పార్టీ అంటే వారిద్దరే!
పార్టీ అంటే వారిద్దరే!
Published Sat, Sep 2 2017 3:31 PM | Last Updated on Wed, Aug 15 2018 6:22 PM
న్యూఢిల్లీ: ఆదివారం ఉదయం జరుగనున్న కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ కోసం దాదాపు పది మంది మంత్రులు తమ రాజీనామా పత్రాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లేదా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలకు కాకుండా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) రామ్‌లాల్‌కు అందజేశారు. రామ్‌లాల్ నిర్వహిస్తున్నది ఏమీ ఆషామాషి పదవి కాదు. మాతసంస్థ ఆరెస్సెస్‌కు, బీజేపీకి మధ్య వారధిగా ఉండే పదవిలో ఆయన కొనసాగుతున్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక ఈ పదవికి మరింత గ్లామర్ పెరిగింది. అందుకనే పార్టీ అధిష్టానం మంత్రుల రాజీనామా లేఖలను రామ్‌లాల్‌కు ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. కాగా ఈ రోజు కేంద్ర కేబినెట్ సీనియర్ నేత కల్‌రాజ్ మిశ్రా రాజీనామ చేశారు.
నరేంద్ర మోదీ, అమిత్‌షా లాంటి వ్యక్తులకన్నా పార్టీయే సర్వోన్నతమైనదని చెప్పడానికీ, చూపడానికి పార్టీలో ఈ ఏర్పాటు ఎప్పటి నుంచో ఉందని, అయితే ఇప్పుడు పార్టీలో పూర్తిగా వారిద్దరి పెత్తనమే కొనసాగుతోందని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని పార్టీ సీనియర్ నాయకుడొకరు మీడియా ముందు వ్యాఖ్యానించారు. ఆదివారం ఉదయం జరుగున్న కేబినెట్ విస్తరణలో కూడా పూర్తి అధికారం, ప్రాబల్యం కూడా వారిదేనని ఆయన వ్యాఖ్యానించారు. ఆరెస్సెస్‌తో అతి సన్నిహితంగా ఉంటున్నామని చెప్పుకుంటూనే ఇద్దరు నేతలు పూర్తి వ్యక్తిగతంగా వ్యవహరిస్తున్నారని మరో పార్టీ సీనియర్ నేత వాపోయారు. వాస్తవానికి కేంద్ర కేబినెట్ విస్తరణ శనివారం నాడు జరగాల్సి ఉందని, అయితే యూపీలోని బందావన్‌లో జరుగుతున్న ఆరెస్సెస్ సమావేశానికి అమిత్ షా వెళ్లాల్సి ఉండడంతో ఒక రోజు వాయిదా పడిందని ఆయన తెలిపారు.
గతంలో పార్టీలో అన్ని ప్రధాన అంశాలపై సంస్థాగత చర్చలు జరిగేవని, ఇప్పుడు అవేమి లేకుండా పోయాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మొన్న అమిత్ షా నివాసంలో జరిగిన సమావేశంలో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం బెడిసికొట్టిందని, దానివల్ల ప్రభుత్వం ప్రతిష్ట ప్రజల్లో దెబ్బతిన్నదన్న విషయాన్ని పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు ప్రస్తావించినందుకు అమిత్ షా అంతులేని ఆగ్రహం వ్యక్తం చేశారని వారన్నారు.
Advertisement
Advertisement