Ration dealership
-
అయినా.. చర్యలేవీ..?
సాక్షి, కాకినాడ :జిల్లాలో ఖాళీగా ఉన్న రేషన్ డీలర్‌షిప్‌ల భర్తీ కోసం జూన్ 29, 30 తేదీల్లో నిర్వహించిన రాత, మౌఖిక పరీక్షల్లో చోటు చేసుకున్న అక్రమాలను ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన విషయం విదితమే. ఈ వ్యవహారంపై గత నెలలో నాలుగు రోజుల పాటు డివిజన్ల వారీగా జేసీ ఆర్.ముత్యాలరాజు విచారణ జరిపారు. ఈ నియామకాల్లో పెద్దఎత్తున అవకతవకలు జరిగినట్టు నిగ్గుతేల్చారు. జేసీ ఇచ్చిన నివేదిక ప్రకారం రాతపరీక్షలో ఎక్కువ మార్కులొచ్చిన వారికి ఇంటర్వ్యూల్లో తక్కువ మార్కులొచ్చినట్టుగా చూపించి పక్కన పెట్టేశారు. తక్కువ మార్కులొచ్చిన వారికి ఎక్కువ మార్కులు వేసి దొడ్డిదారిన ఎంపిక చేశారు. ఎగ్జామ్ హాల్లోకి సెల్ఫోన్లను అనుమతించడంతో పాటు కొందరు అభ్యర్థుల స్థానే వేరే వారిని రాత పరీక్షకు అనుమతించినట్టుగా గుర్తించారు. కనీస మార్కులు కూడా రాని వారికి, 18 ఏళ్లు కూడా నిండని వారికి, కనీస విద్యార్హత పదో తరగతిసర్టిఫికెట్లు సమర్పించని వారికి, అసలు ఎలాంటి విద్యార్హతలు లేనివారికిసైతం డీలర్‌షిప్‌లు కట్టబెట్టినట్టు జేసీ విచారణలో వెలుగుచూశాయి. చాలా ఆన్సర్ షీట్లలో కొన్ని జవాబులకు ఓ రంగు, మరికొన్ని జవాబులకు మరో రంగు పెన్నులను వాడినట్టు గుర్తించారు. రిజర్వ్డ్ స్థానాల్లో సైతం ఓసీ అభ్యర్థులకు డీలర్‌షిప్‌లను కట్టబెట్టినట్టుగా తేల్చారు. ఉదాహరణకు కాకినాడ అర్బన్‌లో షాపు నం.126 కోసం పరీక్ష రాసిన నిమ్మగడ్డ బాలాత్రిపురసుందరికి రాతపరీక్షలో 30 మార్కులొస్తే.. తుది జాబితాలో 60 మార్కులు వేసి ఎంపిక చేశారు. 2014 నవంబర్‌తో 18 ఏళ్లు నిండుతున్న భువన స్వాతికి రాజమండ్రి అర్బన్ షాపు నం.112ను కట్టబెట్టారు. సీతానగరంలో షాపు నం.51ను కట్టబెట్టిన గెడ్డం జయకుమార్ 8వ తరగతి చదివినట్టు చెబుతున్నప్పటికీ, ఎలాంటి విద్యార్హత పత్రాలు సమర్పించలేదు. స్థానికేతరుడైన మంచిగంటి శివాజీకి కాకినాడ అర్బన్ షాపు నం.60ను కట్టబెట్టినట్టుగా గుర్తించారు. ఇలా చెప్పుకొంటూ పోతే లెక్కలేనన్ని అక్రమాలు జేసీ విచారణలో బయటపడ్డాయి. దీంతో కాకినాడ రాజమండ్రి, పెద్దాపురం డివిజన్లలో పరీక్షలను రద్దు చేస్తున్నట్టు విచారణ అనంతరం జేసీ ప్రకటించారు. బాధ్యులపై చర్యల్లేవు ఈ వ్యవహారం రాష్ర్ట స్థాయిలో చర్చనీయాంశం కావడంతో జిల్లావ్యాప్తంగా జరిగిన డీలర్‌షిప్‌ల నియామకాలను నిలిపివేస్తూ పౌర సరఫరాల శాఖ కమిషనర్ గత నెలలోనే ఉత్తర్వులు జారీ చేశారు. జేసీ తన విచారణ నివేదికను గత నెల 8నకలెక్టర్కు సమర్పించారు. ఇది జరిగి 50 రోజులైనా బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అధికార పార్టీ పెద్దల ఒత్తిళ్ల మేరకే కలెక్టర్ ఈ నివేదికను తొక్కిపెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకరిద్దరు అధికారులకు షోకాజ్ నోటీసులు ఇచ్చినట్టుగా చెబుతున్నప్పటికీ, ఏ ఒక్కరిపై ఇప్పటివరకు ఎలాంటి శాఖాపరమైన చర్యలు తీసుకోలేదు. ఒక్కొక్క షాపునకు రూ.50 వేల నుంచి లక్ష రూపాయల చొప్పున తెలుగు తమ్ముళ్లకు కట్టబెట్టేందుకు అక్షరాలా రూ.అరకోటికి పైగా అధికారులు దండుకున్నట్టుగా ఆరోపణలు వినిపించాయి. ఇంత పెద్దఎత్తున అవినీతి జరిగినా.. బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఎలాంటి పరీక్షలు లేకుండానే పాత పద్ధతిలో తమ అనుచరులకు ఈ డీలర్‌షిప్‌లు కట్టబెట్టేందుకు కొందరు ‘దేశం’ నేతలు చాపకింద నీరులా రాష్ర్ట స్థాయిలో చక్రం తిప్పుతున్నట్టు సమాచారం. -
ఇద్దరు టీడీపీ కార్యకర్తల ఆత్మహత్యాయత్నం
బుక్కపట్నం : చౌక డిపో డీలర్‌షిప్‌లు తమకు దక్కలేదని అనంతపురం జిల్లా బుక్కపట్నం మండల కేం ద్రంలో ఇద్దరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆత్మహత్యకు యత్నిం చారు. వీరిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. టీడీపీ అభివృద్ధి కో సం పని చేస్తున్న తనకు కాదని మరొకరికి రేషన్ డీలర్షిప్ కట్టబెట్టారని మదిరేబైలుకు చెందిన ఆ పార్టీ కార్యకర్త రమణారెడి సోమవారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఊజీ మాత్రలు మింగాడు. ఇదే రీతిలో రామసాగరానికి చెందిన కార్యకర్త శంకర్ ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకునేందుకు సిద్ధపడగా పక్కనున్న వారు వారించారు. ఊజీ మాత్రలు మింగి అపస్మారక స్థితికి చేరుకున్న రమణారెడ్డిని 108 వాహనంలో స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తాము అనేక సంవత్సరాలుగా పార్టీలో నిజాయితీగా పని చేస్తున్నామని, అలాంటిది తమను కాదని డీలర్ షిప్పులు వేరే వారికి కట్టబెట్టడం ఏం న్యాయమని బాధితుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
యథేచ్ఛగా ‘పచ్చ’ ప్రలోభాలు
డోన్: పదవులు దక్కించుకొనేందుకు టీడీపీ నాయకులు.. వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఎలాగైనా ఎంపీపీ పదవులు దక్కించుకోవాలని అడ్డదారులు తొక్కుతున్నారు. డోన్ నియోజకవర్గంలో గత రెండురోజులుగా జరుగుతున్న పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయి. డోన్ మండలంలో మొత్తం 18 ఎంపీటీసీలలో 9 స్థానాలు టీడీపీ, 9 స్థానాలు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. దీంతో ఇక్కడ ఎంపీపీ ఎన్నిక ఉత్కంఠభరితంగా మారింది. అయితే రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో కొందరు అధికారపార్టీ నాయకులు డోన్ ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకోనేందుకు ఎత్తులు వేస్తున్నారు. వెంకటాపురం ఎంపీటీసీ (వైఆర్సీపీ మద్దతుతో గెలిచిన) సభ్యున్ని తమ వైపు తిప్పుకొనే ప్రయత్నాలు చేశారు, అయితే ఆయన వారి ఒత్తిళ్లకు తలొగ్గకపోవడంతో దిక్కుతోచని ఆ పార్టీనాయకులు ఉడుములపాడు ఎంపీటీసీ సభ్యురాలిని తమ వైపు తిప్పుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆ గ్రామంలోని టీడీపీ పార్టీ నాయకులతో సంప్రదించారు. పనులు ఇస్తాం, రేషన్ డీలర్‌షిప్‌లు ఇస్తామంటూ ప్రలోభాలు పెట్టి టీడీపీ వైపు తిప్పుకున్నారు. అయితే వైఎస్సార్సీపీ విప్ జారీచేయడంతో ఆఎంపీటీసీ సభ్యురాలు వైఎస్ఆర్సీపీకే ఓటువేయాలని భావిస్తున్నారు. దీంతో దిక్కుతోచని ఆపార్టీ నేతలు ఏమిచేయాలో తోచక మరో ఎంపీటీసీ సభ్యుడి కోసం ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలిసింది. ఇక ప్యాపిలి మండలంలో మెజార్టీ ఎంపీటీసీ స్థానాలను వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ సభ్యులను టీడీపీ నాయకులు కిడ్నాప్ చేయడం, ప్రలోభాలకు గురిచేయడం, ఎంపీటీసీ బంధువులను, కుటుంబసభ్యులను బెదిరింపులకు గురిచేస్తున్నారని తెలిసింది. అధికార దాహం కోసం టీడీపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు. -
బేరం మొదలైంది..
సాక్షి, ఒంగోలు : అందరూ ఊహించినట్లే టీడీపీ నేతల దందా మొదలైంది. పార్టీ అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఆదాయ మార్గాల కోసం తెలుగు తమ్ముళ్లు బిజీ అయ్యారు. జిల్లాస్థాయి నేతల కనుసన్నల్లో మెలిగే చోటామోటా నేతలు సైతం రేషన్ డీలర్‌షిప్‌లు, ఇతర పోస్టులకు బహిరంగంగా ‘బేరం’ పెడుతున్నారు. రూ.లక్షలాది సొమ్మును అతితక్కువ కాలంలో ఆర్జించేందుకు టీడీపీ ద్వితీయశ్రేణి నేతలు పన్నిన పన్నాగం.. జిల్లాలో పలుచోట్ల రక్తపాతానికి దారితీస్తోంది. తమ లాభార్జనకు అడ్డుగా ఉన్న వారిపై దాడులుకు తెగబడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో చోటుచేసుకుంటున్న వరుస దాడుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీవ్రగాయాలపాలవుతున్నారు. కనిగిరి నియోజకవర్గం పీసీపల్లి మండలం పెదఅలవలపాడులో గురువారం జరిగిన దాడి ఒకరి మృతికి దారితీసింది. ఇదేదాడిలో మరోముగ్గురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు గాయపడగా ఒంగోలు రిమ్స్‌లో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. టీడీపీ నేతల దుందుడుకు చర్యలపై అన్నివర్గాలు మండిపడు తున్నాయి. టీడీపీ అధికారంలోకి వచ్చీరాగానే ఆ పార్టీ నేతలు ధనార్జనకు వెంపర్లాడటంతోనే గ్రామాల్లో గొడవలు పెరుగుతున్నాయన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. దాడులపై పోలీసు అధికారులు సైతం పెద్దగా స్పందించకపోవడంపైనా విమర్శలు గుప్పుమంటున్నాయి. రూ. లక్షల్లో బేరం సార్వత్రిక ఎన్నికల్లో ప్రలోభాలకు భారీగా ఖర్చుపెట్టిన మొత్తాన్ని అతితక్కువ కాలంలో వసూలు చేసుకోవాలనే లక్ష్యంతో టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నట్లు ఆ పార్టీ కార్యకర్తలే గుసగుసలాడుతున్నారు. ఇందులో భాగంగానే రేషన్‌దుకాణాలు, కాంట్రాక్ట్ పోస్టులు, అంగన్వాడీలు, ఉపాధిహామీ పనులపై కన్నేసిన సంగతి బహిర్గతమైంది. పార్టీ కార్యాలయాల్లో సమావేశాలు పెట్టుకుని మరీ ఆయా అంశాల్లో లొసుగులు గుర్తించి తమకు అనుకూలంగా మలుచుకునేందుకు పార్టీ పెద్దలు పావులు కదుపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 2,202 రేషన్దుకాణాలుండగా వాటిల్లో 100 చోట్ల ఇన్‌చార్జిలే డీలర్షిప్ డీడీలు చెల్లిస్తూ నడిపిస్తున్నారు. జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలుగా ఉన్న నాలుగు నియోజకవర్గాలను మినహాయించి వైఎస్సార్సీపీ గెలిచిన చోట్ల రేషన్‌దుకాణాలపై కన్నేశారు. గ్రామంలో తమ పార్టీకి అనుకూలంగా ఉన్న పెద్ద మోతుబరిని గుర్తించి అతని వద్ద రూ. 2 లక్షల నుంచి రూ.4 లక్షలు దండుకుని రేషన్డీలర్షిప్పు ఇప్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అంగన్వాడీ కాంట్రాక్ట్ పోస్టులకు సైతం బేరంపెడుతున్నట్లు.. గ్రామాల్లో అంగన్వాడీ కార్యకర్తలను విధుల్లోకి రాకుండా అడ్డుకుంటున్నట్లు జిల్లా అధికారులకు ఫిర్యాదులొస్తున్నాయి. తమ నియోజకవర్గంలో టీడీపీ నేతలు అనవసరంగా జోక్యం చేసుకుని రేషన్డీలర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, సాఫీగా కొనసాగే డీలర్‌షిప్పులను రద్దు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదంటూ ఇప్పటికే సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ కలెక్టర్, ఆర్డీవోలను కలిసి ఫిర్యాదు చేశారు. ఇటువంటి వ్యవహారాలపై టీడీపీ అధిష్టానం స్పందించి పార్టీ శ్రేణులను కట్టడిచేయకుంటే ఆందోళనలకు సిద్ధపడతామని ప్రజాసంఘాల నేతలు, వ్యాపార, ఉద్యోగవర్గాలతో పాటు గ్రామీణులు హెచ్చరిస్తున్నారు.