వైఎస్ హయాంలో రామవాగు వంతెన నిర్మాణం
టీడీపీ పాలనలో బంధువుల పెళ్లికి వెళ్లాలన్నా.. చంటిబిడ్డను చంకనెత్తుకుని పట్నపు ఆస్పత్రికి తీసుకువెళ్లాలన్నా.. పొద్దుపోయిన తరువాత బస్తీ నుంచి ఇంటికి చేరాలన్నా ప్రత్తిపాడు ప్రజలు పడ్డ ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. గుంటూరు ప్రకాశం జిల్లాలను కలిపే పాత మద్రాసు రోడ్డులో ఉన్న రామవాగు లోలెవల్ బ్రిడ్జి పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. కొండల్లో పడ్డ కొద్దిపాటి వర్షానికి సైతం ఇక్కడి వాగు పొంగిపొర్లి బ్రిడ్జిపై నుంచి ప్రవహించడం సర్వసాధారణమైపోయింది. దశాబ్దాల పాటు రామవాగుతో నరకయాతన అనుభవించిన ప్రజలకు వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక ఆ కష్టాల నుంచి విముక్తి లభించింది.
అప్పటి ఎమ్మెల్యే రావి వెంకటరమణ ఈ సమస్యను వైఎస్ దృష్టికి తీసుకువెళ్లి హైలెవల్ వంతెన నిర్మాణానికి సుమారు రెండు కోట్ల ముపై ్ప లక్షల రూపాయల నిధులను మంజూరు చేయించారు. ఆగమేఘాలపై పనులను పూర్తి చేయించారు. అబ్బినేనిగుంటపాలెం వద్ద ఏబీపాలెం, జీజీపాలెం, రావిపాడు గ్రామాల రైతులకు లబ్దిచేకూరేలా సుమారు మూడు కోట్ల రూపాయలతో ఎత్తిపోతల పథకం నిర్మించారు. చిలకలూరిపేట నుంచి పెదనందిపాడు మీదుగా బంగాళాఖాతం వరకు నల్లమడ వాగు ఆధునికీకరణకు అరవై కోట్ల రూపాయలను కేటాయించారు. అప్పట్లో ప్రజాపథం కార్యక్రమంలో భాగంగా ప్రత్తిపాడుకు వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్రెడ్డి రైతుల కోసం చిలకలూరిపేట, ప్రత్తిపాడు నియోజకవర్గాలకు సంబంధించి కాలువల ఆధునికీకరణకు సుమారు 600 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.