హైదరాబాద్, ఆంధ్ర మ్యాచ్ డ్రా
సాక్షి, హైదరాబాద్: రంజీ ట్రోఫీ సీజన్‌ను హైదరాబాద్, ఆంధ్ర జట్లు డ్రాతో ఆరంభించాయి. ఇరు జట్ల మధ్య ఇక్కడి రాజీవ్‌గాంధీ స్టేడియంలో జరిగిన గ్రూప్ ‘సి’ మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది.
చివరి రోజు వేగంగా ఆడి లక్ష్యాన్ని నిర్దేశిస్తుందని భావించిన హైదరాబాద్ ఎలాంటి దూకుడు కనబర్చకుండా నెమ్మదిగా ఆడి టీ విరామానికి కొద్ది సేపు ముందు మాత్రమే డిక్లేర్ చేసింది. ఫలితంగా అందుబాటులో ఉన్న 34 ఓవర్లలో 288 పరుగుల టార్గెట్‌ను ముందుంచింది. ఆట ముగిసే సమయానికి ఆంధ్ర 19 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 51 పరుగులు చేసింది. కేఎస్ భరత్ (61 బంతుల్లో 30 నాటౌట్; 6 ఫోర్లు), డీబీ ప్రశాంత్ (53 బంతుల్లో 20 నాటౌట్; 2 ఫోర్లు) అజేయంగా నిలిచారు.
ఫలితం వచ్చే అవకాశం లేకపోవడంతో 15 మాండెటరీ ఓవర్ల ప్రారంభానికి ముందే ఇరు జట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించడంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు. అంతకుముందు 96/2 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన హైదరాబాద్ తమ రెండో ఇన్నింగ్స్‌ను 6 వికెట్ల నష్టానికి 251 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.
హనుమ విహారి (222 బంతుల్లో 68 నాటౌట్; 5 ఫోర్లు) రెండో ఇన్నింగ్స్‌లోనూ అర్ధ సెంచరీతో రాణించాడు. సుమన్ (97 బంతుల్లో 36; 6 ఫోర్లు), సందీప్ (74 బంతుల్లో 33; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ఆంధ్ర బౌలర్లలో సురేశ్‌కు 3 వికెట్లు దక్కగా, శివకుమార్ 2 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన హైదరాబాద్‌కు 3 పాయింట్లు దక్కగా, ఆంధ్ర ఖాతాలో 1 పాయింట్ చేరింది.
షితాన్షుకు వీడ్కోలు...
రాజ్‌కోట్: గత 21 ఏళ్లుగా సౌరాష్ట్ర క్రికెట్‌కు మూలస్థంభంలా నిలిచిన బ్యాట్స్‌మన్ షితాన్షు కొటక్‌కు ఆ జట్టు విజయంతో వీడ్కోలు పలికింది. బుధవారం ఇక్కడ ముగిసిన మ్యాచ్‌లో సౌరాష్ట్ర ఇన్నింగ్స్ 31 పరుగుల తేడాతో రాజస్థాన్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌తో రిటైర్మెంట్ ప్రకటించిన కొటక్ 130 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 15 సెంచరీతో 8061 పరుగులు చేశాడు.
ఇతర రంజీ మ్యాచ్‌ల ఫలితాలు:
పంజాబ్ ఇన్నింగ్స్, 48 పరుగులతో ఒడిషాపై విజయం గుజరాత్ ఇన్నింగ్స్ 1 పరుగు తేడాతో విదర్భపై విజయం మహారాష్ట్ర 9 వికెట్లతో త్రిపురపై విజయం కేరళ, అస్సాం మధ్య మ్యాచ్ డ్రా తమిళనాడు, సర్వీసెస్ మధ్య మ్యాచ్ డ్రా మధ్యప్రదేశ్, రైల్వేస్ మధ్య మ్యాచ్ డ్రా గోవా, హిమాచల్ ప్రదేశ్ మధ్య మ్యాచ్ డ్రా వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే ఢిల్లీ, జార్ఖండ్ మ్యాచ్ రద్దు వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే బెంగాల్, బరోడా మ్యాచ్ రద్దు