రెచ్చిపోయిన కర్ణాటక బౌలర్లు, 116 పరుగులకే కుప్పకూలిన ఉత్తరాఖండ్
Ranji Trophy 2022-23 3rd Quarter Final: రంజీ ట్రోఫీ 2022-23 సీజన్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు ఇవాళ (జనవరి 31) ప్రారంభమయ్యాయి. మూడో క్వార్టర్ ఫైనల్లో భాగంగా ఉత్తరాఖండ్-కర్ణాటక జట్లు తలపడుతున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కర్ణాటక టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. మురళీధర వెంకటేశ్ (5/36), విధ్వత్ కావేరప్ప (2/17), కృష్ణప్ప గౌతమ్ (2/22), విజయ్‌కుమార్ విశఖ్ (1/25) చెలరేగడంతో ఉత్తరాఖండ్ తొలి ఇన్నింగ్స్‌లో 116 పరుగులకే ఆలౌటైంది.
ఉత్తరాఖండ్ ఇన్నింగ్స్‌లో అవ్నీష్ సుధ (17), కునాల్ చండీలా (31), ఆదిత్య తారే (14), అఖిల్ రావత్ (14) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్ణాటక.. 6 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 12 పరుగులు చేసింది. రవికుమార్ సమర్థ్ (4), కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (8) క్రీజ్‌లో ఉన్నారు.
కాగా, ఇవాళే వివిధ వేదికలపై మరో మూడు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు కూడా మొదలయ్యాయి. కోల్‌కతా వేదికగా జరుగుతున్న తొలి క్వార్టర్ ఫైనల్లో బెంగాల్-జార్ఖండ్ జట్లు.. రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న రెండో క్వార్టర్ ఫైనల్లో సౌరాష్ట్ర-పంజాబ్ జట్లు.. ఇండోర్ వేదికగా జరుగుతున్న నాలుగో క్వార్టర్ ఫైనల్లో ఆంధ్ర-మధ్యప్రదేశ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌ల్లో విజేతలు ఫిబ్రవరి 8-12 వరకు జరిగే రెండు సెమీఫైనల్‌లలో అమీతుమీ తేల్చుకుంటాయి. సెమీస్‌లో విజేతలు ఫిబ్రవరి 16-20 వరకే జరిగే అంతిమ సమరంలో ఎదురెదురుపడతాయి.