ఆనందాన్ని అనుభవించాలి.. | Awareness on Pregnent Women in Ramakrishna Math | Sakshi
Sakshi News home page

ఆనందాన్ని అనుభవించాలి..

Published Wed, Sep 4 2019 11:26 AM | Last Updated on Tue, Sep 10 2019 11:58 AM

Awareness on Pregnent Women in Ramakrishna Math - Sakshi

సాక్షి, సిటీబ్యూరో :నేటి శిశువులే రేపటి బాలలు.. రేపటి బాలలే భావిభారత పౌరులు..సమాజం, దేశం ఆరోగ్యంగా, సుభిక్షంగా ఉండాలంటే అది కేవలం విద్యతోనే సాధ్యం కాదు. కడుపులోని శిశువు జన్మించినప్పటి నుంచి తల్లి ఆలోచనలు, భావోద్వేగాల ప్రతిరూపంగా బిడ్డల స్వరూప, స్వభావాలుంటాయని నేటి సైన్స్, నాటి పురాణాలు చెబుతున్నాయి. తల్లులమానసిక ఆరోగ్యం, ప్రశాంతత, పాజిటివ్‌ ఆలోచనలు పిల్లలపై ప్రభావం చూపిస్తాయనేది వాస్తవం. ఈ నేపథ్యంలో గర్భిణుల మానసిక ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ.. కడుపులో ఉన్న బిడ్డలు సద్గుణాలతో పుట్టాలనే లక్ష్యంతోసరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది దోమలగూడలోని రామకృష్ణ మఠం. ఆర్యజనని పేరుతో గర్భిణులకు ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది తల్లులు ఇప్పటికే చక్కటి బిడ్డలను ప్రసవించారు. రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో అక్కడి వలంటీర్లు, డివోటీలు చేపట్టిన ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోంది. అక్కడ శిక్షణ ఇస్తున్న డాక్టర్లు, శిక్షణ పొందిన తల్లులు తమ అనుభవాలనుఇలా పంచుకున్నారు.      –

పాజిటివ్‌ ఆలోచనల పెంపు..
ప్రతి నెలా 2, 4 శనివారాల్లో ఉదయం 9– 12 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. తల్లుల్లో పాజిటివ్‌ ఆలోచనలను పెంపొందించేందుకు ఈ వర్క్‌షాప్‌లో ప్రయత్నిస్తుంటాం. సంగీతం, డీప్‌ రిలాక్షేషన్‌ టెక్నిక్స్, మెడిటేషన్, యోగాసనాల ద్వారా ఒత్తిడిని దూరం చేసుకునే విధానాలను నేర్పుతాం. గర్భిణులకు మానసిక ప్రశాంతత, ఆలోచన తీరును అలవాటు చేస్తాం. వారు పాటించాల్సిన 10 నియమాలను ఇచ్చి, వాటిని ఫాలో చేసేలా చూస్తున్నాం. గర్భం దాల్చినప్పటి  నుంచి ప్రసవానికి ముందు ఎప్పుడైనా ఈ వర్క్‌షాపుల్లో పాల్గొనవచ్చు. తల్లులు ఒక్క వర్క్‌షాప్‌లో పాల్గొన్నా బిడ్డకు చాలా ఉపయోగం.      – డాక్టర్‌ అనుపమ, పీడియాట్రిషన్‌ 

పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌..
ఈ కాన్సెప్ట్‌ ఏడాదిన్నర క్రితం ప్రారంభించారు. ఇక్కడి వివేకానంద క్లినిక్‌కి చాలా మంది గర్భిణులు వస్తుంటారు. ఆహారం, మందులతో పాటు వారికి మరింత శిక్షణ, ముఖ్యంగా పుట్టబోయే బిడ్డలతో తల్లులకుండే సంబంధాన్ని వివరించటం ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా తల్లుల భావోద్వేగాల వల్ల కడుపులో ఉన్న బిడ్డ ఎలా ప్రభావం చెందుతుందో చూపిస్తాం. గర్భిణిగా ఉన్నప్పుడు సాఫ్ట్‌ మ్యూజిక్‌ని వినటం అలవాటు చేస్తాం. వీటిలో శ్లోకాలు, భజనలుంటాయి. సంగీతం ద్వారా స్వభావంలో, ఆలోచనల్లో మార్పులు సాధ్యమని పరిశోధనలు వివరిస్తున్నాయి.–డాక్టర్‌ కస్తూరి,సీనియర్‌ గైనకాలజిస్ట్‌

వర్క్‌షాప్‌తో కార్యరూపం..
ఎన్నో ఏళ్ల క్రితమే స్వామి వివేకానంద చెప్పిన విషయాలకు వర్క్‌షాప్‌ ద్వారా కార్యరూపం ఇస్తున్నాం. మఠం డివోటీస్, వలంటర్లు కలిసి ఆర్య జనని కార్యక్రమాన్ని ప్రారంభించారు. మన ప్రభుత్వాలు గర్భిణికి పోషకాహారం అందించే విషయంలో బాగానే కృషిచేస్తున్నాయి. వీటితో పాటు కల్చరల్, స్పిరిచ్యువల్, ఎమోషనల్‌ అంశాలు కూడా బిడ్డకి అవసరమైనవే. గర్భ సమయంలో తల్లి భావోద్వేగాలు, ఆలోచనలు నెగెటివ్‌గా ఉంటే బిడ్డ కూడా అలాంటి స్వభావంతోనే జన్మిస్తుంది. అందుకే తల్లి చాలా జాగరూకతతో ఉండాల్సిన అవసరం ఉంది. ఆలోచనలను కల్టివేట్‌ చేసే అవకాశం మనిషికి మాత్రమే ఉంది.– స్వామి స్థితికంఠానంద

అనవసర భయాలు వద్దు.. 
రెండో పాప శాంభవి కడుపులో ఉన్నప్పుడు ఈ శిక్షణకు వచ్చాను. ప్రెగ్నెసీ గురించి అనవసర భయాలు వద్దు. ఎక్కువ చదివి, అనవసర భయాలు పెంచుకుంటున్నాం. అలాంటి భయాలు ఇక్కడికి వచ్చాక పోయాయి. వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. పిల్లలు మన మాట వినట్లేదు అని కంప్లెంట్‌ చేసే ముందు, అలాంటి ధోరణి మనలో ఉందేమో అని చూసుకుని సరిచేసుకోవాలి. అలా నన్ను సరిచేసుకోవటానికి ప్రయత్నిస్తున్నాను. పిల్లల్లోనూ మార్పు చూస్తున్నాను.              – సువిధ,     శాంభవి తల్లి  

ఆనందాన్ని అనుభవించాలి..
బాబు అభిరాం కడుపులో ఉన్నప్పుడు 5వ నెలలో ఇక్కడికి వచ్చాను. యోగాభ్యాసం, ధ్యానం నేర్చుకున్నాను. ముఖ్యంగా మానసికంగా ప్రశాంతంగా ఉండటం ఇక్కడ అలవర్చుకున్నాను. దాంతో పాటు ప్రెగ్నెన్సీలో ఉండే ఆనందాన్ని అనుభవించటం తెలియాలి. అది ఎంత ముఖ్యమో ఇక్కడ తెలుసుకున్నాను. కడుపుతో ఉన్నప్పుడు నేను ఎలా ఉన్నానో, బిడ్డ ఎలా ఉండాలి అనుకున్నానో మాబాబు ఇప్పుడు అలాగే ఉన్నాడు. నేను అప్పుడు ఏ మ్యూజిక్, పుస్తకాలు ఇష్టపడ్డానో బాబు అవి ఇప్పుడు ఇష్టంగా వింటాడు.      – భావన, అభిరాం తల్లి  

తల్లిదండ్రులకు వరం.. 
మా పాప లిషిత. అన్ని శ్రద్ధగా ఫాలో అయ్యాను. ఈ శిబిరం ద్వారా నన్ను నేను తెలుసుకునే అవకాశం కలిగింది. ఇక్కడ ఇష్టమైన కళను ప్రాక్టిస్‌ చేయాలని చెప్పారు. అలా నేను వేసిన డ్రాయింగ్స్‌తో ఒక పుస్తకం తయారైందిప్పుడు. ప్రెగ్నెసీలో ఫోన్‌ పక్కన పెట్టి పుస్తకాలు, మ్యూజిక్‌ వింటూ ప్రశాంతంగా, ఆనందంగా ఉన్నాను. మా పాప ఎప్పుడూ హ్యాపీగా ఉంటుంది.      – భార్గవి, లిషిత తల్లి  

మొదటిసారి రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.500
సెషన్‌కు రూ.350
మరిన్ని వివరాలకు http://aaryajanani.org

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement