ramlal
-
అయోధ్య: నేటి నుంచి మరో 20 మంది పూజారుల సేవలు
అయోధ్య: రామనగరి ఆయోధ్యలో నేటి నుంచి (జూలై 1) మరో 20 మంది పూజారులు సేవా విధుల్లో చేరారు. వీరికి బాధ్యతలు అప్పగించే ముందు వివిధ పూజలకు సంబంధించిన శిక్షణ అందించారు. ఇకపై వీరు ఇప్పటికే నియమితులైన పూజారులతో పాటు పూజాదికాలు నిర్వహించనున్నారు. నూతనంగా చేరిన పూజారులకు డ్రెస్ కోడ్ కూడా జారీ చేశారు. రామాలయంలో విధులు నిర్వహిస్తున్న ఇతర సిబ్బందికి కూడా త్వరలోన్ డ్రెస్ కోడ్ జారీ చేయనున్నారు.ఈ సందర్భంగా సహాయక పూజార్ అశోక్ మాట్లాడుతూ 20 మంది పూజారులకు ఆరు నెలల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చారని తెలిపారు. అరంతరం నియామక పత్రాలు అందజేశారన్నారు. ఒక్కో ఉన్నతస్థాయి పూజారి దగ్గర కొత్తగా నియమితులైన ఐదుగురు పూజారులు విధులు నిర్వహించనున్నారన్నారు. పూజారులెవరూ ఆండ్రాయిడ్ ఫోన్లను ఆలయంలోనికి తీసుకురాకూడదనే నిబంధన విధించారన్నారు.రామాలయంలో విధులు నిర్వహిస్తున్న ప్రకాశ్ గుప్తా మాట్లాడుతూ కొత్త పూజారులకు శిక్షణ పూర్తయ్యిందని, వీరంతా ఇకపై ఆలయంలో జరిగే పూజాదికాలలో పాల్గొంటారని తెలిపారు. ఆలయ ప్రాంగణంలో మరికొన్ని ఆలయాలు నిర్మితం కానున్నాయని, వాటిలో కూడా పూజారుల అవసరం ఉంటుందని అన్నారు. ఆలయ పూజారులకు ప్రత్యేక డ్రెస్ కోడ్ ఇవ్వడం ద్వారా భక్తులు వారిని సులభంగా గుర్తు పట్టగలుగుతారన్నారు. -
విదేశీ గడ్డపై వెలిగిన ఖ్యాతి.. న్యూయార్క్ వీధికి రామ్‌లాల్ పేరు
మన ఖ్యాతి మరోసారి విదేశీ గడ్డపై వెలిగింది. న్యూయార్క్‌లో ఓ వీధికి భారత మూలాలున్న వ్యక్తి పేరును పెట్టారు. ప్రముఖ మత గురువు, భాషా పండితుడు ‘ధర్మాచార్య’ పండిట్ రామ్‌లాల్ పేరుతో ఓ వీధికి నామకరణం చేయగా, క్వీన్స్ రిచ్మండ్ హిల్‌లో అధికారిక వేడుక నిర్వహించారు. గుయానా స్కెల్డాన్లో భారత మూలాలు ఉన్న కుటుంబంలో పుట్టి పెరిగారు రామ్‌లాల్. ఆయన అక్కడ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. 1979లో అమెరికా బ్రూక్లిన్కు వెళ్లి అక్కడో ఆస్పత్రిలో పని చేశారు. ఇండో-కరేబియన్ కమ్యూనిటీ లీడర్లలో ఒకరిగా ఎదిగారు. ఆర్య సమాజం తరపున పనిచేశారు. ముఖ్యంగా హిందీ భాషాభివృద్ధికి ఎంతో కృషి చేశారు. గుయానాలో ఉన్నప్పుడు టాగూర్ మెమొరియల్ స్కూల్లో భారతీయ విద్యార్థులకు హిందీ బోధించేవారాయన. 2019లో 90 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూశారు. లిబర్టీ అవెన్యూ, 133వ వీధికి రామ్‌లాల్ పేరు పెట్టాలని ఇండో-కరేబియన్స్ నుంచి ప్రతిపాదనలు రాగా, జూన్ 27న న్యూయార్క్ మేయర్ బిల్ డె బ్లాసియో సంతకం చేశారు. దీంతో వీధికి రామ్లాల్గా నామకరణం పూర్తికాగా, అట్టహాసంగా జరిగిన ప్రారంభ వేడుకలో న్యూయార్క్ సిటీ కౌన్సిల్ అడ్రిన్నె అడమ్స్ పాల్గొన్నారు. ఇంతకు ముందు న్యూయార్క్‌లో రమేశ్ కాళిచరణ్ వే, జోనాథన్ నారాయిన్ వే, పంజాబ్ అవే, గురుద్వారా వే, లిటిల్ గుయానా అవెన్యూలుగా కొన్ని వీధులకు పేర్లు పెట్టారు. -
బీజేపీదే విజయం
సాక్షి, హైదరాబాద్: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని, నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని కావడం ఖాయమని బీజేపీ జాతీయ సంఘటన ప్రధాన కార్యదర్శి రామ్‌లాల్ ధీమా వ్యక్తం చేశారు. మేరా పరివార్ భాజపా పరివార్ (మా కుటుంబం – బీజేపీ కుటుంబం) కార్యక్రమాన్ని పురస్కరించుకొని బీజేపీ రాష్ట్ర కార్యాల యంపై బీజేపీ జెండాను రామ్‌లాల్ ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికలు ప్రాంతీయ ఎన్నికలు కావని, ప్రాంతీయ నాయకులు ప్రధానమంత్రి కాలేరని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశ ప్రధాని ఎవరు అనే అంశంపైనే ఎన్నికలు జరుగబోతున్నాయన్నారు. అన్ని సర్వేలు కూడా మోదీనే ఘన విజయం సాధిస్తారని తెలియజేస్తున్నాయన్నారు. ప్రధాని మోదీ ఐదేళ్ల పనితీరుపై ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను దేశవ్యాప్తంగా చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారన్నారు. కార్మికులు, కర్షకులు, మహిళలు, చేతివృత్తుల వారి సంక్షేమానికి మోదీ ప్రభుత్వం పెద్దపీట వేసిందని, దేశాన్ని ప్రపంచంలో అందరూ గర్వించే స్థాయికి తీసుకెళ్లిన ఘనత మోదీదేనన్నారు. ఆ నాయకులకు భయం పట్టుకుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివృద్ధి పనులతో కొన్ని పార్టీలకు, కొంతమంది నాయకులకు భయం పట్టుకుందని, అందుకే ఆయనని, బీజేపీని దూషిస్తున్నారని రామ్‌లాల్ విమర్శించారు. దూషించేవారెవరూ ఎన్నికల్లో ఇంతకుముందు గెలవలేదని, ఇప్పుడూ వారికి ఓటమి తప్పదన్నారు. 55 ఏళ్ల కాంగ్రెస్ పాలన, ఐదేళ్ల బీజేపీ పాలన చూసిన వారికి తేడా అర్థం అవుతోందని వ్యాఖ్యానించారు. మోదీ అభివృద్ధి దేశంలో ఎక్కడికి వెళ్లినా కనిపిస్తుందన్నారు. ఈనెల 28న నరేంద్ర మోదీ టెలీకాన్ఫరెన్స్ ద్వారా బీజేపీ కార్యకర్తలతో మాట్లాడతారని తెలిపారు. మార్చి 2న దేశ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లు ఇంద్రసేనారెడ్డి, పేరాల శేఖరరావు, ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు, నేతలు కిషన్‌రెడ్డి, చింతా సాంబమూర్తి, ఆచారి, ప్రేమేందర్‌డ్డి, మనోహర్ రెడ్డి, మంత్రి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మోదీని మళ్లీ ప్రధాని చేయాలి: లక్ష్మణ్ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏను తిరిగి అధికారంలోకి తీసుకురావాలని, నరేంద్రమోదీని మరోసారి ప్రధాని చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దేశాన్ని శక్తివంతమైన దేశంగా చేసేందుకు, నవ భారత్ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ విశేషంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం ప్రతీ కార్యకర్త కృషి చేయాలని కోరారు. అధిష్టానం పిలుపు మేరకు మేరా పరివార్–బీజేపీ పరివార్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం లక్ష్మణ్ హైదరాబాద్‌లోని తన నివాసంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..పార్టీలో వివిధ బాధ్యతలు నిర్వహిస్తున్న వారు ఈనెల 15 వరకు, పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులు ఈనెల 25 వరకు తమ నివాసాలపై పార్టీ జెండాను ఎగురవేయాలని కోరారు. -
పార్టీ అంటే వారిద్దరే!
న్యూఢిల్లీ: ఆదివారం ఉదయం జరుగనున్న కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ కోసం దాదాపు పది మంది మంత్రులు తమ రాజీనామా పత్రాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లేదా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలకు కాకుండా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) రామ్‌లాల్‌కు అందజేశారు. రామ్‌లాల్ నిర్వహిస్తున్నది ఏమీ ఆషామాషి పదవి కాదు. మాతసంస్థ ఆరెస్సెస్‌కు, బీజేపీకి మధ్య వారధిగా ఉండే పదవిలో ఆయన కొనసాగుతున్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక ఈ పదవికి మరింత గ్లామర్ పెరిగింది. అందుకనే పార్టీ అధిష్టానం మంత్రుల రాజీనామా లేఖలను రామ్‌లాల్‌కు ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. కాగా ఈ రోజు కేంద్ర కేబినెట్ సీనియర్ నేత కల్రాజ్ మిశ్రా రాజీనామ చేశారు. నరేంద్ర మోదీ, అమిత్‌షా లాంటి వ్యక్తులకన్నా పార్టీయే సర్వోన్నతమైనదని చెప్పడానికీ, చూపడానికి పార్టీలో ఈ ఏర్పాటు ఎప్పటి నుంచో ఉందని, అయితే ఇప్పుడు పార్టీలో పూర్తిగా వారిద్దరి పెత్తనమే కొనసాగుతోందని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని పార్టీ సీనియర్ నాయకుడొకరు మీడియా ముందు వ్యాఖ్యానించారు. ఆదివారం ఉదయం జరుగున్న కేబినెట్ విస్తరణలో కూడా పూర్తి అధికారం, ప్రాబల్యం కూడా వారిదేనని ఆయన వ్యాఖ్యానించారు. ఆరెస్సెస్‌తో అతి సన్నిహితంగా ఉంటున్నామని చెప్పుకుంటూనే ఇద్దరు నేతలు పూర్తి వ్యక్తిగతంగా వ్యవహరిస్తున్నారని మరో పార్టీ సీనియర్ నేత వాపోయారు. వాస్తవానికి కేంద్ర కేబినెట్ విస్తరణ శనివారం నాడు జరగాల్సి ఉందని, అయితే యూపీలోని బందావన్లో జరుగుతున్న ఆరెస్సెస్ సమావేశానికి అమిత్ షా వెళ్లాల్సి ఉండడంతో ఒక రోజు వాయిదా పడిందని ఆయన తెలిపారు. గతంలో పార్టీలో అన్ని ప్రధాన అంశాలపై సంస్థాగత చర్చలు జరిగేవని, ఇప్పుడు అవేమి లేకుండా పోయాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మొన్న అమిత్ షా నివాసంలో జరిగిన సమావేశంలో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం బెడిసికొట్టిందని, దానివల్ల ప్రభుత్వం ప్రతిష్ట ప్రజల్లో దెబ్బతిన్నదన్న విషయాన్ని పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు ప్రస్తావించినందుకు అమిత్ షా అంతులేని ఆగ్రహం వ్యక్తం చేశారని వారన్నారు.