Ranji trophy season
-
డబుల్ సెంచరీతో చెలరేగిన టీమిండియా యువ ఓపెనర్
భారత యువ ఆటగాడు పృథ్వీ షా సెలక్టర్లకు మరోసారి గట్టి సవాల్ విసిరాడు . జాతీయ జట్టులో చోటు కోల్పోయిన పృథ్వీ షా దేశవాళీ క్రికెట్లో మాత్రం అదరగొడుతున్నాడు. ప్రస్తుతం జరుగుగుతున్న రంజీ ట్రోఫీ సీజన్లో ముంబైకు ప్రాతినిథ్యం వహిస్తున్న పృథ్వీ షా అద్భుతమైన డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఆస్సాంతో జరుగుతున్న మ్యాచ్‌లో పృథ్వీ షా ద్విశతకం సాధించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 235 బంతుల్లోనే పృథ్వీ తన రెండో ఫస్ట్‌క్లాస్ డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ప్రస్తుతం 237 పరుగులతో పృథ్వీ బ్యాటింగ్ చేస్తున్నాడు. షా ఇన్నింగ్స్‌లో ఇప్పటి వరకు 33 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. అతడితో పాటు ముంబై కెప్టెన్ అజింక్యా రహానే 73 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో ముంబై భారీ స్కోర్ దిశగా అడుగులు వేస్తోంది. 89 ఓవర్లు ముగిసే సరికి ముంబై తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు కోల్పోయి 395 పరుగులు చేసింది. ఇక పృథ్వీ షా చివరసారిగా 2021లో భారత్ తరపున ఆడాడు. అదే విధంగా టెస్టుల్లో ఆఖరిగా 2020లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. అయితే స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్టు సిరీస్‌కు పృథ్వీ షా.. భారత సెలక్టర్ల దృష్టిలో పడే అవకాశం ఉంది. -
తండ్రి కట్టిన స్టేడియంలోనే తనయుడు సెంచరీ! శభాష్ అభిమన్యు
భారత జట్టులో చోటు కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న బెంగాల్ ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్ ప్రస్తుతం జరగుతున్న రంజీ ట్రోఫీలో అదరగొడుతున్నాడు. డెహ్రాడూన్ వేదికగా ఉత్తరాఖండ్‌తో మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఈశ్వరన్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, 1 సిక్స్‌లతో ఈశ్వరన్ 165 పరుగులు సాధించాడు. అతడితో పాటు టాప్ఆర్డర్ బ్యాటర్ సుదీప్ ఘరామి 90 పరుగులతో రాణించాడు. వీరిద్దరి అద్భుత ఇన్నింగ్స్‌ల ఫలితంగా బెంగాల్ తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఉత్తరాఖండ్ కూడా తొలి ఇన్నింగ్స్‌లో 272 పరుగులకు ఆలౌటైంది. తండ్రి కట్టిన స్టేడియంలోనే తనయుడు సెంచరీ అభిమాన్యు ఈశ్వరన్.. తన తండ్రి తన పేరిట నిర్మించిన గ్రౌండ్‌లోనే సెంచరీ సాధించడం విశేషం. అభిమన్యు తండ్రి రంగనాథన్ పరమేశ్వరన్ ఈశ్వరన్ డెహ్రాడూన్‌లో ఓ క్రికెట్ స్టేడియాన్ని నిర్మించాడు. దానికి అభిమన్యు క్రికెట్ అకాడమీగా పేరు పెట్టాడు. అయితే ఇప్పటివరకు చాలా రంజీ మ్యాచ్‌లు జరిగాయి. కానీ ఈ వేదికలో బెంగాల్ జట్టుకు ఇదే తొలి మ్యాచ్. కాగా అభిమాన్యు ఈశ్వరన్ స్వస్థలం డెహ్రాడూన్ అయినప్పటకీ దేశీవాళీ క్రికెట్లో మాత్రం బెంగాల్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో తొలి సారిగా తన తండ్రి నిర్మించిన స్టేడియంలో అభిమాన్యు ఈశ్వరన్ మ్యాచ్ ఆడాడు. అయితే ఆడిన తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించడంతో అభిమాన్యు తండ్రి ఆనందానికి అవధులు లేవు. అదే విధంగా తన పేరిట నిర్మించిన స్టేడియంలోనే మ్యాచ్‌లో ఆడిన తొలి క్రికెటర్‌గా ఈశ్వరన్ రికార్డులకెక్కాడు. -
ఆస్పత్రి బెడ్‌పై భారత ఆటగాడు.. ఆ టోర్నీ మొత్తానికి దూరం!
టీమిండియా పేసర్, రాజస్తాన్ స్టార్ బౌలర్ ఖలీల్ అహ్మద్ గాయం కారణంగా రంజీ ట్రోఫీ 2022-23 సీజన్ మొత్తానికి దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఖలీల్ అహ్మద్ ప్రస్తుతం మెకాలి గాయంతో బాధపడుతున్నాడు. తాజాగా తన గాయానికి సంబంధించిన అప్డేట్ను ఖలీల్ అహ్మద్ అభిమానులతో పంచుకున్పాడు. హాస్పిట్ల్ బెడ్ పై ఉన్న ఫోటోను షేర్ చేస్తూ... తన ఆరోగ్య పరిస్థితి కారణంగా రంజీ ట్రోఫీలో చాలా మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు అతడు తెలిపాడు. ఒక వేళ తను పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధిస్తే తిరిగి మళ్లీ జట్టులోకి చేరుతాని అని ఖలీల్ అన్నాడు. "క్రికెట్‌కు దూరంగా ఉండటం చాలా కష్టం. నా మెడికల్ కండీషన్ కారణంగా, నేను రాబోయే రంజీ సీజన్లో చాలా మ్యాచ్‌లకు దూరంగా ఉండనున్నాను. నేను ప్రస్తుతం కోలుకుంటున్నాను. నేను ఫిట్నెస్ సాధిస్తే తిరిగి మళ్లీ మైదానంలోఅడుగుపెడతాను. నేను కోలుకోవాలని కోరుకుంటున్న అభిమానులందరికీ ధన్యవాదాలు" అని ట్విటర్లో ఖలీల్ పేర్కొన్నాడు. కాగా ఖలీల్ దాదాపు రెండేళ్ల నుంచి మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. గతేడాది ఐపీఎల్లో కూడా గాయం కారణంగా అతడు కేవలం 7 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఇక ఈ ఏడాది ఐపీఎల్లో మాత్రం అతడు పూర్తి ఫిట్నెస్తో బరిలోకి దిగాడు. ఢిల్లీ క్యాపిటిల్స్కు ప్రాతినిథ్యం వహించిన ఖలీల్ అదరగొట్టాడు. ఐపీఎల్-2023లో 10 మ్యాచ్‌లు ఆడిన అతడు 16 వికెట్లు పడగొట్టాడు. ఇక ఇప్పటి వరకు 11 వన్డేలు, 14 టీ20ల్లో భారత జట్టుకు ఖలీల్ ప్రాతినిథ్యం వహించాడు. అతడు చివరసారిగా టీమిండియా తరపున చివరగా 2019లో బంగ్లాదేశ్‌పై టీ20 మ్యాచ్‌లో ఆడాడు. Dear all, it’s very hard to stay away from cricket, It's unfortunate, but due to my medical condition, I would be missing most of the matches of the upcoming Ranji season. I am on the road to recovery and will be back in the side once deemed fit. I am grateful for all the wishes pic.twitter.com/TA68ARmoPx — Khaleel Ahmed 🇮🇳 (@imK_Ahmed13) December 12, 2022 చదవండి: Ranji Trophy: రంజీ సమరానికి సై.. బరిలో 38 జట్లు! ఫైనల్ ఎప్పుడంటే! -
హైదరాబాద్ రెండో విజయం అందుకుంటుందా!
కటక్: రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టు వరుసగా రెండో విజయం సాధించేందుకు మరో 223 పరుగుల దూరంలో ఉంది. చేతిలో 7 వికెట్లు ఉన్నాయి. బెంగాల్‌తో జరుగుతున్న ఎలైట్ గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో 239 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్... మూడో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 13.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 16 పరుగులు చేసింది. కెప్టెన్ తన్మయ్ (0), అక్షత్ రెడ్డి (0) డకౌట్ కాగా, మికిల్ జైస్వాల్ (5) విఫలమయ్యాడు. తిలక్‌వర్మ (11 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 16/1తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన బెంగాల్ 205 పరుగులకు ఆలౌటైంది. హైదరాబాద్ బౌలర్లలో తిలక్ వర్మ (3/13), తనయ్ త్యాగరాజన్ (3/44) బెంగాల్ ఇన్నింగ్స్‌ను దెబ్బతీశారు. -
కీలక టోర్నీ నుంచి తప్పుకున్న హార్దిక్ పాండ్యా.. కారణం అదేనా?
త్వరలో జరగనున్న రంజీ ట్రోఫీ నుంచి బరోడా కెప్టెన్ హార్ధిక్ పాండ్యా తప్పుకున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌పై దృష్టిసారించి తిరిగి భారత జట్టులోకి వచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. పాండ్యా రంజీ ట్రోఫీలో ఆడతాడని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ టోర్నమెంట్లో హార్ధిక్ బౌలింగ్ కూడా చేస్తాడని గంగూలీ పేర్కొన్నాడు. పాండ్యా టోర్నీ నుంచి వైదొలగడంతో బరోడా జట్టుకు కేదార్ దేవ్‌ధర్ నాయకత్వం వహించనున్నాడు. ఇక కరోనా కారణంగా వాయిదా పడిన రంజీ ట్రోఫీ ఫిబ్రవరి 10 నుంచి ప్రారంభం కానుంది. కాగా ఐపిఎల్‌లో కొత్త జట్టుగా అవతరించిన అహ్మదాబాద్ ఫ్రాంచైజీ పాండ్యాను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. హార్ధిక్ పాండ్యాతో అహ్మదాబాద్ 15 కోట్లకు ఒప్పందం కుదుర్చకుంది. బరోడా జట్టు: కేదార్ దేవ్‌ధర్ (కెప్టెన్), విష్ణు సోలంకి, ప్రత్యూష్ కుమార్, శివాలిక్ శర్మ, కృనాల్ పాండ్యా, అభిమన్యుసింగ్ రాజ్‌పుత్, ధ్రువ్ పటేల్, మితేష్ పటేల్, లుక్మాన్ మేరీవాలా, బాబాసఫిఖాన్ పఠాన్ (వికెట్ కీపర్), అతిత్ షేత్, భార్గవ్ భట్, పార్త్ కోహ్లీ, శశ్వత్ రావత్, కార్తీక్ కకడే, గుర్జీందర్‌సింగ్ మన్, జ్యోత్స్నిల్ సింగ్, నినాద్ రథ్వా, అక్షయ్ మోర్. -
హైదరాబాద్, ఆంధ్ర మ్యాచ్ డ్రా
సాక్షి, హైదరాబాద్: రంజీ ట్రోఫీ సీజన్‌ను హైదరాబాద్, ఆంధ్ర జట్లు డ్రాతో ఆరంభించాయి. ఇరు జట్ల మధ్య ఇక్కడి రాజీవ్‌గాంధీ స్టేడియంలో జరిగిన గ్రూప్ ‘సి’ మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది. చివరి రోజు వేగంగా ఆడి లక్ష్యాన్ని నిర్దేశిస్తుందని భావించిన హైదరాబాద్ ఎలాంటి దూకుడు కనబర్చకుండా నెమ్మదిగా ఆడి టీ విరామానికి కొద్ది సేపు ముందు మాత్రమే డిక్లేర్ చేసింది. ఫలితంగా అందుబాటులో ఉన్న 34 ఓవర్లలో 288 పరుగుల టార్గెట్‌ను ముందుంచింది. ఆట ముగిసే సమయానికి ఆంధ్ర 19 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 51 పరుగులు చేసింది. కేఎస్ భరత్ (61 బంతుల్లో 30 నాటౌట్; 6 ఫోర్లు), డీబీ ప్రశాంత్ (53 బంతుల్లో 20 నాటౌట్; 2 ఫోర్లు) అజేయంగా నిలిచారు. ఫలితం వచ్చే అవకాశం లేకపోవడంతో 15 మాండెటరీ ఓవర్ల ప్రారంభానికి ముందే ఇరు జట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించడంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు. అంతకుముందు 96/2 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన హైదరాబాద్ తమ రెండో ఇన్నింగ్స్‌ను 6 వికెట్ల నష్టానికి 251 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. హనుమ విహారి (222 బంతుల్లో 68 నాటౌట్; 5 ఫోర్లు) రెండో ఇన్నింగ్స్‌లోనూ అర్ధ సెంచరీతో రాణించాడు. సుమన్ (97 బంతుల్లో 36; 6 ఫోర్లు), సందీప్ (74 బంతుల్లో 33; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ఆంధ్ర బౌలర్లలో సురేశ్‌కు 3 వికెట్లు దక్కగా, శివకుమార్ 2 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన హైదరాబాద్‌కు 3 పాయింట్లు దక్కగా, ఆంధ్ర ఖాతాలో 1 పాయింట్ చేరింది. షితాన్షుకు వీడ్కోలు... రాజ్‌కోట్: గత 21 ఏళ్లుగా సౌరాష్ట్ర క్రికెట్‌కు మూలస్థంభంలా నిలిచిన బ్యాట్స్‌మన్ షితాన్షు కొటక్‌కు ఆ జట్టు విజయంతో వీడ్కోలు పలికింది. బుధవారం ఇక్కడ ముగిసిన మ్యాచ్‌లో సౌరాష్ట్ర ఇన్నింగ్స్ 31 పరుగుల తేడాతో రాజస్థాన్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌తో రిటైర్మెంట్ ప్రకటించిన కొటక్ 130 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 15 సెంచరీతో 8061 పరుగులు చేశాడు. ఇతర రంజీ మ్యాచ్‌ల ఫలితాలు: పంజాబ్ ఇన్నింగ్స్, 48 పరుగులతో ఒడిషాపై విజయం గుజరాత్ ఇన్నింగ్స్ 1 పరుగు తేడాతో విదర్భపై విజయం మహారాష్ట్ర 9 వికెట్లతో త్రిపురపై విజయం కేరళ, అస్సాం మధ్య మ్యాచ్ డ్రా తమిళనాడు, సర్వీసెస్ మధ్య మ్యాచ్ డ్రా మధ్యప్రదేశ్, రైల్వేస్ మధ్య మ్యాచ్ డ్రా గోవా, హిమాచల్ ప్రదేశ్ మధ్య మ్యాచ్ డ్రా వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే ఢిల్లీ, జార్ఖండ్ మ్యాచ్ రద్దు వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే బెంగాల్, బరోడా మ్యాచ్ రద్దు