Ramayana story
-
రెండు భాగాలుగా 'రామాయణ’ విడుదలపై ప్రకటన
-
రాముడు – రావణుడు?
రామాయణ ఇతిహాసాన్ని భారీ బడ్జెట్‌తో స్క్రీన్ మీదకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మా తలు అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్ మల్హోత్ర. మూడు భాగాలుగా తెరకెక్కనున్న ఈ సినిమాకు నితేష్ తివారి (‘దంగల్’ ఫేమ్), రవి ఉడయార్ (‘మామ్’ ఫేమ్) దర్శకత్వం వహిస్తారు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ–ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించేవారిలో రాముడిగా హృతిక్ రోషన్, సీత పాత్రలో దీపికా పదుకోన్ నటిస్తారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా రావణ బ్రహ్మ పాత్రను ప్రభాస్ చేస్తే బావుంటుందని చిత్రబృందం భావిస్తోందని ముంబై సమాచారం. రావణుడి పాత్రకు ప్రభాస్ ఫిజిక్ సరిగ్గా సూట్ అవుతుందని, ఆల్రెడీ ‘బాహుబలి’ లాంటి పీరియాడిక్ సినిమా చేసి ఉండటం, ప్యాన్ ఇండియా సూపర్‌స్టార్ అపీల్ ఉండటం.. ఇలా అన్ని విషయాల్లో ప్రభాసే పర్ఫెక్ట్ అని చిత్రబృందం ఆలోచన చేస్తోందట. మరి ఈ సినిమాలో నటించడానికి ప్రభాస్ ఓకే అంటారా? వేచి చూడాలి. -
‘కల్పవృక్షం’ లాంటి కథాసంపుటి
వాల్మీకి రామాయణాన్ని ఎన్నో భాషలలో అనువదించారు. కథల రూపంలో చెప్పారు. గేయరూపంలో గానం చేశారు. ప్రశ్నోత్తరాలుగా పొందుపరిచారు. ఎవరు, ఎన్నివిధాలుగా చెప్పినా, అందులో ప్రతిసారీ కొత్తదనం కనిపిస్తుంది. కారణం రామాయణానికున్న రమ్యత. అలాంటి రామాయణ గాథను కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ‘శ్రీమద్రామాయణ కల్పవృక్షం’గా కొన్ని తరాలవారు చదువుకుని ఆనందించేంతటి అద్భుతమైన రచన చేశారు. ఆ ‘జ్ఞానపీఠం’ బాటలోనే నడుస్తున్నారు ఆయన సోదరుని కుమారుడు విశ్వనాథ శోభనాద్రి. దాదాపు రెండు దశాబ్దాలుగా ‘నమామి వేదమాతరం’ అనే మాసపత్రికకు సంపాదకులుగా వ్యవహరిస్తూ, ఆ అనుభవంతో రామాయణ గాథలను, అందలి రమణీయమైన ఘట్టాలను సులభ శైలిలో సామాన్య పాఠకులకు కూడా అర్థమయ్యే విధంగా చక్కటి కథలుగా మలిచి ‘కల్పవృక్షము వాల్మీకి రామాయణ కథలు’ అనే పుస్తకరూపంలో అందించారు విశ్వనాథ. అందమైన హార్డ్‌బౌండ్ ముద్రణలో, ఆకట్టుకునే చిత్రాలతో 180 కథలున్న ఈ ఉద్గ్రంథం ఎంతో బాగుందని ముందుమాటలో ఎందరో పెద్దలు, ప్రముఖులు, సాహితీవేత్తలు పేర్కొన్నారు. చెరుకు తీపి గురించి వినడం కన్నా, రుచి చూస్తే కానీ తెలియనట్టే, ఈ గ్రంథాన్ని స్వయంగా చదువుకుంటే కానీ, ఆస్వాదించలేం. పెద్దలు పిల్లలకు కథలుగా చెప్పుకోవడానికి, బహుమతిగా ఇచ్చుకోవడానికి ఉపకరించే ఈ పుస్తకం పారాయణకూ పనికొస్తుంది. కల్పవృక్షము వాల్మీకి రామాయణ కథలు రచన: విశ్వనాథ శోభనాద్రి; పుటలు: 330; వెల రూ. 600 ప్రతులకు: విశ్వనాథ శోభనాద్రి చారిటబుల్ ట్రస్ట్ 16–2–836/బి/3, ఎల్.ఐ.సి కాలనీ, సైదాబాద్, హైదరాబాద్–59, ఫోన్:9440666669 – డి.వి.ఆర్ -
రామాయణ మహామాలా రత్నం!
అతులిత బలధాముడూ, జ్ఞానులలో ఆగ్రగణ్యుడూ, సకల సద్గుణవంతుడూ, రఘుపతి ప్రియభక్తుడూ హనుమంతుడు. రామాయణ కథలో ఆయన నిర్వహించిన ఘనకార్యాల సింహావలోకనం కంటే, హనుమజ్జయంతినాడు ఆనందదాయకమైన కర్తవ్యం ఏముంటుంది? కిష్కింధకాండలో రామలక్ష్మణులను దూరం నించి చూసి వాళ్లు వాలి మనుషులేమోనని సుగ్రీవుడు వణికిపోతుంటే, ‘సురక్షిత ప్రదేశంలో ఉన్నా, నువ్వు నీ శాఖా మృగ లక్షణం వల్ల అనవసరంగా భయపడుతున్నావు. రాజు అనే వాడు బుద్ధిని ఉపయోగించి ప్రవర్తించాలి!’ అని తన రాజుకు నిర్మొహమాటంగా, హితమైన సలహా ఇచ్చే మంత్రిగా హనుమంతుడు మొదటిసారి కనిపిస్తాడు. రాజాజ్ఞతో, రామలక్ష్మణులను సమీపించి, సన్యాసి వేషంలో వాళ్ల ముందు నిలబడి పలకరిస్తాడు. హనుమంతుడు నాలుగు మాటలు పలకగానే శ్రీరాముడు చకితుడౌతాడు. ‘ఈ దూత వాక్యజ్ఞుడు, మధురభాషి. సంస్కారవంతంగా, అసందిగ్ధంగా మనసును ఆకట్టుకొనేలా మాట్లాడే ఇలాంటి దూతగల రాజెవరో గానీ అదృష్టవంతుడు!’ అని మెచ్చుకుంటాడు. హనుమంతుడు రామలక్ష్మణులకు విశ్వాసం కలిగించి, వారిని తన భుజం మీద ఎక్కించుకు వెళ్లి, రామ సుగ్రీవులకు మైత్రి కుదురుస్తాడు. తరువాత వాలి మరణానంతరం, దుఃఖసాగరంలో మునిగిన తారను ఊరడించేది కూడా హనుమంతుడే. ఆ తరువాత, రాజ్యం చేకూరి భార్యలతో సుఖిస్తూ కర్తవ్యాన్నీ, కాలాన్నీ మరచిపోయిన సుగ్రీవుడిని సరైన సమయంలో హనుమంతుడే హెచ్చరించి మేలుకొలుపుతాడు. రాముడు రావణుడితో యుద్ధానికి ప్రణాళిక తయారు చేసేటప్పుడు లంకా నగరం రక్షణవ్యవస్థ గురించీ, గుట్టుమట్ల గురించి ఆయనకు వివరించగలవాడు హనుమంతుడొక్కడే. ‘రామా! ఎలాగోలా వానరసేన సముద్రం దాటే ఏర్పాటు ఒక్కటి చెయ్యగలిగావంటే నీ విజయం తథ్యం’! అని కిటుకు చెప్తాడు. ఇంద్రజిత్తుతో యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు, హనుమంతుడు హుటాహుటిన హిమాలయాలకు వెళ్లి సంజీవని పర్వతాన్నే పెళ్లగించి తెచ్చి ప్రాణరక్షణ చేయటం, మొదటిసారి సముద్ర లంఘనం కంటే బృహత్కార్యం. రామపట్టాభిషేక సమయంలో సీత తన కంఠహారాన్ని తీసి దాన్ని ఎవరికి బహూకరించటమా అని సందేహిస్తుంటే, ‘ఓ భామినీ! ఈ వీరులందరిలో పౌరుషమూ, పరాక్రమమూ, బుద్ధి బలాలలో సర్వవిధాలా అధికుడైన వాడు అని నువ్వు భావించిన వాడికి హారం కానుకగా ఇవ్వమని’ రాముడు సూచిస్తాడు. సీత హారాన్ని హనుమంతుడికి బహూకరిస్తుంది. గోష్పదీకృత వారాశిం, మశకీ కృత రాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే-(అ)నిలాత్మజం! (మహాసముద్రాన్ని గోవు అడుగుజాడను దాటినంత తేలికగా దాటినవాడూ, రాక్షస యోధులను దోమలను చంపినంత తేలికగా జయించినవాడూ, రామాయణ కథ అనే మాలలో మణిలా ప్రకాశించేవాడూ అయిన హనుమంతుడికి ప్రణామాలు.) -ఎం. మారుతి శాస్త్రి