Ranavirsing
-
బెడ్ రెస్ట్!
బాలీవుడ్ హీరోగా కంటే... దీపికా పడుకొనే బాయ్‌ఫ్రెండ్‌గానే బాగా పాపులర్ అయిన రణవీర్‌సింగ్ మంచాన పడ్డాడు. సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కిస్తున్న ‘బాజీరావ్ మస్తానీ’ షూటింగ్లో గుర్రపు స్వారీ చేస్తూ జారి కిందపడటంతో కుడి చేతికి గాయమైంది. ముంబైలోని ఓ ఆసుపత్రిలో సర్జరీ చేయించుకున్న రణవీర్... ఆపరేషన్ థియేటర్ నుంచే ఓ సెల్ఫీ దిగి... అభిమానుల కోసం దాన్ని ట్విట్టర్లో అప్లోడ్ చేశాడు. నెల కిందటే జారి పడినా... రెగ్యులర్ ఫిజియోథెరపీ సరిపోతుందని మొదట భావించాడట. అయితే దాని వల్ల ఫలితం లేకపోవడంతో... చివరకు శస్త్రచికిత్సకు వెళ్లాల్సి వచ్చిందని సమాచారం. మూడు వారాల బెడ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు చెప్పారు. ఆ తరువాత తిరిగి షూటింగ్లో పాల్గొన్నా యాక్షన్ సీన్లకు దూరంగా ఉండాలని సూచించారట. -
అప్పట్లో నాకిన్ని తెలివితేటలు లేవు
‘‘అప్పుడు నా వయసు 18. ఏం చేయాలో తెలియదు. ఎవరి సహాయం తీసుకోవాలో అర్థం కాదు. మేనేజర్లు లేరు. గాడ్‌ఫాదర్ అస్సలే లేరు. తిరనాళ్లలో తప్పిపోయినట్టుగా అనిపించింది’’ అని ఇటీవల ఓ సందర్భంలో ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లి, సినిమాల్లోకి వచ్చినప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు ప్రియాంకా చోప్రా. హీరోయిన్ అయిన తర్వాత నాలుగేళ్లకు తనకు సినిమా పరిశ్రమ గురించి కొంచెం అర్థం అయ్యిందని తెలిపారామె. ప్రస్తుతం రణవీర్‌సింగ్, అర్జున్ కపూర్.. ఇలా తనకన్నా చిన్నవాళ్లతో సినిమాలు చేస్తున్నారు ప్రియాంక. ఆ విషయం గురించి మట్లాడుతూ -‘‘కొత్తగా సినిమాల్లోకొచ్చినవారిని చూస్తే ఆశ్చర్యం అనిపిస్తోంది. సినిమా పరిశ్రమ గురించి అవగాహన చేసుకోవడానికి నాకు నాలుగేళ్లు పడితే, వీళ్లకి నాలుగు సినిమాలకే అంతా అర్థమైపోతోంది. ఆ విషయంలో నాకన్నా వాళ్లే బెస్ట్. ఒక్క హిట్ వస్తే, చక్కగా పారితోషికం పెంచేస్తున్నారు. ఉపయోగపడే సినిమాలనే ఒప్పుకుంటున్నారు. కానీ, కెరీర్ ఆరంభించిన కొత్తలో నాకీ తెలివితేటలు ఉండేవి కాదు. చేయకూడని సినిమాలు కొన్ని చేశాను. అనుభవం పెరిగే కొద్దీ నా తెలివితేటలు కూడా పెరిగాయి. ఇప్పుడు నేను చాలా స్ట్రాంగ్ పర్సన్‌ని. ఒకప్పుడున్న భయాలు, సందేహాలు ఇప్పుడు లేవు. ఏ నిర్ణయాన్ని అయినా చాలా క్లారిటీగా తీసుకునే నేర్పు ఉంది’’ అని చెప్పారు. -
ఆల్ హ్యాపీస్.. నో వర్రీస్..!
గత ఏడాది దీపికా పదుకొనేకి తీపి గుర్తులనే మిగిల్చిందని చెప్పాలి. వరుసగా నాలుగు విజయవంతమైన చిత్రాల్లో నటించడంతో ఆమె మార్కెట్ బాగా పెరిగింది. వ్యక్తిగతంగా రణవీర్‌సింగ్‌తో ప్రేమాయణం సాగిస్తూ హ్యాపీగా ఉన్నారామె. ఇక, ఈ ఏడాది కూడా ఈ సొట్టబుగ్గల సుందరిదే హవా అని బాలీవుడ్‌వారు అంటున్నారు. ఆల్ హ్యాపీస్.. నో వర్రీస్ అన్న చందంగా దీపికా జీవితం సాగుతోంది. ఇప్పుడు ఆ ఆనందం రెట్టింపు కాబోతోంది. దానికి కారణం ఆమిర్‌ఖాన్. కథానాయిక అయిన ఈ ఏడేళ్లల్లో ఎంతోమంది స్టార్ హీరోస్ సరసన నటించిన దీపికాకి ఆమిర్‌ఖాన్, సల్మాన్‌ఖాన్, హృతిక్‌రోషన్ సరసన మాత్రం నటించే అవకాశం రాలేదు. ఇటీవల పలువురు బాలీవుడ్ ప్రముఖులకు తను ఇచ్చిన సక్సెస్ పార్టీలో కూడా దీపికా ఈ విషయం గురించే ప్రస్తావించారు. ఇది జరిగి నెల కూడా కాలేదు. ఈలోపు ఆమిర్ సరసన నటించే అవకాశం కొట్టేశారట. ఆమిర్ హీరోగా ఫర్హాన్ అక్తర్, రితేష్ సిద్వానీ సంయుక్తంగా నిర్మించనున్న ఓ చిత్రంలో దీపికాని కథానాయికగా ఎంపిక చేశారని సమాచారం. జూలై లేక ఆగస్ట్‌లో ఈ సినిమా షూటింగ్‌ని ప్రారంభించాలనుకుంటున్నారని వినికిడి. ప్రస్తుతం ఆమిర్, దీపికాతో సంప్రదింపులు జరుపుతున్నారట. అధికారికంగా సైన్ చేసిన తర్వాత దీపికా ఈ చిత్రం గురించి చెప్పాలనుకుంటున్నారు.