రంజాన్ రోజు షీర్ కుర్మా చేయడానికి రీజన్ ఏంటో తెలుసా..!
ఓ అల్లాహ్ మేము 30దినాలు పాటించిన రమజాన్ రోజాలు, నమాజులు, సహరీ, ఇఫ్తార్లు ఇవన్నీ నీవు పెట్టిన భిక్షయే అల్లాహ్ అని ఆనంద భాష్పాలు రాల్చే శుభఘడియే ఈ ఈదుల్ ఫిత్ర్ పండుగ. ఈ పండుగను ప్రతీ ముస్లిమ్ కుటుంబం తమకున్నదాంట్లో గొప్పగా జరుపుకుంటుంది. అలాగే ఒకరికొకరు ఈద్ ముబారక్ అని చెప్పుకుంటూ ఆలింగనం చేసుకుని ప్రేమను చాటుకుంటారు. ఆ తర్వాత రకరకాల వంటకాలను చేసుకుని బంధుమిత్రులతో కలిసి ఆరగించి సంతోషంగా గడుపుతారు. ఈ రోజు స్పెషల్గా చేసేది షీర్ ఖుర్మా. ఈ రంజాన్ రోజు వివిధ రెసిపీలు ఎన్ని ఉన్నా.. ఈ షీర్ ఖుర్మా రెసిపీ మాత్రం తప్పనిసరిగా ఉండాల్సిందే. అసలు ఈ రోజు ఎందుకు దీన్ని చేస్తార?. రీజన్ ఏంటంటే..?
పవిత్ర మాసంలో ఆనందంగా చేసుకునే డెజర్ట్, రంజాన్ స్పెషల్ షీర్ ఖుర్మా ఎప్పటి నుంచి పండులో భాగమైంది?. ఇది ఎందుకు చేస్తారు అంటే. ఈ షీర్ కుర్మా ఐక్యత ఆధ్యాత్మిక సమృద్ధికి గుర్తుగా ఈ తీపి వంటకాన్ని ప్రతి ముస్లీ కుటుంబం తయారు చేయడం జరుగుతుంది. ఈ పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసం, ప్రార్థనలు అనంతరం ఇఫ్తార్ విందులో వివిధ మాంసాహార రెసిపీలు ఉన్నప్పటికీ.. ఈ షీర్ కుర్మాదే అగ్రస్థానాంలో ఉంటుంది. ప్రతి ఒక్క ముస్లీం కుటుంబంలో తమకున్నంతలో ఈ షీర్ కుర్మాను తప్పనిసరిగా చేస్తారు. ఇన్నీ రెసిపీలు ఉన్నా ఈ షీర్ కుర్మాకే ఎందుకంత ప్రాధాన్యత వచ్చిదంటే..
షీర్ కుర్మా చరిత్ర..
ఈ షీర్ కుర్మా రెసిపీ వంటకం పర్షియన్ సామ్రాజ్యం నుంచి మన వంటకాల్లో భాగమయ్యింది. ఇక్కడ షీర్ అంటే పాలు, ఖుర్మా అంటే పర్షియన్ భాషలో ఖర్జూరం. రంజాన్ మాసంలో ఖర్జూరాలు అత్యంత ప్రధానమైనవి. ఎందుకంటే..ఈదుల్ ఫిత్ర్ పర్వదినంనాడు ముహమ్మద్ ప్రవక్త (స) కొన్ని ఖర్జూరపు పండ్లు తిని నమాజుకోసం ఈద్గాహ్కు వెళ్లేవారు. అంతేగాదు ఇది కేవలం రంజాన్ కోసం తయారు చేసే వంటకమే కాదట..ఆ రోజు తీసుకున్నా స్పైసీ ఫుడ్ల నుంచి కాస్త ఉపశమనం కోసం చివరిగా ఈ తీపి వంటకాన్ని అందించేవారు.
ఆ తర్వాత క్రమేణ ఇది లేకుండా రంజాన్ మెనూ ఉండనంతగా ఈ రెసిపీకి ప్రజాధరణ వచ్చింది. బ్రిటీష్ పాలన కంటే ముందే మన దేశంలో షీర్ కుర్మా చేసేవారట. ఉత్తర భారతదేశంలో 'సెవియన్' అని పిలిచే వెర్మిసెల్లికి భిన్నమైన రెసిపీ వంటకం ఈ షీర్ కుర్మా. మరో కథనం ప్రకారం అరబ్బులు వాణిజ్యం చేసే నిమిత్తం మన దేశంలోకి రావడం వల్ల ఈ రెసిపీని ఇక్కడకు వచ్చి ఉండొచ్చని చెబుతున్నారు. దీని తయారీ కూడా ప్రాంతాల వారీగా చేసే విధానం కూడా మారుతుంటదని చెబుతున్నారు. మాములుగా వెర్మిసెల్లి, పాలు, ఖర్జురాలతో తయారు చేసుకునేవారు. కాలానుగుణంగా అన్ని అందుబాటులోకి రావడంతో ఇప్పుడు ప్రజల అభిరుచులకు అనుగుణంగా పిస్తా, బాదం, లవంగాలు, కుంకుమపువ్వు, రోజ్వాటర్ వంటి పదార్థాలతో తయారు చేయడం ప్రారంభించారు.
ఎక్కడ ఫేమస్ అంటే..
ఈ షీర్ ఖుర్మా ముఖ్యంగా హైదరాబాద్ ,లక్నో వంటి నగరాల్లో ప్రసిద్ధి చెందింది. ఈ నగరాల్లో క్రీమీ, రిచ్ డెజర్ట్లతో నెమ్మదిగా ఉడికించి, ఎండిన ఖర్జూరం, కొబ్బరి, బాదం, జీడిపప్పు మరియు పిస్తాతో అలంకరించి నోరూరించేలా అట్రెక్టివ్గా తయారు చేస్తారు. దీన్ని వేడిగా లేదా చల్లగా సర్వ్ చేస్తారు. ఖర్జూరాలు ఇక్కడ చక్కెర బదులుగా తీపిని అందించి షీర్కుర్మాకు ఒక విధమైన రుచిని అందిస్తాయి. అంతేగాదు ఈద్-ఉల్-ఫితర్లో షీర్ ఖుర్మాను సంతోషకరమైన ట్రీట్గా భావిస్తారు ముస్లీంలు.
ఆరోగ్య ప్రయోజనాలు..
ఇందులో ఉపయోగించే పాలు, నెయ్యి, ఖర్జురాల్లో ఎన్నో పోషకాలు, విటమిన్లు ఉంటాయి. ఇక పాలల్లో కాల్షియం ఉంటుంది. ఇవన్నీ ఈ నెల రోజుల పాటు ఉపవాసాలతో శుష్కించిన శరీరాన్ని ఉపశమనంలా ఉంటుంది ఈ రెసిపీ. ఉపవాశం కారణంలో పొట్టలో వచ్చే, ఎసిడిటీల నుంచి ఈ తీపి వంటకం కాపాడుతుంది. సమ్మర్లో శరీరానికి చలువ చేస్తుంది. వడదెబ్బ నుంచి రక్షిస్తుంది కూడా. మన సంప్రదాయాలకు అనుగుణంగా చేసే ఇలాంటి వంటకాలు ఆరోగ్యప్రదంగానూ సంతోషన్ని పంచేవిగానూ ఉంటాయి కదూ..!
(చదవండి: Eid al Fitr 2024: ఓ అల్లాహ్ ..ఇదంతా నీవు పెట్టిన భిక్ష! కృతజ్ఞతలు తెలిపే శుభసయం..!)