అప్పట్లో నాకిన్ని తెలివితేటలు లేవు
‘‘అప్పుడు నా వయసు 18. ఏం చేయాలో తెలియదు. ఎవరి సహాయం తీసుకోవాలో అర్థం కాదు. మేనేజర్లు లేరు. గాడ్‌ఫాదర్ అస్సలే లేరు. తిరనాళ్లలో తప్పిపోయినట్టుగా అనిపించింది’’ అని ఇటీవల ఓ సందర్భంలో ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లి, సినిమాల్లోకి వచ్చినప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు ప్రియాంకా చోప్రా.
హీరోయిన్ అయిన తర్వాత నాలుగేళ్లకు తనకు సినిమా పరిశ్రమ గురించి కొంచెం అర్థం అయ్యిందని తెలిపారామె. ప్రస్తుతం రణవీర్‌సింగ్, అర్జున్ కపూర్.. ఇలా తనకన్నా చిన్నవాళ్లతో సినిమాలు చేస్తున్నారు ప్రియాంక. ఆ విషయం గురించి మట్లాడుతూ -‘‘కొత్తగా సినిమాల్లోకొచ్చినవారిని చూస్తే ఆశ్చర్యం అనిపిస్తోంది. సినిమా పరిశ్రమ గురించి అవగాహన చేసుకోవడానికి నాకు నాలుగేళ్లు పడితే, వీళ్లకి నాలుగు సినిమాలకే అంతా అర్థమైపోతోంది. ఆ విషయంలో నాకన్నా వాళ్లే బెస్ట్. ఒక్క హిట్ వస్తే, చక్కగా పారితోషికం పెంచేస్తున్నారు. ఉపయోగపడే సినిమాలనే ఒప్పుకుంటున్నారు.
కానీ, కెరీర్ ఆరంభించిన కొత్తలో నాకీ తెలివితేటలు ఉండేవి కాదు. చేయకూడని సినిమాలు కొన్ని చేశాను. అనుభవం పెరిగే కొద్దీ నా తెలివితేటలు కూడా పెరిగాయి. ఇప్పుడు నేను చాలా స్ట్రాంగ్ పర్సన్‌ని. ఒకప్పుడున్న భయాలు, సందేహాలు ఇప్పుడు లేవు. ఏ నిర్ణయాన్ని అయినా చాలా క్లారిటీగా తీసుకునే నేర్పు ఉంది’’ అని చెప్పారు.