సీఐఐ దక్షిణ ప్రాంత చైర్మన్ గా రమేష్ దాట్ల
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సీఐఐ దక్షిణ ప్రాంత చైర్మన్‌గా 2016-17 సంవత్సరానికిగాను ఎలికో లిమిటెడ్ సీఎండీ రమేష్ దాట్ల ఎన్నికయ్యారు. 2015-16 కాలానికి సీఐఐ దక్షిణ ప్రాంత డిప్యూటీ చైర్మన్‌గా ఉన్నారు. సీఐఐ చేపడుతున్న కార్యక్రమాల్లో జాతీయ స్థాయిలో ఆయనది కీలక పాత్ర. ఎంట్రప్రెన్యూర్షిప్, టెక్నాలజీ, ఐపీఆర్, ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ విభాగాల్లో జాతీయ స్థాయిలో ముఖ్య భూమిక పోషించారు. సీఐఐ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ జాతీయ కమిటీకి, అలాగే ఎంఎస్ఎంఈ జాతీయ కమిటీకి చైర్మన్‌గానూ పనిచేశారు. 2004-05 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ చైర్మన్‌గా వ్యవహరించారు.
యూఎస్ఏలోని విచితా స్టేట్ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పుచ్చుకున్నారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి ఎలక్ట్రానిక్ డిజైన్ టెక్నాలజీలో పీజీ పూర్తి చేశారు. ఇక సీఐఐ దక్షిణ ప్రాంత డిప్యూటీ చైర్మన్‌గా టయోటా కిర్లోస్కర్ మోటార్ వైస్ చైర్మన్ విక్రమ్ కిర్లోస్కర్ నియమితులయ్యారు. సీఐఐ జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా 2012 నుంచి ఆయన కొనసాగుతున్నారు. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) ప్రెసిడెంట్‌గానూ పనిచేశారు.