ration depo
-
రేషన్ డిపోల్లో విజిలెన్స్ తనిఖీలు
సాలూరురూరల్ (పాచిపెంట): పాచిపెంట మండలంలోని గురువునాయుడుపేట, పాంచాలి గ్రామాల్లోని రేషన్‌డిపోల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ కృష్ణ ఆధ్వర్యంలో అధికారులు శనివారం తనిఖీలు చేపట్టారు. గరువునాయుడుపేట డిపోలో మూడు క్వింటాళ్ల 88 కిలోల బియ్యం, 11 కిలోల పంచదార తేడా ఉన్నట్లు గుర్తించారు. దీంతో డీలర్ గొట్టాపు వెంకటస్వామినాయుడుపై కేసు నమోదు చేశారు. అలాగే పాంచాలి డిపో–1లో 30 కిలోల బియ్యం అధికంగా ఉన్నట్లు గుర్తించారు. చిన్న తప్పు దొర్లినా చర్యలు తప్పవని డీలర్ పెద్దిబాబును హెచ్చరించారు. అలాగే పాంచాలి –2 డిపోలో తనిఖీలు చేపట్టగా 5 క్వింటాళ్ల 16 కిలోల బియ్యం, 40 కిలోల పంచదార అధికంగా ఉన్నట్లు గుర్తించి డీలర్ గొర్లె అప్పన్నబాబుపై కేసు నమోదు చేశారు. అనంతరం సీఐ కృష్ణ మాట్లాడుతూ, రేషన్‌డిపోల్లో 100 కిలోల వరకు బియ్యం అదనపు నిల్వలు ఉంచవచ్చన్నారు. డిపోలు పారదర్శకంగా నిర్వహించాలనే ఉద్దేశంతోనే తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. ఆయన వెంట హెచ్‌సీ ధర్మారావు, సీఎస్‌డీటీ రామకృష్ణ, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. -
రేషన్‌డిపోల్లో విజిలెన్స్ అధికారుల తనిఖీలు
విజయనగరం గంటస్తంభం: విజయనగరం పట్టణంలో రేషన్ డిపోల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. ఏకకాలంలో మూడు డిపోల్లో తనిఖీలు చేసి లోపాలు గుర్తించారు. డీలర్లపై చర్యలకు పౌరసరఫరాల అధికారులకు సిఫార్సు చేశారు. దీంతో సంబంధిత అధికారులు 6ఏ కేసులు నమోదు చేసేందుకు చర్యలు చేపట్టారు. విజిలెన్స్ సీఐలు శ్రీనివాసరావు, కృష్ణ ఆధ్వర్యంలో అధికారుల బృందాలు వేర్వేరుగా తనిఖీలు చేపట్టారు. సీఐ కృష్ణ నేతృత్వంలో బృందం పట్టణంలో కె.ఎల్.పురంలో ఉన్న 70వ నెంబరు డిపోలో తనిఖీలు చేయగా ఆన్లైన్లో ఈపాస్ మిషను లెక్కలకు భౌతిక నిల్వలకు 39క్వింటాళ్ల బియ్యం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో డీలరు సూర్యకుమారిని ఆరా తీయగా గోదాం నుంచి ఇంకా రావల్సి ఉందని తెలిపారు. అయితే మొత్తం సరుకు గోదాము నుంచి వచ్చినట్లు ఉండడంతో తేడాగా గుర్తించారు. ఈ మేరకు సరుకు స్వాధీనం చేసుకుని విజయనగరం సీఎస్‌డీటీ రమణరాజుకు అప్పగించారు. అదేవిధంగా పుచ్చలవీధిలో 23నంబరు డిపోలో సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తనిఖీలు చేయగా రికార్డులతో పోల్చిచూస్తే భౌతిక నిల్వ 48క్వింటాళ్లు అధికంగా ఉంది. దీనిపై డీలరు సరస్వతి తరఫున దుకాణం నడుపుతున్న టి.మోహనరావును ఆరా తీయగా సరుకు సోమవారం సాయంత్రం వచ్చిందని, కానీ ఆన్లైన్లో గోదాం ఇన్‌ఛార్జి డెలవరీ కొట్టకపోవడం వల్ల ఈపాస్ యంత్రం గణాంకాల్లోకి రాలేదని చెప్పారు. అయితే ముందురోజు సాయంత్రం సరుకు వచ్చినా మరుసటి రోజు వరకు నమోదు కాకపోవడంపై అనుమానం వ్యక్తం చేసిన సీఐ కేసు నమోదుకు సీఎస్‌డీటీ రమణరాజుకు సిఫార్సు చేసి సరుకు స్వాధీనం చేసుకుని అప్పగించారు. అదేవిధంగా పట్టణంలో 22వ డిపోలో సీఐ శ్రీనివాసరావు జరిపిన తనిఖీల్లో రికార్డు కంటే 60క్వింటాళ బియ్యం తక్కువగా ఉన్నట్లు తేలింది. భౌతిక నిల్వ తక్కువగా ఉండగా రికార్డులో అధిక సరుకు ఉండడంతో అనుమానించిన సీఐ ఆరా తీశారు.అయితే గోదాం నుంచి సరుకు మొత్తం వచ్చినట్లు డిస్పాచ్ కొట్టి సరుకు 60క్వింటాలు తక్కువ ఇచ్చారని తెలిపారు. దీనిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని సీఐ పౌరసరఫరాల అధికారులకు సూచించి సరుకు అప్పగించారు. ఈ మేరకు విజయనగరం సీఎస్‌డీటీ రమణరాజు విచారణ చేపట్టారు. మంగళవారం సాయంత్రం మండలస్థాయి నిల్వ కేంద్రానికి వెళ్లి వివరాలు సేకరించారు. బుధవారం పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి కేసులు నమోదు చేస్తామని సీఎస్‌డీటీ తెలిపారు. -
క్యాష్‌లెస్ ప’రేషాన్’
రేషన్ సరుకుల పంపిణీలో నగదు రహిత లావాదేవీలు బ్యాంక్ ఖాతాలున్న వారికే సరఫరా 3 మండలాలు, అన్ని పట్టణాల్లో నిలిచిన సరుకుల పంపిణీ బలవంతపు ప్రయోగాలపై మండిపడుతున్న జనం జిల్లావ్యాప్తంగా మూతపడిన డిపోలు కొవ్వూరు : నగదు రహిత లావాదేవీల జపం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రజాహితాన్ని పూర్తిగా పక్కన పెట్టింది. జిల్లాలో అన్ని రేషన్ డిపోల్లో క్యాష్‌లెస్ విధానం అమలు చేయాలని అధికారులు ఆదేశించారు. దీంతో శుక్రవారం జిల్లావ్యాప్తంగా రేషన్ సరుకుల పంపిణీ నిలిచిపోయింది. నేరుగా డబ్బులిస్తే సరుకులు ఇచ్చేది లేదని.. బ్యాంకు ద్వారా చెల్లిస్తేనే పంపిణీ చేస్తామని డీలర్లు చెబుతుండటంతో పేదలు అష్టకష్టాలు పడుతున్నారు. నగదు రహితంగా రేషన్ సరుకులు పొందాలంటే కార్డుదారుడికి తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్ ఉండాలి. అదికూడా ఆధార్ నంబర్‌తో అనుసంధానమై ఉండాలి. సరుకులు పొందాలంటే కార్డుదారుడి అకౌంట్లో కనీసం రూ.100 నగదు ఉండాలి. తెలుపు రంగు రేషన్ కార్డుదారులంతా నిరుపేదలే కావడంతో వారంతా నగదు రహిత లావాదేవీలు నిర్వహించే అవకాశం లేక నిత్యావసర సరుకుల పొందేందుకు అవస్థలు పడుతున్నారు. ఇప్పటివరకు నగదు రహితంతోపాటు నగదు తీసుకుని కూడా సరుకులు అందించేవారు. ఈ నెల నుంచి నగదు విధానాన్ని పూర్తిగా రద్దు చేశారు. నగదు రహిత లావాదేవీ ద్వారా మాత్రమే సరుకులు ఇస్తామని అధికారులు భీష్మించడంతో పేదలు అవస్థలు పడుతున్నారు. పేదలపై బలవంతపు ప్రయోగాలు చేయడం విమర్శలు తావిస్తుంది. 25 శాతం కార్డులకే సరుకులు జిల్లాలో 2,163 రేషన్ దుకాణాలు ఉన్నాయి. వీటి పరిధిలో 11,96,775 తెల్లరేషన్ కార్డుదారులు ఉన్నారు. గత నెల నుంచి నగదు రహిత విధానాన్ని అమలు చేస్తూ.. కొత్త ఈపోస్ మెషిన్లు అందించారు. దెందులూరు, చాగల్లు, తాళ్లపూడి మండలాలతోపాటు 8 పురపాలక సంఘాలు, ఏలూరు నగరంతో కలిపి 759 రేషన్ డీలర్లకు ఎన్‌లాజిక్స్ మెషిన్లు, మిగిలిన 45 మండలాల్లోని 1,401 డిపోలకు విజన్‌టెక్ మెషిన్లు అందించారు. విజన్‌టెక్ మెసిన్లలో క్యాష్‌లెస్ విధానం బాగా పనిచేస్తోంది. గత నెలలో ప్రయోగత్మాకంగా పరిశీలించిన అధికారులు ఈనెల నుంచి పూర్తిస్థాయిలో నగదు రహిత లావాదేవీలు జరపాలని ఆదేశాలిచ్చారు. అయితే, ఎన్‌లాజిక్స్ మెషిన్లలో నగదు రహిత విధానం పనిచేయడం లేదు. ఈ కారణంగా రేషన్ సరుకుల పంపిణీని దెందులూరు, చాగల్లు, తాళ్లపూడి మండలాలతోపాటు జిల్లాలోని అన్ని పట్టణాల్లో శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి నిలిపివేశారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 3,18,314 కార్డుదారులకు (25.95 శాతం మందికి)మాత్రమే సరుకులు పంపిణీ చేశారు. జిల్లాలో శుక్రవారం సాయంత్రానికి కేవలం 89,637 మంది కార్డుదారులు మాత్రమే క్యాష్‌లెస్‌ను వినియోగించుకున్నారు. ప్రతినెలా 1నుంచి 5వ తేదీ లోపు సరుకుల పంపిణీ పూర్తి చేసే వారు. నాలుగైదు శాతం మిగిలితే వారికి 15వ తేదీ వరకు అందించేవారు. అటువంటిది ఈనెల 3వ తేదీ నాటికి కేవలం 26 శాతం మాత్రమే సరుకులు పంపిణీ పూర్తయ్యింది. ఎన్‌లాజిక్స్ మెషిన్లలో స్టాఫ్‌వేర్‌ను మార్పుచేసి సరుకులు పంపిణీ చేస్తామని చెబుతున్నా.. ఇది పూర్తికావడానికి చాలారోజులు పట్టే అవకాశం ఉంది. పేదలను ఇబ్బందులు పెట్టడం సరికాదు రేషన్ డిపోల్లో సరుకుల పంపిణీని నగదు రహిత లావాదేవీలతో ముడిపెట్టడం సరికాదు. నిరక్షరాస్యులైన పేదలకు క్యాష్‌లెస్ లావాదేవీలపై అవగాహన ఉండదు. ఈ విధానం పేరుతో బ్యాంక్ అకౌంట్లు తెరవాలంటే కష్టం. సరుకులు తెచ్చుకునే సమయానికి ఖాతాలో సొమ్ములు ఉండాల్సి ఉంటుంది. రేషన్ సరుకుల తెచ్చుకోవాలంటే బ్యాంక్‌కు వెళ్లి అకౌంట్లో సొమ్ము జమ చేయాల్సి ఉంటుంది. పరిజ్ఞానం లేని అమాయకులపై పెనుభారం మోపడమే. డబ్బులు తీసుకెళ్లినా సరుకులు అందించాలి. బలవంతపు విధానాలతో ప్రభుత్వం పేదలను ఇబ్బందులకు గురిచేసే పద్ధతి మార్చుకోవాలి. తానేటి వనిత, మాజీ ఎమ్మెల్యే సరుకులు పంపిణీ ఆపమనలేదు ఎనలాజిక్స్ ఈపోస్ యంత్రాల్లో సాఫ్ట్వేర్ ఆప్డేట్ చేయడం వాస్తవం. సరుకులు పంపిణీ ఆపమని ఏవిధమైన ఆదేశాలు ఇవ్వలేదు. ఏలూరులో సొమ్ములు చెల్లించిన వారికి సరుకులు అందిస్తున్నారు. కొవ్వూరులోను, ఇతర పట్టణాల్లోను రేషన్ సరుకుల పంపిణీ నిలిపివేసిన విషయమై మాకెలాంటి సమాచారం లేదు. సయ్యద్ యాసీన్, జిల్లా పౌర సరఫరాశాఖ అధికారి 15వ తేదీ వరకు సరుకులిస్తాం నగదు రహిత లావాదేవీలను ప్రజలకు అలవాటు చేసే ప్రక్రియలో భాగంగానే ఎన్‌లాజిక్స్ ఈపోస్ యంత్రాలున్న చోట్ల సరుకులు పంపిణీ ఈ రోజు ఆగింది. సాఫ్ట్వేర్ ఆప్డేట్ చేస్తున్నాం. శనివారం నుంచి వీటిలోనూ యధావిధిగా సరుకులు అందిస్తాం. ఈపోస్ యంత్రాలు వినియోగించుకోని వాళ్లకు నగదు తీసుకుని సరుకులు అందిస్తాం. ఈ విషయంలో అపోహలు పడాల్సిన అవసరం లేదు. పి.కోటేశ్వరరావు, జాయింట్ కలెక్టర్ -
అక్కడ తగ్గంది.. ఇక్కడ పెరిగింది
రేషన్ డిపోల్లో ఇకపై కిలో కందిపప్పు రూ.120 రూ.30 పెంచుతూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ వినియోగదారులపై భారీగా భారం రైతుబజార్లలో కిలో రూ.113లకే ఇకపై విక్రయం విజయనగరం గంటస్తంభం : కందిపప్పు ఇక పేదోడి ఇంట ఉడకటం కష్టమే. సబ్సిడీ ధరలపై రేషన్ డిపోల ద్వారా అందాల్సిన దీని ధర భారీగా పెంచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకప్పుడు సాధారణ ధరకే లభ్యమైన ఈ పప్పు దశలవారీగా పెంచేస్తూ సామాన్యుడికి అందనంతగా పెంచేశారు. విచిత్రంగా బహిరంగ మార్కెట్లో దీనిని రూ. 120లకే విక్రయిస్తుండగా... జిల్లా అధికారుల చర్చల మేరకు ఇకపై రూ. 113లకే విక్రయించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంటే రేషన్కంటే బయటి ధరే తక్కువన్నమాట. మరో భారం నిత్యవసర సరకుల ధరల పెరుగుదలతో అల్లాడిపోతున్న పేదలపై ప్రభుత్వం మరో భారం మోపింది. చౌకధరల దుకాణం ద్వారా ఇచ్చే కందిపప్పు ధరను ఒకేసారి కేజీపై రూ. 30లు పెంచింది. విశేషమేమిటంటే బహిరంగ మార్కెట్లో కందిపప్పు ధర తగ్గిన సమయంలో ప్రభుత్వం ధర పెంచడం విశేషం. దీంతో కోటా కందిపప్పు ఇక అక్కరకు రాదనడంలో సందేహం లేదు. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేసే కందిపప్పు ధర ఏడాది క్రితం కేజీ రూ.50 ఉండేది. బహిరంగ మార్కెట్లో కందుల కొరత, ధరల పెరుగుదల నేపధ్యంలో కాంట్రాక్టర్లు నష్టపోతున్నారని దాన్ని కాస్తా రూ. 90లకు పెంచారు. మళ్లీ తాజాగా రూ.120లకు పెంచారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు పౌరసరఫరాల సంస్థ కార్యాలయానికి బుధవారం వెలువడ్డాయి. ఈ మేరకు డీలర్లు కమీషన్ మినహాయించుకుని కేజీకి రూ.119.50 చెల్లించాలని అధికారులు సూచించారు. డీలర్లు లబ్ధిదారులకు రూ. 120కు విక్రయిస్తారు. ఈ విషయాన్ని పౌరసరఫరాలసంస్థ డీఎం కూడా ధ్రువీకరించారు. జిల్లా ప్రజలపై రూ.2కోట్లు భారం ప్రభుత్వం కేజీ కందిపప్పుపై రూ.30లు పెంచడంతో పేదలపై మోయలేని భారం పడనుంది. జిల్లాలో ఆగస్టు నెలకు సంబంధించి 6,67,683 తెలుపు, అంత్యోదయ, అన్నపూర్ణ కార్డులున్నాయి. ఒక్కో కార్డుకు ప్రభుత్వం కేజీ చొప్పున కందిపప్పు సరఫరా చేస్తోంది. ఇంతవరకు రూ. 90లకు లభించే కేజీ పప్పు ఇకపై రూ.120కు కొనుగోలు చేయాలి. పెరిగిన ధర ప్రకారం జిల్లాలో అందరు లబ్ధిదారులపై ఏకంగా రూ. 2కోట్లు భారం పడుతోంది. రైతుబజార్లలో ఇకపై రూ. 113లకే.. ప్రభుత్వం కందిపప్పు ధర పెంచిన తీరు విడ్డూరంగా ఉంది. బహిరంగ మార్కెట్లో కందిపప్పు ధర ప్రస్తుతం హోల్‌సేల్‌లో కేజీ రూ.125 ఉండగా రిటైల్‌లో రూ.130 వరకు ఉంది. పక్షం రోజుల క్రితం రూ.180 ఉండగా క్రమేపీ తగ్గుతూ వచ్చింది. ఇదిలా ఉండగా స్థానిక వ్యాపారుల సహకారంతో అధికారులు రైతుబజార్లలో కేజీ రూ. 120కు విక్రయిస్తుండేవారు. ఇకపై దాని ధర సైతం జేసీ చర్చల నేపథ్యంలో గురువారం నుంచి కిలో రూ. 113లకే లభ్యం కానుంది. సాధారణంగా బహిరంగ మార్కెట్లో ధర అధికంగా ఉన్నప్పుడు ఉపశమనం కోసం రైతుబజార్లలో తక్కువకు విక్రయిస్తారు. రేషన్‌డిపో(కోటా)లో ఇంతకంటే తక్కువకు విక్రయించాలి. కానీ ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో రూ. 125 ఉన్న సమయంలో ప్రభుత్వం ధర పెంచడం దారుణం. దీనివల్ల బహిరంగ మార్కెట్లో ధర ఇలాగే ఉంటే కోటా కందిపప్పు వల్ల ప్రజలకేమీ ప్రయోజనం ఉండదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. -
రేషన్ డిపోల అధ్యయనానికి చెన్నైకి వెళ్లనున్న సునీత
హైదరాబాద్: తమిళనాడులో రేషన్ డిపోల నిర్వహణపై అధ్యయనం చేయడానికి బుధవారం ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల మంత్రి సునీత చెన్నై వెళ్లనున్నారు. మంత్రి సునీత వెంట ఏపీ అధికారుల బృందం ఉంటుందని అధికారులు తెలిపారు. ఏపీలో కూడా తమిళనాడు తరహా విధానాన్ని ప్రవేశపెట్టే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉందని అధికారులు వెల్లడించారు. రెండు రోజులపాటు చెన్నైలో మంత్రి సునీత బృందం పర్యటించనుంది.