసిన డ్రాయింగ్స్‌తో ఒక పుస్తకం తయారైందిప్పుడు. ప్రెగ్నెసీలో ఫోన్ పక్కన పెట్టి పుస్తకాలు, మ్యూజిక్ వింటూ ప్రశాంతంగా, ఆనందంగా ఉన్నాను. మా పాప ఎప్పుడూ హ్యాపీగా ఉంటుంది. – భార్గవి, లిషిత తల్లి ♦ మొదటిసారి రిజిస్ట్రేషన్ ఫీజు రూ.500 ♦ సెషన్‌కు రూ.350 ♦ మరిన్ని వివరాలకు http://aaryajanani.org -
సంస్కార భారత్
-
సమస్యలను ఎదుర్కొనే కిటుకు అదే!
‘‘ఇనుప నరాలు, ఉక్కు కండరాలున్న యువకులు వంద మందిని నాకు ఇస్తే, ఈ దేశాన్నే మార్చేస్తాను!’’ అన్న ద్రష్ట స్వామి వివేకానంద. ఈ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి మొత్తం యువతీ యువకుల చేతుల్లోనే ఉందని నూరేళ్ళ క్రితమే గుర్తించి, ఆ సంగతిని అప్పుడే బాహాటంగా చాటిన దార్శనికత ఆయనది. నేడు స్వామి వివేకానంద జన్మదినం సందర్భంగా రామకృష్ణ మఠం హైదరాబాద్ అధ్యక్షులు స్వామి జ్ఞానదానందతో సాక్షి సంభాషణ... - స్వామి జ్ఞానదానంద, ‘రామకృష్ణ మఠం’ హైదరాబాద్ అధ్యక్షులు దాదాపు నూట ఇరవై ఏళ్ళ క్రితం అమెరికా నుంచి స్వామి వివేకానంద తన సోదర శిష్యులకు ఉత్తరం రాస్తూ, ‘‘కిన్నామ రోదసి... న జడః కదాచిత్॥అని పేర్కొన్నారు. అంటే, ‘ఓ మిత్రమా! నువ్వెందుకు విలపిస్తున్నావు? సమస్త శక్తీ నీలోనే ఉంది. ఓ శక్తిశాలీ! నీ సర్వశక్తి స్వభావాన్ని వెలికి తీసుకురా! ఈ లోకం సమస్తం నీకు పాదాక్రాంతమవుతుంది’ అని! ముఖ్యంగా, యువతరం ఈ సంగతిని గుర్తుంచుకోవాలి. దేనికీ దిగాలుపడకుండా, నిరాశలో కూరుకుపోకుండా మనలోని దైవిక స్వభావాన్ని గుర్తు చేసుకోవాలి. మనం సామాన్యులం కాదనే స్పృహతో ముందుకు వెళితే ఏదైనా సాధించవచ్చు. ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లలను‘నువ్వెందుకూ పనికిరావు. శుద్ధదండగ... ‘నువ్వు పాపివి! నిష్ర్పయోజకుడివి’ అని పదే పదే అనడం వల్ల చివరకు వారు అలానే తయారవుతారు. అలా కాకుండా, సానుకూల దృక్పథంతో ప్రోత్సహిస్తే - పైకి వస్తారు! యువతరం ఇప్పుడు నిద్రాణ స్థితిలో ఉంది. కమ్ముకున్న తెరలను చీల్చుకొని, నిద్రావస్థ నుంచి వాళ్ళు మేల్కొనాలి. తమలోని శక్తిని గ్రహించి, తమ లోపలే ఉన్న ఆ మహాపురుషుణ్ణి దర్శించాలి. అలా తమ అసలు సిసలు ఆత్మ స్వభావాన్ని గ్రహించి, తమ ఔన్నత్యాన్ని తెలుసుకుంటే చాలు - అన్నిటా విజయం వరిస్తుంది. ‘లేవండి! మేల్కొనండి! గమ్యం చేరే వరకు విశ్రమించకండి!’ అని స్వామి వివేకానంద పదే పదే గుర్తు చేసింది అందుకే! మన ఆత్మస్వభావం తెలుసుకోకపోతే - ఎలా తయారవుతామనడానికి ఒక కథ ఉంది. అనగనగా ఒక గొర్రెల కాపరి. ఒకసారి నిండు గర్భిణి అయిన ఒక ఆడసింహం అతని గొర్రెల మంద మీద పడింది. ఆ గందరగోళంలో ఆ సింహం మరొక సింహం పిల్లకు జన్మనిచ్చి, మరణించింది. గొర్రెల కాపరి దగ్గర, ఆ మందలో ఒక గొర్రెపిల్లగా, గడ్డి తింటూ, గొర్రెస్వభావంతో పెరిగిందా - గొర్రెసింహం. తీరా ఒకసారి ఒక సింహం దాడికి వచ్చినప్పుడు, గొర్రెల్లో ఒకదానిలా భయపడిపోతున్న ఈ గొర్రెసింహాన్ని చూసి, తీసుకెళ్ళి, బావిలోని నీటిలో ప్రతిబింబం చూపి, దాని స్వభావాన్ని ఎరుకపరిచింది. అప్పటి నుంచి ఆ పిల్ల సింహం మరుగునపడ్డ తన స్వభావాన్ని గ్రహించి, గర్జన చేసింది. ఈ కథలో ఈ పిల్ల సింహం మనమైతే, మనకు మన నిజ స్వభావాన్ని తెలియజెప్పే పెద్ద సింహం - స్వామి వివేకానంద. ఇవాళ్టికీ స్వామీజీ బోధనల్ని చదివి, తమకు తాము బోధించుకొని, ఆచరణలో పెడితే యువకులు సింహాలై గర్జిస్తారు. వారి వ్యక్తిత్వమే పూర్తిగా మారిపోతుంది. దురదృష్టవశాత్తూ ఇవాళ్టి సమాజంలో జనం తమలో దైవత్వం ఉందనీ, తాము అమృతపుత్రులమనీ విస్మరిస్తున్నారు. సమస్యలొస్తే - దైర్యంగా ఎదుర్కోవడం లేదు. దూరంగా పారిపోతున్నారు. తీవ్ర నిరాశలో మునిగిపోతున్నారు. కానీ, దాని వల్ల లాభం లేదు. పారిపోయే కొద్దీ సమస్యలు ఇంకా బలపోతమవుతాయి. వెంటాడతాయి. వేధిస్తాయి. మనం బలహీనమైపోతాం. అలాకాక, ధైర్యంగా ఎదుర్కొంటే, సమస్యలు బలహీనమై, పారిపోతాయి. అదే అసలు కిటుకు! చదువంటే మార్కులు, ర్యాంకుల పంటలే కాదు... మనిషి శీల నిర్మాణ విద్య. వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతూ మనిషిలో మానసిక బలాన్నీ, ఆత్మవిశ్వాసాన్నీ, నిర్భీతినీ పెంపొందించాలి. అలాంటివి బోధించడానికే, రామకృష్ణ మఠం శాఖలు కృషి చేస్తున్నాయి. హైదరాబాద్ శాఖలో ఏటా దేశం నలుమూలల నుంచి వచ్చిన యువతీ యువకులతో ‘యువజన సమ్మేళనం’ జరుపుతున్నాం. అలాగే, ‘హౌ టు ఓవర్‌కమ్ టెన్షన్ అండ్ వర్రీ’, ‘హౌ టు ఓవర్‌కమ్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్స్’ లాంటి అంశాలపై తరచూ క్లాసులు, సెమినార్లు, ఉపన్యాసాలు నిర్వహిస్తున్నాం. వాటివల్ల ఎంతోమంది జీవితాలు బాగుపడడం స్వయంగా చూస్తున్నాం. ఒక్కముక్కలో చెప్పాలంటే - స్వామీజీ ఆ రోజుల్లోనే అన్నట్లు - యువతరానికి ముఖ్యంగా కావాల్సింది ఆత్మవిశ్వాసం. అది ఉంటే చాలు - మిగిలినవన్నీ జీవితంలో సాధించుకోగలుగుతారు. మరి, అలా మన మీద మనకు నమ్మకం కలిగించే బోధనలంటే - ఈ తరానికి స్వామి వివేకానంద బోధనల వినా మరో మార్గం లేదు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని ఏటా జరుపుకొనే ఈ జాతీయ యువజన దినోత్సవం నాడు మరోసారి ఆయన మాటలను పునశ్చరణ చేసుకుందాం. ఆ మాటలను ఆచరణలో పెట్టి, నవ భారత నిర్మాణానికి నడుం కడదాం!! సర్వం శ్రీ రామకృష్ణార్పణమస్తు - రెంటాల జయదేవ -
యువతకు వివేకానందుడు ఆదర్శం
దేవరకద్ర, న్యూస్‌లైన్: యువతకు ఆదర్శంగా నిలిచిన గొ ప్ప వ్యక్తి వివేకానందుడని, ఆయన ఆశ య సాధనకు యువ త ముందుకు రావాలని హైదరాబాద్ రా మకృష్ణ మఠం ప్రతినిధి స్వామి శిథికంఠనంద మహారాజ్ పిలుపు నిచ్చారు. వివేకానందుని 150 జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న రథయాత్ర ఆదివారం దేవరకద్రకు చేరుకున్నది. వివేకానందుని రథయాత్ర ఊరేగింపు పట్టణంలో నిర్వహించిన అనంతరం స్థానిక శ్రీనివాస గార్డెన్లో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. యువత వివేకానందుడి ఆశయాలను నెరవేర్చడానికి కృషి చేయాలని కోరారు. భారత సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటిన గొప్ప దేశభక్తుడని కొనియాడారు. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ దే శభక్తితో పాటు మన సంస్కృతిని కాపాడేందుకు కట్టుబడి ఉండాలని కోరారు. వివేకానందుని జీవితచరిత్రను ప్రతి ఒక్కరూ చద వడంతో పాటు ఆయన అడుగుజాడల్లో నడవాలన్నారు. మనలో దాగి ఉన్న శక్తి సామర్థ్యాలను దేశం కోసం, సమాజం కోసం వినియోగించాలని కోరారు. మంచి మార్గంలో నడుస్తూ యువత సమాజ సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. అంతకుముందు వివేకానందుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం స్వామి శిథికంఠనంద మహారాజ్‌ను పలువురు పుర ప్రముఖులు సన్మానించారు. సమావేశంలో రథయాత్ర జిల్లా ఇన్చార్జి రాజమల్లేశ్, యూత్ఫర్సేవా ప్రతినిధి చైతన్యరెడ్డి, సర్పంచ్ శోభా, రాందాసు, కరణం రాజు, రాందేవ్‌రెడ్డి, యజ్ఞభూపాల్రెడ్డి, ఆంజనేయులుగౌడ్, జట్టినర్సింహా రెడ్డి, కొండశ్రీనివాసరెడ్డి, చంద్రయ్య, నర్వ శ్రీనివాసరెడ్డి,సుధాకర్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, తదితరులు పాల్గోన్నారు.