యథేచ్ఛగా ‘పచ్చ’ ప్రలోభాలు
డోన్: పదవులు దక్కించుకొనేందుకు టీడీపీ నాయకులు.. వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఎలాగైనా ఎంపీపీ పదవులు దక్కించుకోవాలని అడ్డదారులు తొక్కుతున్నారు. డోన్ నియోజకవర్గంలో గత రెండురోజులుగా జరుగుతున్న పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయి. డోన్ మండలంలో మొత్తం 18 ఎంపీటీసీలలో 9 స్థానాలు టీడీపీ, 9 స్థానాలు వైఎస్‌ఆర్‌సీపీ కైవసం చేసుకుంది. దీంతో ఇక్కడ ఎంపీపీ ఎన్నిక ఉత్కంఠభరితంగా మారింది.
అయితే రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో కొందరు అధికారపార్టీ నాయకులు డోన్ ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకోనేందుకు ఎత్తులు వేస్తున్నారు. వెంకటాపురం ఎంపీటీసీ (వైఆర్‌సీపీ మద్దతుతో గెలిచిన) సభ్యున్ని తమ వైపు తిప్పుకొనే ప్రయత్నాలు చేశారు, అయితే ఆయన వారి ఒత్తిళ్లకు తలొగ్గకపోవడంతో దిక్కుతోచని ఆ పార్టీనాయకులు ఉడుములపాడు ఎంపీటీసీ సభ్యురాలిని తమ వైపు తిప్పుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇందులో భాగంగా ఆ గ్రామంలోని టీడీపీ పార్టీ నాయకులతో సంప్రదించారు. పనులు ఇస్తాం, రేషన్ డీలర్‌షిప్‌లు ఇస్తామంటూ ప్రలోభాలు పెట్టి టీడీపీ వైపు తిప్పుకున్నారు. అయితే వైఎస్సార్సీపీ విప్ జారీచేయడంతో ఆఎంపీటీసీ సభ్యురాలు వైఎస్‌ఆర్‌సీపీకే ఓటువేయాలని భావిస్తున్నారు. దీంతో దిక్కుతోచని ఆపార్టీ నేతలు ఏమిచేయాలో తోచక మరో ఎంపీటీసీ సభ్యుడి కోసం ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలిసింది. ఇక ప్యాపిలి మండలంలో మెజార్టీ ఎంపీటీసీ స్థానాలను వైఎస్‌ఆర్‌సీపీ కైవసం చేసుకుంది. వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీటీసీ సభ్యులను టీడీపీ నాయకులు కిడ్నాప్ చేయడం, ప్రలోభాలకు గురిచేయడం, ఎంపీటీసీ బంధువులను, కుటుంబసభ్యులను బెదిరింపులకు గురిచేస్తున్నారని తెలిసింది. అధికార దాహం కోసం టీడీపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు.