బీజేపీదే విజయం | The BJP is a huge success in the parliamentary elections | Sakshi
Sakshi News home page

బీజేపీదే విజయం

Published Wed, Feb 13 2019 2:38 AM | Last Updated on Fri, Mar 29 2019 9:04 PM

The BJP is a huge success in the parliamentary elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని, నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని కావడం ఖాయమని బీజేపీ జాతీయ సంఘటన ప్రధాన కార్యదర్శి రామ్‌లాల్‌ ధీమా వ్యక్తం చేశారు. మేరా పరివార్‌ భాజపా పరివార్‌ (మా కుటుంబం – బీజేపీ కుటుంబం) కార్యక్రమాన్ని పురస్కరించుకొని బీజేపీ రాష్ట్ర కార్యాల యంపై బీజేపీ జెండాను రామ్‌లాల్‌ ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికలు ప్రాంతీయ ఎన్నికలు కావని, ప్రాంతీయ నాయకులు ప్రధానమంత్రి కాలేరని పేర్కొన్నారు.

ప్రస్తుతం దేశ ప్రధాని ఎవరు అనే అంశంపైనే ఎన్నికలు జరుగబోతున్నాయన్నారు. అన్ని సర్వేలు కూడా మోదీనే ఘన విజయం సాధిస్తారని తెలియజేస్తున్నాయన్నారు. ప్రధాని మోదీ ఐదేళ్ల పనితీరుపై ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను దేశవ్యాప్తంగా చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారన్నారు. కార్మికులు, కర్షకులు, మహిళలు, చేతివృత్తుల వారి సంక్షేమానికి మోదీ ప్రభుత్వం పెద్దపీట వేసిందని, దేశాన్ని ప్రపంచంలో అందరూ గర్వించే స్థాయికి తీసుకెళ్లిన ఘనత మోదీదేనన్నారు. 

ఆ నాయకులకు భయం పట్టుకుంది
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివృద్ధి పనులతో కొన్ని పార్టీలకు, కొంతమంది నాయకులకు భయం పట్టుకుందని, అందుకే ఆయనని, బీజేపీని దూషిస్తున్నారని రామ్‌లాల్‌ విమర్శించారు. దూషించేవారెవరూ ఎన్నికల్లో ఇంతకుముందు గెలవలేదని, ఇప్పుడూ వారికి ఓటమి తప్పదన్నారు. 55 ఏళ్ల కాంగ్రెస్‌ పాలన, ఐదేళ్ల బీజేపీ పాలన చూసిన వారికి తేడా అర్థం అవుతోందని వ్యాఖ్యానించారు. మోదీ అభివృద్ధి దేశంలో ఎక్కడికి వెళ్లినా కనిపిస్తుందన్నారు.

ఈనెల 28న నరేంద్ర మోదీ టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా బీజేపీ కార్యకర్తలతో మాట్లాడతారని తెలిపారు. మార్చి 2న దేశ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో బైక్‌ ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లు ఇంద్రసేనారెడ్డి, పేరాల శేఖరరావు, ఎమ్మెల్సీ ఎన్‌.రామచంద్రరావు, నేతలు కిషన్‌రెడ్డి, చింతా సాంబమూర్తి, ఆచారి, ప్రేమేందర్‌డ్డి, మనోహర్‌ రెడ్డి, మంత్రి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

మోదీని మళ్లీ ప్రధాని చేయాలి: లక్ష్మణ్‌ 
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏను తిరిగి అధికారంలోకి తీసుకురావాలని, నరేంద్రమోదీని మరోసారి ప్రధాని చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దేశాన్ని శక్తివంతమైన దేశంగా చేసేందుకు, నవ భారత్‌ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ విశేషంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం ప్రతీ కార్యకర్త కృషి చేయాలని కోరారు. అధిష్టానం పిలుపు మేరకు మేరా పరివార్‌–బీజేపీ పరివార్‌ కార్యక్రమంలో భాగంగా మంగళవారం లక్ష్మణ్‌ హైదరాబాద్‌లోని తన నివాసంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..పార్టీలో వివిధ బాధ్యతలు నిర్వహిస్తున్న వారు ఈనెల 15 వరకు, పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులు ఈనెల 25 వరకు తమ నివాసాలపై పార్టీ జెండాను ఎగురవేయాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement